Sirivennela Seetharama Sastry: నీ ఉచ్ఛ్వాసం కవనం.. నీ నిశ్వాసం శోకం

సిరివెన్నెలలో ఆడుకున్న అక్షరాలపై అమావాస్య చీకట్లు అలముకున్నాయి. అర్ధశతాబ్దపు అజ్ఞానాన్నే స్వరాజ్యమందామా? అంటూ సమాజాన్ని నిగ్గదీసిన యోచనా రుషి శాశ్వతంగా సెలవు తీసుకున్నారు.

Updated : 01 Dec 2021 05:17 IST

తుదిశ్వాస విడిచిన సిరివెన్నెల సీతారామశాస్త్రి

గతంలో ఊపిరితిత్తుల కేన్సర్‌కు శస్త్రచికిత్స

ఇటీవల రెండోవైపు మరోసారి..

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ సహా రాజకీయ, సినీ ప్రముఖుల సంతాపం

ఈనాడు - హైదరాబాద్‌

సిరివెన్నెలలో ఆడుకున్న అక్షరాలపై అమావాస్య చీకట్లు అలముకున్నాయి. అర్ధశతాబ్దపు అజ్ఞానాన్నే స్వరాజ్యమందామా? అంటూ సమాజాన్ని నిగ్గదీసిన యోచనా రుషి శాశ్వతంగా సెలవు తీసుకున్నారు. మూడున్నర దశాబ్దాలపాటు తన అక్షరాస్త్రాలతో సామాజిక రుగ్మతలను చెండాడిన కలం యోధుడు కన్నుమూశారు. అభ్యుదయాన్ని జాలువార్చి... ఆశావాదాన్ని రంగరించి... చైతన్యాన్ని ప్రోది చేసి... కుర్రకారుపై చిలిపి ప్రేమలనూ చిలకరించిన సీతారామశాస్త్రి సిరా శాశ్వతంగా ఇంకిపోయింది. ‘చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిలీ...’ అంటూ నింగికెగసిపోయింది. ‘నటరాజస్వామి జటాఝూటిలోకి చేరకుంటే.. విరుచుకుపడు సురగంగకు విలువేముందీ’... అంటూ ‘కల’చాలనం చేసిన సాహితీ శిఖరం ఒరిగిపోయింది. ‘ఘల్లుఘల్లుఘల్లుమంటు మెరుపల్లే తుళ్లిన పదాలు... ఝల్లుఝల్లున ఉప్పొంగిన జనహృదయాల’కు తీరని శోకం మిగిల్చింది.

తెలుగుతెరకు వెన్నెలసోన లాంటి పదాలతో అక్షరకాంతులు అద్దిన ప్రముఖ గేయ రచయిత ‘సిరివెన్నెల సీతారామశాస్త్రి’(66) ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం 4.07 గంటలకు కన్నుమూశారు. ఆరోగ్యం తీవ్రంగా విషమించి తుదిశ్వాస విడిచినట్లు కిమ్స్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బి.భాస్కర్‌రావు తెలిపారు. ‘‘సీతారామశాస్త్రికి ఆరేళ్ల క్రితం ఊపిరితిత్తులకు కేన్సర్‌ సోకింది. సర్జరీ చేసి కొంత భాగం తొలగించారు. తర్వాత గుండెలో సమస్య తలెత్తడంతో బైపాస్‌ సర్జరీ చేశారు. మళ్లీ కొద్ది రోజుల క్రితం ఊపిరితిత్తులకు రెండోవైపు కేన్సర్‌ కన్పించింది. బంజారాహిల్స్‌లోని ఓ ఆసుపత్రిలో చేరడంతో సర్జరీ చేసి కొంత భాగం తొలగించారు. రెండురోజుల వరకు ఆరోగ్యం నిలకడగానే ఉంది. తర్వాత న్యుమోనియా, ఇతర సమస్యలు తలెత్తాయి. నవంబరు 24న కిమ్స్‌ ఆసుపత్రికి తీసుకొచ్చారు. తొలి రెండు రోజులు చికిత్సకు స్పందించారు. న్యుమోనియా ఇతర సమస్యలతో ఆక్సిజన్‌ సక్రమంగా అందలేదు. దీంతో ఎక్మో యంత్రం సాయం అందించాం. అయిదు రోజుల నుంచి ఆయన ఎక్మోపైనే చికిత్స పొందారు. ఇప్పటికే కేన్సర్‌ సోకడం.. గతంలో బైపాస్‌ సర్జరీ.. దీనికితోడు అధిక బరువు ఇతర సమస్యలతోపాటు కిడ్నీలు విఫలమయ్యాయి. కిమ్స్‌ వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆరోగ్యం పూర్తిగా విషమించింది. మంగళవారం సాయంత్రం 4.07 గంటలకు సిరివెన్నెల తుదిశ్వాస విడిచారు’’ అని డాక్టర్‌ భాస్కర్‌రావు వివరించారు. ఆయన మృతికి ప్రధాని నరేంద్రమోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్‌మోహన్‌రెడ్డి సహా పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు.

‘సిరివెన్నెల’ చిత్రంతో విధాత తలపున.. పాటతో ప్రాచుర్యం పొందిన ఆయన ఆ సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నారు. ఎనిమిది వందలకు పైగా చిత్రాల్లో మూడు వేలకు పైగా పాటలు రచించిన సిరివెన్నెల  అసలు పేరు చేంబోలు సీతారామశాస్త్రి. సినీ పరిశ్రమకు చేసిన సేవలకుగాను భారత ప్రభుత్వం 2019లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి 11 నంది పురస్కారాలు ఆయనకు దక్కాయి. తన పాటలతో తెలుగు ప్రేక్షకుడి స్థాయిని పెంచిన శాస్త్రి 1955 మే 20న చేంబోలు వేంకటయోగి, సుబ్బలక్ష్మి దంపతులకు ప్రథమ సంతానంగా మధ్యప్రదేశ్‌లోని శివనిలో జన్మించారు. ఆయన బాల్యం, ప్రాథమిక విద్యాభ్యాసం అనకాపల్లిలో జరిగాయి. కాకినాడలో ఇంటర్మీడియట్‌ చేశారు. ఆ తర్వాత ఆంధ్ర వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌లో చేరారు. ఏడాది పూర్తయ్యాక టెలికంలో అసిస్టెంట్‌గా ఉద్యోగం రావడంతో చదువుకు స్వస్తి పలికి అందులో చేరారు. రాజమహేంద్రవరం, తాడేపల్లిగూడెం, కాకినాడలలో పనిచేశారు. ఆ సమయంలోనే ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి బీఏ పట్టా అందుకున్నారు. ఎంఏ ప్రథమ సంవత్సరంలో చదువు ముగించారు. కాకినాడలో పనిచేస్తున్నప్పుడు ఏర్పడిన సాహితీ పరిచయాలు ఆయన జీవితాన్ని మలుపుతిప్పాయి. ‘భరణి’ అనే కలం పేరుతో పత్రికల్లో కథలు, కవితలు రాసిన ఆయన.. మిత్రులు, సోదరుడి ప్రోత్సాహంతో రచనా వ్యాసంగంపై దృష్టి పెట్టారు. ఆ సమయంలోనే ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్‌ ‘సిరివెన్నెల’ సినిమాకు పాటలు రాసే అవకాశం కల్పించారు. మొదట బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ‘జననీ జన్మభూమి’ సినిమాతో సీతారామశాస్త్రి సినీ ప్రయాణం మొదలైనా, ‘సిరివెన్నెల’ పాటలతోనే ఆయనకు గుర్తింపు లభించింది. ఆ సినిమాలోని ‘విధాత తలపున..’ పాటకు తొలి నంది పురస్కారం లభించింది. ఆపై కె.విశ్వనాథ్‌ దర్శకత్వం వహించిన అన్ని సినిమాలకూ పాటలు రచించారు. కళాతపస్వితో పాటు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సిరివెన్నెలను ప్రేమగా సీతారాముడు అని పిలిచేవారు. మూడున్నర దశాబ్దాలుగా సాగుతున్న ‘సిరివెన్నెల’ సినీ ప్రయాణం ఆయన తుదిశ్వాస వరకు కొనసాగింది. ఇటీవలి ‘నారప్ప’, ‘కొండపొలం’, ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’,  ‘శ్యామ్‌ సింగరాయ్‌’ సినిమాలకూ ఆయన పాటలు రాశారు.

జగమంత కుటుంబం ఆయనది..

‘చక్రం’ సినిమా కోసం ‘జగమంత కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాది’ అంటూ తన కలాన్ని కదిలించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి అందుకు తగ్గట్టే జగమంత తెలుగు కుటుంబాన్ని, వాళ్ల ప్రేమాభిమానాల్ని సంపాదించుకున్నారు. ‘సిరివెన్నెల’ పాట లేకుండా సినిమా చేయడానికి ఇష్టపడని దర్శక నిర్మాతలు, కథానాయకులు చాలామందే ఉన్నారు. ఆయనకు భార్య పద్మావతి, కుమార్తె లలితాదేవి, కుమారులు సాయి వెంకట యోగేశ్వరశర్మ, రాజా భవానీ శంకరశర్మ (రాజా) ఉన్నారు. యోగేశ్వరశర్మ సంగీత దర్శకుడిగా, రాజా నటుడిగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ వీరికి దగ్గరి బంధువు. తాను దర్శకత్వం వహించే ప్రతి సినిమాలోనూ సీతారామశాస్త్రి పాట ఉండాల్సిందే అంటుంటారు త్రివిక్రమ్‌.

పాటలకు కిరీటాలు..

‘సిరివెన్నెల’లోని ‘విధాత తలపున’., ‘శ్రుతిలయలు’లోని ‘తెలవారదేమో స్వామి’, ‘స్వర్ణకమలం’లోని ‘అందెల రవమిది పదములదా’.., ‘గాయం’లోని ‘సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకని’.., ‘శుభలగ్నం’లోని ‘చిలకా ఏ తోడు లేకా’.., ‘శ్రీకారం’ సినిమాలోని ‘మనసు కాస్త కలత పడితే’.., ‘సిందూరం’లోని ‘అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే’.., ‘ప్రేమకథ’లోని ‘దేవుడు కనిపిస్తాడని’.., ‘చక్రం’ సినిమాలోని ‘జగమంత కుటుంబం నాది’.., ‘గమ్యం’లోని ‘ఎంత వరకు ఎందు కొరకు’.., ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లోని ‘మరీ అంతగా..’ పాటలకుగానూ సిరివెన్నెలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది పురస్కారాలు దక్కాయి. 

నేడు అంత్యక్రియలు..

సిరివెన్నెల భౌతిక కాయానికి బుధవారం హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి అభిమానులు, సినీ రాజకీయ ప్రముఖుల సందర్శన కోసం తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ఆవరణంలో ఉంచనునున్నట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

తెలుగు సినిమా పాటకు రెండు కళ్లలాంటి వారు వేటూరి, సిరివెన్నెల. వేటూరి మనకు ఇదివరకే దూరం కాగా, ఇప్పుడు సిరివెన్నెల సెలవు పలకడంతో తెలుగు పాట విషాదంలో మునిగిపోయింది. సిరివెన్నెల ఇక లేరని తెలియగానే చిత్రసీమ మూగబోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని