Updated : 29/11/2021 06:26 IST

నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలను.. వీడని వాన

ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోనూ భారీ వర్షాలు
చిత్తూరు, కడప జిల్లాల్లో విద్యాసంస్థలకు నేడు సెలవు

ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే బృందం: ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శని, ఆదివారాల్లో నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ సోమవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ స్టెల్లా తెలిపారు. దక్షిణ అండమాన్‌ సముద్రంలో మంగళవారం అల్పపీడనమేర్పడి తర్వాత 48 గంటల్లో బలపడి పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశముందని పేర్కొన్నారు. చిత్తూరు, కడప జిల్లాల్లో విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటించారు.

నెల్లూరు జిల్లాలో అత్యధికంగా వర్షపాతం: ఆదివారం ఉదయం 8.30 నుంచి రాత్రి 7 గంటల మధ్య అత్యధికంగా నెల్లూరు జిల్లా చిల్లకూరులో 15.4, నాయుడుపేటలో 12.2 సెం.మీ. వర్షపాతం నమోదైంది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో 7.3, ఇరుగులంలో 7.1, కడప జిల్లా సిద్దవటంలో 6 సెం.మీ. వర్షం కురిసింది. శనివారం ఉదయం 8.30 గంటలనుంచి ఆదివారం ఉదయం 8.30 గంటలమధ్య అత్యధికంగా నెల్లూరు జిల్లా విడవలూరులో 11, నాయుడుపేట 10.7, ఆత్మకూరు 10.2, చిల్లకూరు మండలం చింతవరంలో 8.4, కడప జిల్లా చిట్వేలులో 7.4, చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం ఇరుగులంలో 6.5 సెం.మీ.వర్షపాతం నమోదైంది.గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. విజయవాడలో ఆదివారం రాత్రి ఒక్కసారిగా కుండపోత పడింది. రోజంతా రాష్ట్రవ్యాప్తంగా ముసురు వాతావరణం కనిపించింది.

నెల్లూరుజిల్లా పెద్దపడుగుపాడులో వర్షపునీటిలో చింతాలమ్మ అమ్మవారి దేవస్థానం

తిరుమల కనుమ దారిలో జాగ్రత్తలు: తిరుమలలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. తిరుమల-తిరుపతి మధ్య రెండు కనుమ దారులను ఆదివారం రాత్రి పదింటికి తితిదే మూసేయించింది. సోమవారం వేకువజామున 2గంటల నుంచి నాలుగుచక్రాల వాహనాలను అనుమతించనున్నారు. నడక మార్గాల్లో ఉదయం 6 నుంచి సాయంత్రం 4 గంటల వరకు భక్తులను అనుమతిస్తున్నారు.చిత్తూరు జిల్లాలోని కాళంగి, అరణియార్‌ జలాశయాల గేట్లను ఎత్తివేశారు. శ్రీకాళహస్తి మండలం కండ్రుగుంట చెరువుకు గండిపడింది. శ్రీకాళహస్తి కైలాసగిరి పర్వతశ్రేణుల్లోంచి రాళ్లు జారిపడుతుండటంతోరాకపోకలను నియంత్రించారు. వరదయ్యపాళెం మండలం నెలటూరులో గోడకు చెమ్మతో విద్యుత్‌షాక్‌ తగిలి ఇంటర్‌ విద్యార్థి కిషోర్‌ (17) చనిపోయారు.


ప్రతి రైతునూ ఆదుకుంటాం: మంత్రి కన్నబాబు

కరప, న్యూస్‌టుడే: భారీ వర్షాలకు నష్టపోయిన రైతులందరినీ ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. తడిసిన, మొలకవచ్చిన ధాన్యాన్ని ప్రభుత్వం ఆర్‌బీకేల ద్వారా కొంటుందని చెప్పారు. కౌలు రైతులకు తీవ్ర నష్టమేర్పడిందని.. పంటల బీమా, పెట్టుబడి రాయితీ ప్రయోజనాలను సీసీఆర్‌సీ కార్డులు లేనివారికీ అందించేందుకు భూయజమానులు సహకరించాలని కోరారు. తూర్పుగోదావరి జిల్లా కరప మండలం పెనుగుదురు, కరప, కూరాడ గ్రామాల్లో ఆదివారం ఆయన పర్యటించారు. దెబ్బతిన్న పొలాలను పరిశీలించారు. స్వర్ణ రకం పంట సుమారు 80శాతం మేర నష్టమైందని మంత్రి వివరించారు.


కళ్లెదుటే కుప్పకూలిన రెండంతస్తుల భవనం

కడప జిల్లా రైల్వేకోడూరు పరిధిలోని నరసరాంపేట సమీపంలో గుంజనేరు వాగు ఒడ్డున ఒరిగిపోతున్న భవనం

రైల్వేకోడూరు, న్యూస్‌టుడే: కడప జిల్లా రైల్వేకోడూరు పరిధిలోని నరసరాంపేట సమీపంలో గుంజనేరు వాగు ఒడ్డున ఉన్న రెండంతస్తుల భవనం కుప్పకూలింది. షేక్‌ బాదుల్లా, మహమ్మద్‌ రఫి, షేక్‌ ఖాజాబీ, షేక్‌ నజీర్‌ కుటుంబాలకు చెందిన భవనమిది. ఇటీవలి వర్షాలకు భవనం పాక్షికంగా దెబ్బతినడంతో వారు బంధువుల ఇళ్లలో ఉంటున్నారు. ఆదివారం మధ్యాహ్నం భవనం ఒక్కసారిగా కుప్పకూలిందని బాధితులు తెలిపారు. మరోవైపు కడప జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. కడప నగరం మరోమారు జలమయమైంది.

కూలిన ఇంటి వద్ద షేక్‌ బాదుల్లా కుటుంబం


సోనూసూద్‌ ఫౌండేషన్‌ సాయం

సోనూసూద్‌ ఫౌండేషన్‌ సభ్యులు అందజేసిన కిట్‌లతో తిరుపతిలోని వరద బాధితులు

తిరుపతి వరద బాధితులకు ప్రముఖ సినీనటుడు సోనూసూద్‌ ఫౌండేషన్‌ ద్వారా నిత్యావసరాలతో పాటు పలు రకాల వస్తువులను అందజేస్తున్నారు. రూ.900 విలువ ఉన్న కిట్లను ఫౌండేషన్‌ సభ్యుడు, ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా పాలకమండలి సభ్యుడు మించల ప్రదీప్‌ ఆధ్వర్యంలో బాధితులకు అందజేస్తున్నారు. ఇప్పటివరకు 4వేల మంది బాధితులకు ఇచ్చారు.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని