Chandrababu: ఆడపడుచుల ఆత్మగౌరవ సభలు

ఆడపడుచుల ఆత్మగౌరవం కోసం డిసెంబరు ఒకటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో గౌరవ సభలు నిర్వహించాలని తెదేపా పొలిట్‌ బ్యూరో నిర్ణయించింది. ప్రజాస్వామ్య

Updated : 27 Nov 2021 04:35 IST

డిసెంబరు 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో...

వరద మరణాలపై జ్యుడీషియల్‌ విచారణ జరిపించాలి

అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలి

అధికారంలోకి రాగానే ఉచితంగా ఇళ్ల రిజిస్ట్రేషన్‌

తెదేపా పొలిట్‌బ్యూరో భేటీలో తీర్మానాలు

ఈనాడు, అమరావతి: ఆడపడుచుల ఆత్మగౌరవం కోసం డిసెంబరు ఒకటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో గౌరవ సభలు నిర్వహించాలని తెదేపా పొలిట్‌ బ్యూరో నిర్ణయించింది. ప్రజాస్వామ్య సౌధమైన శాసనసభను కౌరవ సభగా మార్చి మహిళల వ్యక్తిత్వంపై ఏ విధంగా దాడి చేశారో ప్రజాచైతన్యం కల్పించాలని పేర్కొంది. తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు అధ్యక్షతన పొలిట్‌ బ్యూరో శుక్రవారం సమావేశమైంది. వరద మరణాలపై జ్యుడీషియల్‌ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేసింది. తుపాను ముందస్తు చర్యల్లో ప్రభుత్వం వైఫల్యం చెందిందని, వరద మరణాలకు ఇసుక మాఫియా చర్యలూ కారణంగా ఉన్నాయని పేర్కొంది. అమరావతి పరిరక్షణ ప్రజా పాదయాత్రకు సంఘీభావం ప్రకటించింది. ఈ సమావేశంలో చర్చించిన అంశాలు, తీర్మానాలను పొలిట్‌ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. వరద మృతులకు రూ.25 లక్షల పరిహారం చెల్లించాలి

* వరద మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.లక్ష పరిహారంగా ఇవ్వాలి. వరి, వేరుశనగ పంటలకు హెక్టారుకు రూ.25 వేలు, అరటికి రూ.30 వేలు, ఆక్వాకు రూ.50 వేలు, ఉపాధి కోల్పోయిన చేనేత కార్మికులకు రూ.25 వేలు చెల్లించాలి. ఇళ్లు కోల్పోయిన వారికి తక్షణ సాయం కింద రూ.లక్షల అందించి, శాశ్వత గృహాన్ని ఉచితంగా నిర్మించి ఇవ్వాలి.

* అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలి. రెండున్నరేళ్లల్లో ప్రభుత్వం మూడు ప్రాంతాల అభివృద్ధికి చేసింది ఏమీ లేదు. తెదేపా పాలనలోనే నిజమైన వికేంద్రీకరణ. జగన్‌రెడ్డి పాలనలో అంతా అతి కేంద్రీకరణ జరుగుతోంది.

* 1983 నుంచి ఉన్న గృహాలకు డబ్బులు చెల్లించమని ప్రభుత్వం సామాన్యులను ఒత్తిడి చేస్తోంది. ఇందు కోసం చేసిన చట్టాన్ని రద్దు చేయాలి. తెదేపా అధికారంలోకి రాగానే గృహాలను ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తుందని వెల్లడించింది.

నిధుల మళ్లింపు రాజ్యాంగ ధిక్కరణే
* పంచాయతీల నిధులు దారి మళ్లింపు 73వ రాజ్యాంగ సవరణను ధిక్కరించడమేనని, వెంటనే పంచాయతీలకు నిధులు జమ చేయాలని డిమాండ్‌ చేసింది.

* సెకితో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం విద్యుత్తు వినియోగదారులపై పెను భారం మోపేలా ఉంది.

* రాష్ట్ర ఆర్థిక నిర్వహణపై కాగ్‌ సీరియస్‌ వ్యాఖ్యలు చేసింది. ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి.

* బీసీ జనగణన చేయాలి. బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్ల కోసం  కేంద్రంపై ఒత్తిడి చేయాలి.

* మోటారు వాహనాల చట్టం ద్వారా పన్నులు పెంచడం వల్ల లక్షలాది మందిపై భారం పడుతుంది. ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి.

* వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో అసలు నిందితులను రక్షించే విధంగా ముఖ్యమంత్రి చర్యలు ఉన్నాయి.

* శాసనమండలి రద్దు, పునరుద్దరణపై వైకాపా విధానం... వ్యవస్థ పట్ల ఎంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందో స్పష్టం చేస్తోంది.

* పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుతో ప్రజలపై విపరీతమైన భారం పడుతోంది. నిత్యావసరాల ధరలు పెరిగాయి. పెట్రోల్‌పై రూ.16, డీజిల్‌పై రూ.17 తగ్గించాలని పొలిట్‌ బ్యూరో డిమాండ్‌ చేసింది. వరి వేయరాదన్న మంత్రుల ప్రకటనను ఖండించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని