మరదలి కోసం ఇంకా పోరాడాల్సింది!

క్యాంటీన్‌లో దీర్ఘాలోచనలో ఉన్నా. మల్లెల పరిమళం నా దృష్టిని మరల్చింది. తల తిప్పి చూద్దును.. ఒకమ్మాయి నన్నే సమీస్తోంది. నాకేమో గుండె వేగం పెరగసాగింది. తను నా కళ్లముందుకి వస్తేగానీ తెలియలేదు.. ఆ అమ్మాయి నా మరదలేనని

Updated : 24 Jul 2021 01:34 IST

క్యాంటీన్‌లో దీర్ఘాలోచనలో ఉన్నా. మల్లెల పరిమళం నా దృష్టిని మరల్చింది. తల తిప్పి చూద్దును.. ఒకమ్మాయి నన్నే సమీస్తోంది. నాకేమో గుండె వేగం పెరగసాగింది. తను నా కళ్లముందుకి వస్తేగానీ తెలియలేదు.. ఆ అమ్మాయి నా మరదలేనని. ‘నువ్వేంటి ఇక్కడ?’ అన్నా ఆశ్చర్యంతో. ‘డిప్లొమా అయిపోయింది. నీది ఇదే కాలేజీ అని తెలిసింది. అందుకే వాలిపోయా బావా’ అంది. నాకోసం వచ్చావా? అంటే కనురెప్పలాడించింది అవునన్నట్టు. ఎప్పుడో స్కూల్‌ డేస్‌లో చూశాను. ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. అందంగా, చలాకీగా.. భలే ముద్దుగా ఉంది.

సినిమాలు, క్రికెట్‌, ఫ్రెండ్స్‌ తప్ప జీవితంలో ఇంకేదీ ముఖ్యమనిపించని రోజులవి. పరీక్షలు వచ్చినప్పుడే పుస్తకాల దుమ్ము దులిపేవాణ్ని. ఫైనలియర్‌కి వచ్చినా చుట్టంచూపుగా కాలేజీకి వెళ్లేవాణ్ని. అప్పుడొచ్చింది తను. సింగిల్‌ బతుక్కి ఓ తోడు దొరికినట్లయింది. పైగా వరసైంది. మెసేజ్‌లు, ఫోన్‌కాల్స్‌తో అనుబంధం తొందర్లోనే బలపడింది. క్యాంటీనే మా ప్రేమకు అడ్డా. మూడేళ్లు నిస్సారంగా సాగిన కాలేజీ జీవితానికి మరదలు రాకతో కావాల్సినంత ఆనందం దొరికింది.

చివరి ఏడాది కొవ్వొత్తిలా కరిగిపోయింది. ఫేర్‌వెల్‌ పార్టీ రోజున బాగా ఏడ్చింది. ‘నన్ను వదిలిపెట్టి వెళ్లవుగా బావా’ అంది బేలగా. ‘పిచ్చి పిల్లా నిన్నెట్లా మర్చిపోతా? నువ్వొచ్చాకే నామీద నాకు మరింత ఇంట్రెస్ట్‌ పెరిగిపోతేనూ.. అంటూ దగ్గరికి తీసుకున్నా. నిజానికి తనొచ్చాకే నాకు కెరీర్‌ మీద శ్రద్ధ పెరిగింది. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో ఉద్యోగం అయితే రాలేదుగానీ బతకగలననే ధైర్యమొచ్చింది. చదువైపోగానే ఒక కోచింగ్‌ సెంటర్లో చేరి శిక్షణ తీసుకున్నా. మునుపటి కన్నా ఎక్కువ శ్రద్ధతో చదవటం మొదలు పెట్టా. కానీ దురదృష్టంకొద్దీ ఏ ఉద్యోగమూ దొరకలేదు. మరోవైపు నా ఫ్రెండ్స్‌ మంచి కొలువుల్లో సెటిల్‌ అవుతున్నారు. సంవత్సరం దాటింది. అన్ని ప్రయత్నాలూ ఫెయిల్‌. జీవితంలో ఏం సాధించలేనేమో అనే డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా. ఆ సమయంలో తనే దేవతలా నాకోసం హైదరాబాద్‌ వచ్చింది. కావాల్సినంత ధైర్యం, చెప్పలేనంత ప్రేమనిచ్చింది. ‘వాళ్లదారి వేరు.. నీ పయనం వేరు.. కొన్ని లక్ష్యాలు చేరడానికి సమయం పడుతుంది. నువ్వేం టెన్షన్‌ పడొద్దు బావా’ అంది. నా కష్టాలన్నీ ఉఫ్‌మని ఊదేసినట్టు అనిపించింది. జీవితాన్ని అంత సులువుగా తీసుకునే తన తీరు చూస్తే ముచ్చటేసేది. మరదలు పక్కనుంటే ఏమైనా చేయగలను అనిపించేది. ఆ నమ్మకం వమ్ము కాలేదు. తన ఇంజినీరింగ్‌ పూర్తయ్యేలోపు నాకు మంచి ఉద్యోగమొచ్చింది. ముందు తనకే చెప్పా. నాకన్నా ఎక్కువగా సంబరపడింది. స్వీట్లు పంచింది. ఆ సంతోషం మా జీవితంలో ఎల్లకాలం ఉండాలనుకున్నాం.

ఒకరంటే ఒకరికి ప్రాణం. బతకడానికి ఉద్యోగం ఉంది. పైగా వరుసైన వాళ్లం. ఈ కారణాలన్నీ చాలవా? మేం ఒక్కటవ్వడానికి. కానీ అవి సరిపోలేదు. ఎప్పుడో మా చిన్నప్పుడు రెండు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయట. పాత పగలు మనసులో పెట్టుకొని మమ్మల్ని కలవొద్దన్నారు. మీ పంతాల కోసం మా ప్రేమని బలి చేయొద్దని వేడుకున్నాం. పెద్ద మనుషుల చిన్న బుద్ధులు మారలేదు. గత్యంతరం లేక విడిపోయాం. వెంటనే తనకు వేరే పెళ్లి చేశారు. నా జీవితం శూన్యం అయిన భావన. సొంతం అనుకున్న తనిప్పుడు పరాయి. ఆమె సుఖంగా ఉందో, లేదో తెలియదుగానీ నా బతుకు మాత్రం నరకమైంది. ఒక్కోసారి అనిపిస్తుంది.. కలిసి బతకడానికి మేం ఇంకా గట్టిగా పోరాడాల్సి ఉండాల్సిందేమో అని. కానీ ఏం లాభం? కొన్ని ప్రేమల్లో అబ్బాయి మోసం చేస్తాడు. కొన్నింట్లో అమ్మాయి మోసం చేస్తుంది. మేం ప్రాణంలా ప్రేమించుకున్నా ఆ దేవుడు మమ్మల్ని మోసం చేశాడు.

- ముని


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని