మూడ్రోజులకే ఉద్యోగం వదిలేశా!

క్లాసికల్‌ డ్యాన్సర్‌.., చెస్‌ ఛాంపియన్‌... హిందీ, ఉర్దూల్లో కవితలు రాయగల దిట్ట... మొత్తానికి ఆల్‌రౌండర్‌. ఇదీ మాల్వీ మల్హోత్రా పరిచయం. హీరోయిన్‌ అంటే గ్లామర్‌ డాల్‌ మాత్రమే అనే అభిప్రాయం తప్పని నిరూపిస్తున్న ఈ భామ ‘తిరగబడరాసామీ’తో తెలుగు తెరకు పరిచయమవుతోంది.

Published : 16 Mar 2024 00:05 IST

క్లాసికల్‌ డ్యాన్సర్‌.., చెస్‌ ఛాంపియన్‌... హిందీ, ఉర్దూల్లో కవితలు రాయగల దిట్ట... మొత్తానికి ఆల్‌రౌండర్‌. ఇదీ మాల్వీ మల్హోత్రా పరిచయం. హీరోయిన్‌ అంటే గ్లామర్‌ డాల్‌ మాత్రమే అనే అభిప్రాయం తప్పని నిరూపిస్తున్న ఈ భామ ‘తిరగబడరాసామీ’తో తెలుగు తెరకు పరిచయమవుతోంది. ఈ సందర్భంగా తన సినీ ప్రయాణాన్ని ‘ఈతరం’తో ఇలా పంచుకుంది.

  • ఆరాధించే నటి: మధుబాల
  • ఫస్ట్‌ క్రష్‌: మిషెల్‌ మొరానీ
  • నచ్చే దర్శకుడు: రాజమౌళితోపాటు చాలామంది
  • నటన కాకుండా: కథక్‌ క్లాసికల్‌ డ్యాన్సర్‌ని
  • ఖాళీగా ఉంటే?: కవితలు రాస్తా. త్వరలో ఓ పుస్తకం పబ్లిష్‌ అవుతోంది
  • ఇష్టమైన వ్యాపకం: పుస్తకాలు చదువుతా. సినిమాలు చూస్తా.
  • తెలుగులో నటించాలనుకునేది: అల్లు అర్జున్‌తో
  • ఫ్యాషన్‌ మంత్ర: సౌకర్యంగా ఉండటమే కాదు.. చీరలో అమ్మాయిలు అందంగా కనిపిస్తారు.
  • యువతకో సలహా: మనసు చెప్పింది వినండి. ఇష్టమున్న రంగాన్ని ఎంచుకోండి. మీపై మీరు నమ్మకం పెట్టుకోండి.

నేపథ్యం: మా సొంతూరు హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ. ఎలా మొదలైందో తెలియదుగానీ చిన్నప్పుడే నన్ను సినిమా పురుగు కుట్టింది. టీవీలో బొమ్మ కనపడితే చాలు.. తెరకి అతుక్కుపోయేదాన్ని. పెద్దవుతున్నకొద్దీ నేనూ తెరపై కనిపించాలనే కోర్కె మొదలైంది. అదే ధ్యాసతో కాలేజీ రోజుల్లో థియేటర్‌ ఆర్ట్స్‌ క్లాసులకు వెళ్లేదాన్ని. స్నేహితులతో కలిసి నాటకాలూ వేసేదాన్ని.

అమ్మానాన్నలు స్ట్రిక్ట్‌: మాదసలే సంప్రదాయ కుటుంబం. సినిమాలంటే అమ్మానాన్నలకు సదభిప్రాయం లేదు. నేను బాగా చదివి పెద్ద ఉద్యోగంలో స్థిరపడాలని వాళ్ల ఆశ. ముందునుంచీ చదువులో ముందే. అన్ని సబ్జెక్టుల్లో 90శాతం మార్కులొచ్చేవి. కానీ కంప్యూటర్‌ సైన్స్‌ అంటే బోర్‌. క్లాసులోనే నిద్రపోయిన సందర్భాలెన్నో. ‘మెరిట్‌ స్టూడెంట్‌ అయ్యుండీ ఇలా చేస్తావా?’ అని తిట్టేవాళ్లు టీచర్లు. నేనసలు పట్టించుకుంటేగా!

కథలు చెప్పా: సినిమా కథలు చూడటమే కాదు.. కథలల్లడం కూడా నాకు బాగా వచ్చు. ఒక్కోసారి క్లాసులు బంక్‌ కొట్టి మరీ నాటకాలు చూడటానికి వెళ్లేదాన్ని. సినిమాలకు చెక్కేసేదాన్ని. టీచర్లు అడిగితే అప్పటికప్పుడే ఏవో కథలు చెప్పేదాన్ని. నేనసలే మల్టీటాలెంటెడ్‌ కదా.. కాలేజీలోనే కాదు.. కాలేజీ బయట కూడా నాకు అభిమానులు ఎక్కువే. నా వెనకాల తిరిగే కొందరబ్బాయిలు ప్రపోజ్‌ కూడా చేశారు. కానీ నా ప్రేమ మొత్తం సినిమాలే కావడంతో.. ఎవరికీ ‘ఓకే’ చెప్పలేదు.

ముంబయి వచ్చేసి: నా లక్ష్యం సినిమాలు. ఈ విషయం చెబితే ఇంట్లో ఒప్పుకోరు. పైచదువుల కోసమని ముంబయి వచ్చేశా. ముంబయి విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్‌ సైన్స్‌ పీజీ పూర్తి చేశా. తర్వాత బీఎన్‌పీ పరిబస్‌ కంపెనీకి మంచి వేతనంతో ఎంపికయ్యా. కానీ రోజూ వెళ్లి ఒకచోట కంప్యూటర్‌ ముందు కూర్చోవడం.. లెక్కలేయడం నచ్చలేదు. ఇక్కడ చేయడం నావల్ల కాదంటూ మూడురోజులకే రిజైన్‌ లెటర్‌ ఇచ్చేసి వచ్చేశా.

తెరంగేట్రం: కాలేజీ రోజుల నుంచే థియేటర్‌ ఆర్ట్స్‌లో పాల్గొనేదాన్ని. తర్వాత అరవింద్‌ గౌర్‌ అనే ప్రముఖుడి దగ్గర శిష్యరికం చేశా. ఆపై పెద్దగా కష్టపడకుండానే ఒక టీవీ షోలో అవకాశం వచ్చింది. కమర్షియల్‌ యాడ్స్‌లో నటించా. ఆ అనుభవాన్ని సినిమాలకు ఓ మెట్టులా ఉపయోగించుకొని, నాలుగేళ్ల కిందట బాలీవుడ్‌లో తెరంగేట్రం చేశా.

అలా దొరికిపోయా: నా పీజీ పూర్తికాకముందే చాలా కమర్షియల్‌ యాడ్స్‌లో నటించా.. అదీ ఇంట్లో తెలియకుండా. ఓసారి శిల్పాశెట్టితో కలిసి నటించిన ఓ యాడ్‌ చూసి మా బంధువులు అమ్మానాన్నలకు చెప్పారట. మావాళ్లు బాగా గాబరా పడ్డారు. ఇంటికొచ్చేయమన్నారు. కానీ కొద్దిరోజులు వాళ్లని షూట్‌కి తీసుకెళ్లా. అక్కడి వాతావారణం చూశాక అమ్మాయిలకు భద్రత ఉందని నమ్మాక సమ్మతించారు. దాంతో పూర్తిస్థాయిలో సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టా.

తెలుగులోకి: ముంబయిలోని ఓ మ్యూజిక్‌ డైరెక్టర్‌ నా స్నేహితుడు. ఆయన ద్వారానే ‘తిరగబడరాసామీ’ నిర్మాతలను కలిశాను. పాత్రరీత్యా నటనకు మంచి అవకాశం ఉన్న ఓ నటి కావాలి. ఇందులో రొమాన్స్‌, డ్రామా, యాక్షన్‌.. అన్నింటికీ అవకాశం ఉంటుంది. నన్ను అన్నిరకాలుగా ఆడిషన్‌ చేశాక ప్రధాన హీరోయిన్‌గా తీసుకున్నారు. అలా మీ ముందుకొస్తున్నా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని