రూ.1200 కోట్ల భూమిపై కన్ను!

విశాఖ నగరంలో అత్యంత విలువైన ప్రాంతంలోని భూమిని విక్రయించి... ఆదాయం సముపార్జించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గతంలో మధ్య తరగతి ప్రజల కోసం బహుళ అంతస్తుల నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని

Published : 23 Jan 2022 03:54 IST

మధ్య, అధిక ఆదాయవర్గాలకు ‘రాజీవ్‌ స్వగృహ స్థలం’
విశాఖ ఎండాడలోని 57 ఎకరాలు చదును

ఈనాడు, విశాఖపట్నం: విశాఖ నగరంలో అత్యంత విలువైన ప్రాంతంలోని భూమిని విక్రయించి... ఆదాయం సముపార్జించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గతంలో మధ్య తరగతి ప్రజల కోసం బహుళ అంతస్తుల నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని ఎంపిక చేసుకుంది. దీన్ని ప్లాట్లుగా విడగొట్టి మధ్య, అధిక ఆదాయవర్గాలకు విక్రయించే ఆలోచనలో ఉంది. ఈమేరకు శుక్రవారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంపై అప్పటి దరఖాస్తుదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

విశాఖలోని ఎండాడ వద్ద రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌కు 57.53 ఎకరాల భూమి ఉంది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 2007లో ఏర్పాటుచేసిన రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌కు దీన్ని కేటాయించారు. పూర్తిగా కొండ ప్రాంతమైన ఈ భూమిని చదును చేసి, మధ్య తరగతి ప్రజలకు రెండు, మూడు పడక గదుల అపార్టుమెంట్లు నిర్మించి ఇస్తామని ‘ఆద్రజ’ అనే పేరిట నిర్మాణ ప్రాజెక్టును ప్రారంభించారు. ప్రజల నుంచి దరఖాస్తులను ఆహ్వానించి కొంత రుసుం వసూలు చేశారు. ఆకర్షనీయ ప్రాజెక్టు కావడంతో అప్పట్లో వేల మంది దరఖాస్తులు చేశారు. వివిధ కారణాలతో ప్రాజెక్టు మధ్యలోనే నిలిచిపోయింది. దరఖాస్తుదారుల సొమ్మును సైతం వెనక్కి ఇచ్చేయడం ప్రారంభించారు. చాలామందికి విషయం తెలియక, మరికొందరు మళ్లీ అవకాశం ఉంటుందనే ఆశతో డబ్బులను వెెనక్కి తీసుకోలేదు. ప్రాజెక్టు మరోసారి పట్టాలెక్కుతుందనే ఆశతో 15 ఏళ్లుగా కొందరు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వ తాజా నిర్ణయంతో వారంతా ఆందోళనకు గురవుతున్నారు. తాము గతంలోనే దరఖాస్తు చేసుకున్నామని, ఇక్కడ తమకే అవకాశం కల్పించాలని డిమాండు చేస్తున్నారు. అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరిస్తున్నారు.

కొండ ప్రాంతంలోని 57 ఎకరాలలో కొంతమేరకు అప్పట్లో చదును చేశారు. ప్రాజెక్టు నిలిచిపోయాక... కొన్ని అసంపూర్తి కట్టడాలు, నమూనా భవనాలు, కొన్ని పునాదుల స్థాయి నిర్మాణాలు మిగిలాయి. అవికాకుండా చాలాప్రాంతం గోతులతో ఉంది. ప్రస్తుతం వాటిని పూడ్చుతున్నారు. ఈ మొత్తం ప్రాంతమంతటినీ లేఅవుట్‌గా మార్చనున్నట్లు తెలుస్తోంది. ఈ పనుల కోసం ప్రాథమికంగా జీవీఎంసీ నిధులను ఖర్చు చేస్తున్నారు.

నగరం మధ్యన... తీరానికి చేరువన

ప్రభుత్వం ఎంపిక చేసుకున్న భూమి విశాఖ నగరానికి మధ్యలో, సముద్ర తీరానికి అతి చేరువలో ఉంది. అత్యంత విలువైన ఈ భూమి మొత్తాన్ని ఇళ్ల స్థలాలుగా అభివృద్ధి చేసి, విక్రయించడానికి ఇప్పటికే అన్ని రకాల పనులను దాదాపుగా పూర్తి చేశారు. ఇటీవల ఈ ప్రాంతానికి మార్కెట్‌ విలువను పునఃస్థిరీకరణ (రీఫిక్స్‌) చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎకరా రూ.21.75 కోట్లుగా నిర్ణయించినట్లు తెలిసింది. ఈ లెక్కన ప్రభుత్వ మార్కెట్ విలువ ప్రకారమే ఈ భూమి ధర రూ.1239 కోట్లు పలుకుతోంది. బహిరంగ మార్కెట్లో రూ.2 వేల కోట్లకుపైగానే ఉండొచ్చని అంచనా. దీన్ని మొత్తం ప్లాట్లుగా విక్రయిస్తారా, మరో రూపంలో అమ్ముతారా... అర్హులను లాటరీ విధానంలో ఎంపిక చేస్తారా, వేలం నిర్వహిస్తారా అనేది తేలాల్సి ఉంది. ఈ క్రమంలో కొందరు పెద్దలకు మేలు చేకూర్చేలా వ్యవహరిస్తారేమో అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే రాజకీయాల్లో ఉన్న కొందరు రియల్‌ ఎస్టేట్ పెద్దలు దీనిపై కన్ను వేశారన్న ఆరోణలు ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని