సంగీతం టీచరి..సినిమా బ్యాండ్‌

 ‘డిప్పకటింగ్‌ యెదవా.. జుట్టు కూడా అంది సావడం లేదు..’ అంటూ కవ్వించే గొంతుతో కుర్రాళ్లని మాయ చేసింది శివానీ నాగారం అనుకోకుండానే సినిమాలోకి వచ్చానంటున్న ఈ పక్కా హైదరాబాదీ ‘ఈతరం’తో పంచుకున్న కబుర్లు ఇవి.

Updated : 03 Feb 2024 01:19 IST

 ‘డిప్పకటింగ్‌ యెదవా.. జుట్టు కూడా అంది సావడం లేదు..’ అంటూ కవ్వించే గొంతుతో కుర్రాళ్లని మాయ చేసింది శివానీ నాగారం అనుకోకుండానే సినిమాలోకి వచ్చానంటున్న ఈ పక్కా హైదరాబాదీ ‘ఈతరం’తో పంచుకున్న కబుర్లు ఇవి.

హాయ్‌.. నేను అచ్చ తెలుగు అమ్మాయిని. సానియా మీర్జా చదివిన స్కూల్‌లోనే చదివా. ఇంటర్‌ సెయింట్‌ ఫ్రాన్సిస్‌లో పూర్తి చేశా. అక్కడే నా టాలెంట్‌ నిరూపించుకునే అవకాశం వచ్చింది. కుండని బోర్లించి దానిపై నృత్యం చేయడం. గ్రూప్‌ డ్యాన్స్‌.. లైట్‌ మ్యూజిక్‌.. ఇలా చాలానే ప్రదర్శించి ప్రైజులు గెల్చుకున్నా. విల్లామేరీ కాలేజీలో బీకాం పూర్తి చేశా. అక్కడ చదువుతోపాటు సరదాలూ ఎక్కువే. ఎప్పుడూ ఏవో ఉత్సవాలు జరుగుతూనే ఉండేవి. ప్రతి ఒక్కరూ తమ తమ టాలెంట్‌ని ప్రదర్శిస్తూనే ఉండేవారు. తర్వాత మీడియా వైపు వెళ్దాం అనుకొని జర్నలిజం కోర్సు చేశాను. సినిమాల్లోకి వెళ్లాలని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు.

* కమల్‌హాసన్‌, రజనీకాంత్‌, అల్లు అర్జున్‌, నానిల నటన నచ్చుతుంది.

* చదువులో మెరిట్‌ కాదుగానీ ఎబౌ యావరేజీనే. డిగ్రీలో 88శాతం మార్కులొచ్చాయి.  

* చదివిందంతా అమ్మాయిల కాలేజీ కావడంతో లవ్‌, ప్రపోజళ్లు అలాంటివేం లేవు.

* దేవుడిని బాగా నమ్ముతా. పూజలు బాగా చేస్తా.

* నేను కూచిపూడి డ్యాన్సర్‌ని కావడంతో భావోద్వేగాలు పలికించడం తేలికైంది.  
* స్నేహితులపరంగా నాది చిన్న సర్కిల్‌. మా ఇల్లే నా ఫేవరిట్‌ స్పాట్‌. కుదిరితే మా అమ్మమ్మ ఇంటికెళ్లిపోతా.

* మొదటి సినిమా ఎవరికైనా స్పెషలే. కళ్లతోనే భలే భావోద్వేగాలు పలికించావు అని అంతా మెచ్చుకుంటుంటే చెప్పలేనంత సంతోషంగా ఉంది.

* నేను గతంలో సంగీత కచేరీలు, యూట్యూబ్‌లో సిరీస్‌లు చేయడంతో కెమెరా ముందుకు వచ్చినప్పుడు భయం అనిపించలేదు. మా హీరో సుహాస్‌ రెండుసార్లు గుండు చేయించుకోవడంతో చిత్రీకరణ దాదాపు రెండేళ్లు జరిగింది. అయినా ఇదయ్యేవరకూ వేరే ప్రాజెక్టు ఒప్పుకోవద్దు అనుకున్నా. సినిమా బాగుందని రవితేజ, విజయ్‌ దేవరకొండ, నాగచైతన్య, అడవి శేష్‌లాంటివాళ్లు మెచ్చుకోవడంతో మేం పడ్డ కష్టానికి ఫలితం దక్కిందనిపించింది. షూటింగ్‌ జరిగినన్నాళ్లూ మేం ఒక కుటుంబంలా కలిసిపోయాం. చిత్రీకరణ పూర్తైనప్పుడు తెగ బాధ పడిపోయాం.
*  అనుకోకుండానే సినిమాల్లోకి వచ్చా. ఇప్పుడు నాతోపాటు నా కుటుంబం, బంధువులంతా హ్యాపీ. మావాళ్లు గర్వంగా ఫీలవుతున్నారు. నా తమ్ముడైతే మా అక్క చేసిన సినిమా చూడండంటూ అందరికీ చెబుతున్నాడు. మా బంధువులూ ‘అచ్చ తెలుగమ్మాయిని తెరపై చూస్తుంటే సంతోషంగా ఉంది’ అంటున్నారు. చిత్ర పరిశ్రమ కొందరు అనుకున్నంత చెడ్డదేం కాదు. ప్రతిభ ఉన్న తెలుగు అమ్మాయిలకు ఆహ్వానం పలుకుతూనే ఉంటుంది.

  •  అమ్మమ్మ రామలక్ష్మి రేడియో ఆర్టిస్టు. అమ్మ సంగీతం లెక్చరర్‌. పిన్ని నిత్యసంతోషిణి నేపథ్య గాయని. దీంతో సహజంగానే నాకూ మ్యూజిక్‌పై ఇష్టం ఏర్పడింది. అమ్మే నా తొలి గురువు. వీటితోపాటు డ్యాన్స్‌ కూడా నేర్చుకున్నా. కొవిడ్‌ సమయంలో ఖాళీగా ఉండటంతో పిల్లలకు ఆన్‌లైన్‌ సంగీత పాఠాలు నేర్పడం మొదలుపెట్టా. బయట లైవ్‌ ప్రదర్శనలు కూడా ఇచ్చేదానిని.
  • కొవిడ్‌కి ముందు సరదాగా ‘మిస్టర్‌ గాళ్‌ఫ్రెండ్‌’ అనే వెబ్‌సిరీస్‌ చేశా. బహుశా అది చూసే.. ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ ఆడిషన్‌కి పిలిచారు. కథ బాగుంది. మంచి పాత్ర ఇస్తామన్నారు. పెద్ద బ్యానర్‌.. వీటన్నింటిని వదులుకోలేక వెంటనే ఓకే చెప్పా. ఇంతకుముందు సినిమాని కెరియర్‌గా చేసుకోవాలి అని ఎప్పుడూ అనుకోలేదు. ఇప్పుడు పేరు, ప్రశంసలు వస్తుండటంతో మంచి పాత్రల కోసం ఎదురుచూస్తున్నా.
  •  ‘నేను సినిమాల్లో నటిస్తా’ అన్నప్పుడు అమ్మానాన్నలు అడ్డుచెప్పలేదుగానీ.. ఎలాంటి నేపథ్యం లేదు కదా.. ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయేమోనని కొంచెం భయపడ్డారు. వాళ్లని ఆడిషన్‌కి, గీతా ఆర్ట్స్‌ ఆఫీసుకి.. తీసుకెళ్లాను. అంతా సేఫ్‌ అని నమ్మకం కలిగాక.. ‘నీకు నచ్చింది చెయ్‌’ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని