పెళ్లయినా.. ఆరాధిస్తూనే ఉంటా!

ప్రతి మనిషీ జీవితంలో ఏదో ఒక సమయంలో ప్రేమలో పడతాడట. నేనూ పడ్డాను! కానీ అందరిలా అమ్మాయిలతో కాదు..

Updated : 03 Feb 2024 06:53 IST

మనసులో మాట

 ప్రతి మనిషీ జీవితంలో ఏదో ఒక సమయంలో ప్రేమలో పడతాడట. నేనూ పడ్డాను! కానీ అందరిలా అమ్మాయిలతో కాదు.. ప్రకృతితో! చిన్నప్పుడే.. నా ప్రేమ ప్రయాణం మొదలైంది. పచ్చని ప్రకృతిని చూస్తే చాలు.. నా మనసు పులకించిపోయేది. గలగలపారే సెలయేరు కనపడితే నా కళ్లకి తీయని మైకం కమ్మేది. అందుకే తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని చాలా అందమైన వనాలతో నా బంధం అల్లుకుపోయింది. అలాంటిది నా ప్రేమ ఓ అమ్మాయిపైకి మళ్లుతుందనుకోలేదు. జరిగిందదే.

 2019లో నాకు ఉద్యోగం వచ్చింది. దాంతో అందమైన అడవుల జిల్లా ఆదిలాబాద్‌ వదిలి, కాంక్రీట్‌ జంగిల్‌లాంటి హైదరాబాద్‌లో వచ్చి పడ్డా. మొదటి మూడు నెలలు మామూలుగానే గడిచాయి. తర్వాత ఆఫీసు క్యాంటీన్‌లో తనని మొదటిసారి చూశా. ఎప్పుడూ అందమైన అడవులు, వంకలు, వాగులు, నదుల చుట్టూ తిరిగే నా మనసు తొలిసారి ఆమె దగ్గర నిలిచిపోయింది. మరీ అందగత్తేం కాదుగానీ.. ముఖంలో లక్ష్మీ కళ ఉట్టిపడుతోంది. నడకలో హుందాతనం. తనని చూడగానే ఒకరకమైన గౌరవంతో కూడిన ఇష్టం మొదలైంది. నాకు తెలియకుండానే నా కళ్లు, కాళ్లు తనని అనుసరించాయి. అలా ఆమె వెనకే తను పని చేస్తున్న బిల్డింగ్‌ లోపలికి వెళ్తుంటే.. సెక్యూరిటీ గార్డు ఆపాడు. అప్పుడుగానీ ఈ లోకంలోకి రాలేకపోయా. మొత్తానికి తను నాలో నిండిపోయింది. పేరేంటో తెలియదు. ఏ విభాగంలో పని చేస్తుందో ఐడియా లేదు. ఎవరినైనా అడిగితే ఏమవుద్దో అనే భయం. అంతా అయోమయం. మరునాడు మళ్లీ తయారయ్యా. అదే సమయానికి అక్కడే కళ్లలో వత్తులేసుకొని ఎదురుచూశా.. కానీ దేవత దర్శన భాగ్యం కలగలేదు. రోజులు, వారాలు.. దినచర్యలా పాటించినా.. ఆమె జాడ లేదు. తన గురించే ఆలోచిస్తూ.. నైరాశ్యంలో మునిగిపోయా.

కొన్నాళ్లకి ఆఫీసు పనిలో భాగంగా వేరే జిల్లాకు వెళ్లా. రెండ్రోజుల తర్వాత ఓ కొత్త నెంబర్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. లిఫ్ట్‌ చేస్తే అవతలివైపు అమ్మాయి గొంతు. ‘హలో అండీ. నేను హెడ్డాఫీసు నుంచి చేస్తున్నా. మీరు పంపిన డాక్యుమెంట్‌ బాగుంది. కాకపోతే అందులో కొన్ని సందేహాలున్నాయి. నివృత్తి చేసి పంపగలరా?’ అందామె. సరేనన్నా. మర్నాడూ ఫోన్‌ చేసి డాక్యుమెంట్‌, వివరాలు వాట్సప్‌ చేయమంది. నెంబర్‌ సేవ్‌ చేసుకొని డీపీ చూడగానే.. నా కళ్లను నేనే నమ్మలేకపోయా. ఆ మేడమ్‌ ఎవరో కాదు.. నేను క్యాంటీన్‌ దగ్గర చూసిన నా ఆరాధ్య దేవత. నా సంతోషానికి హద్దుల్లేవు. మమ్మల్ని కలపాలనుకొని ఆ బ్రాహ్మ దేవుడే ఇలా ఫిక్స్‌ చేశాడనుకున్నా.  తొందరగా పని ముగించుకొని హైదరాబాద్‌ తిరిగొచ్చేశా.
తనెక్కడ ఉండేది తెలియడంతో.. ఓ అరగంట ముందే వెళ్లి పడిగాపులు కాయడం ప్రారంభించా. బస్సు దిగి.. పచ్చని చెట్ల మధ్యలోంచి మెల్లగా నడిచొస్తుంటే వనదేవతలాగే ఉంది. నన్ను సమీపిస్తున్నకొద్దీ గుండె భారమైంది. నా పక్కనుంచే నడిచి వెళ్తుంటే.. అలాగే చూస్తూ బిగుసుకుపోయా. మాట కలపడానికి ధైర్యం రాలేదు. ‘సరేలే.. ఒకే ఆఫీసులోనే ఉంటాం కదా.. కొన్నాళ్లు వన్‌సైడ్‌ లవ్‌ని ఎంజాయ్‌ చేద్దాం’ అని నాకు నేనే సర్ది చెప్పుకున్నా. పని వంకతో అప్పుడప్పుడు వాట్సప్‌ సందేశాలు పంపేవాడిని. తనూ బదులిచ్చేది. అలా నాలుగు నెలలు గడిచాయి. కానీ ఎన్నాళ్లిలా? ఆ ప్రేమనలాగే ఇంకా దాచుకుంటుంటే.. గుండె పేలిపోతుందేమో అనిపించేది. ఏదేమైనాగానీ ఆఖరికి నా ప్రేమను తనకు చేరవేయాలనుకున్నా.
నా ఫ్రెండ్‌ ఫ్రెండ్‌ ద్వారా ఆమె సెక్షన్‌లోకి ఎంటరయ్యా. అప్పుడే నా గుండె ముక్కలయ్యే సంగతి తెలిసింది. తనకు ఇంతకుముందే పెళ్లై, ఒక పాప కూడా ఉందట. తను నా జీవిత భాగస్వామి కాలేదని తెలిసిన ఆ క్షణం నా సర్వస్వం కోల్పోయినట్టు అనిపించింది. కొన్నాళ్లు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా. అతి కష్టమ్మీద కొన్నాళ్లకి తేరుకున్నా. నేను అమితంగా ప్రేమించే ప్రకృతి నా సొంతం కాదు. అయినా ప్రకృతిని ప్రేమించకుండా ఉండటం లేదు కదా! తనూ అంతే. అదే ఇష్టంతో అన్ని సందర్భాల్లో ఆమెకు తోడుగా ఉండాలని నిర్ణయించుకున్నా. అప్పుడప్పుడు మెసేజ్‌లు.. ఎప్పుడో ఓసారి ఫోన్‌కాల్‌.. వీటిలోనే ఆనందం వెతుక్కుంటున్నా.
సుభాష్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని