Updated : 19 Nov 2022 11:29 IST

కళ్లు లేకున్నా.. కలను వదల్లేదు

చంటిపిల్లాడిగా ఉన్నప్పుడే ఒక కన్ను కోల్పోయాడు...రోడ్డుప్రమాదంలో మరో కన్నూ పోయింది...అయినా లోకం అంధకారమైందని కుమిలిపోతూ కూర్చోలేదు చెన్నై యువకుడు గణేశన్‌. పట్టుబట్టి ముందుకెళ్లాడు. సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ప్రారంభించి ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నాడు.

ఒక సాఫ్ట్‌వేర్‌ రూపొందించడానికి చురుకైన మెదడు ఎంత అవసరమో.. కోడింగ్‌ వెంట పరుగులు పెట్టే కళ్లూ అంతే ప్రధానం. కానీ చూపు లేకపోయినా గణేశన్‌ ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీని దిగ్విజయంగా నిర్వహిస్తున్నాడు. ఇప్పటికి వందల ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేశాడు.

గణేశన్‌కి పుట్టుకతోనే దృష్టిలోపం. ఆరునెలల పసిగుడ్డుగా ఉన్నప్పుడు కళ్లకి శస్త్రచికిత్స జరిగింది. చాలా కష్టంగా కుడి కంటిని మాత్రమే కాపాడగలిగారు వైద్యులు. ఒక కన్నే ఉందని ఎప్పుడూ బాధ పడేవాడు కాదు. తనకి కంప్యూటర్‌ అంటే మొదట్నుంచీ ఆసక్తి. పదోతరగతిలో తల్లిదండ్రులు కంప్యూటర్‌ కొనిచ్చారు. లెక్కలన్నీ పుస్తకాల్లో రాసి భద్రపరచడం కంటే.. కంప్యూటర్‌ అప్లికేషన్‌ ఉపయోగిస్తే సమయం ఆదా అవుతుంది కదా అని భావించేవాడు. అప్పుడే ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ రూపొందించాలనే ఆలోచన మొదలైంది. ఆ ఆసక్తితోనే కంప్యూటర్‌ కోర్సులు నేర్చుకున్నాడు.

చీకటి నింపిన బస్సు ప్రమాదం

అంతా సవ్యంగా సాగిపోతున్న సమయంలో అనుకోని ప్రమాదం అతడి జీవితాన్ని అంధకారం చేసింది. ఓరోజు జరిగిన బస్‌ యాక్సిడెంట్‌లో ఉన్న ఒక్క కంటినీ కోల్పోయాడు. అప్పటికే పలు సాఫ్ట్‌వేర్‌ కోర్సులపై పట్టు సాధించినా చూపు లేకపోవడంతో ఎవరూ ఉద్యోగం ఇవ్వలేదు. మరోవైపు స్నేహితులకి ఉద్యోగాలు రావడంతో విదేశాలకు వెళ్లారు. అంతా తనపై జాలి పడటం గణేశన్‌కి అసలు నచ్చేది కాదు. ఇలా బాధ పడుతూ ఇంట్లో కూర్చోవడం కంటే ఏదైనా చేయాలని భావించాడు. వెంటనే ఒకట్రెండేళ్ల అనుభవం ఉన్న ముగ్గురు ఉద్యోగులను తీసుకొని ‘డాక్టియస్‌ ఇన్ఫో సొల్యూషన్స్‌’ పేరుతో సొంతంగా సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ప్రారంభించాడు. తర్వాత కథ మళ్లీ మొదటికొచ్చింది. గణేశన్‌లో ఎంత ప్రతిభ ఉన్నా.. చూపు లేకపోవడంతో ఎవరూ ప్రాజెక్టులు ఇచ్చేవాళ్లు కాదు. కొందరైతే మీవల్ల ఏమవుతుందని ముఖం మీదే అనేవారు. అయినా కుంగిపోయేవాడు కాదు. పట్టుదలగా ప్రయత్నించగా.. చివరికి ఓ వ్యాపార సంస్థ సాఫ్ట్‌వేర్‌ తయారు చేయమని కోరింది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని తానేంటో నిరూపించుకున్నాడు. దీంతో ప్రాజెక్టులు వరుస కట్టాయి. అలా ఇప్పటివరకు సంస్థ తరపున 250 ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం అమెరికా, మలేసియా కంపెనీలకు సైతం సాఫ్ట్‌వేర్‌ సేవలు అందించే స్థాయికి చేరుకున్నాడు. సంస్థలో 40 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ‘మనలో వైకల్యం ఉందని కుంగిపోవద్దు. మనకి తోడ్పాటునందించే మనసులు ఈ ప్రపంచంలో చాలానే ఉన్నాయి. ఆ ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకొని కొంచెం కష్టపడితే ఎవరికీ తీసిపోకుండా విజయాలు సాధించగలుగుతాం’ అంటూ తనలాంటి దివ్యాంగులకు సూచిస్తున్నాడు.

- రావినూతల ఆశీర్వాదం, చెన్నై


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని