CM Jagan: పాల సేకరణలో మోసాల నివారణకు తనిఖీలు

పాలసేకరణలో జరిగే మోసాలను నివారించడానికి విస్తృత తనిఖీలు చేస్తున్నామని, ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 20 కేసులు నమోదు చేశామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి

Updated : 29 Jan 2022 03:51 IST

లీటరుకు 45 పైసల నుంచి రూ.10.95 వరకు తక్కువ ఇస్తున్న ప్రైవేటు డెయిరీలు

అనంతపురంలో పాలసేకరణను ప్రారంభించిన సీఎం జగన్‌

ఈనాడు, అమరావతి: పాలసేకరణలో జరిగే మోసాలను నివారించడానికి విస్తృత తనిఖీలు చేస్తున్నామని, ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 20 కేసులు నమోదు చేశామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. మోసాల్లో పట్టుబడిన కేసులను పరిశీలిస్తే.. ప్రైవేటు డెయిరీలు లీటరుకు 45 పైసల నుంచి రూ.10.95 చొప్పున తక్కువగా చెల్లిస్తున్నట్లు వెల్లడైందన్నారు. జగనన్న పాలవెల్లువలో భాగంగా అనంతపురం జిల్లాలో అమూల్‌ పాలసేకరణ కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 4,900 బల్క్‌మిల్క్‌ కూలింగ్‌ యూనిట్ల(బీఎంసీయూ)ను, 11,690 ఆటోమేటిక్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్ల(ఏఎంసీయూ)ను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. అమూల్‌ విస్తరించే కొద్దీ.. వీటన్నింటిని అందుబాటులోకి తెస్తామన్నారు. ‘పాలు పోసే సమయంలో ఎన్ని లీటర్లు పోశారు? ఎంత ధర వస్తుందనే వివరాలతో రశీదు కూడా ఇస్తాం. నాణ్యతను పరీక్షించే విధానమూ ఉంది. మార్కెట్లో ఇతర ప్రైవేటు డెయిరీలు ఇచ్చే ధర కంటే అమూల్‌ అధికంగా చెల్లించి పాలను సేకరిస్తోంది. వచ్చిన లాభాలను బోనస్‌ రూపంలో ఆరు నెలలకోసారి వెనక్కి ఇస్తుంది. నిజంగా సహకారరంగం అంటే పాలు పోసే వారికే లాభాలొస్తాయి. దేశం మొత్తం మీద దానిని అమూల్‌ చూపించింది...’ అని ప్రశంసించారు. ఇప్పటివరకు ప్రకాశం, చిత్తూరు, కడప, గుంటూరు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో పాలసేకరణ చేస్తున్న అమూల్‌.. ఇప్పుడు అనంతపురం జిల్లాలోకి వచ్చిందని సీఎం జగన్‌ వివరించారు.

అంగన్‌వాడీలకు పాలు, బాలామృతం సరఫరాపై అమూల్‌తో ఒప్పందం

రాష్ట్రంలో బాలామృతం, అంగన్‌వాడీ కేంద్రాలకు పాల సరఫరాపై అమూల్‌తో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఈ మేరకు పత్రాలపై సంతకాలు చేశారు. తమ సంస్థ గత 15 ఏళ్లుగా వివిధ రాష్ట్రాల్లో అంగన్‌వాడీలు, పాఠశాలల్లో రోజుకు 25 లక్షల మంది పిల్లలకు రోజూ తాజా ఫ్లేవర్డ్‌ పాలు సరఫరా చేస్తోందని అమూల్‌ ఎండీ ఆర్‌ఎస్‌ సోధి వెల్లడించారు. ‘ఆంధ్రప్రదేశ్‌లోనూ ప్రాసెసింగ్‌ కేంద్రాలకు దగ్గరలోని కేంద్రాలకు తాజా ఫ్లేవర్డ్‌ పాలు సరఫరా చేస్తాం. సబర్‌కాంత పాడి సహకార సంఘం ఆధ్వర్యంలో ప్లాంటు ఏర్పాటు చేసి అంగన్‌వాడీల్లోని పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందిస్తాం.  రాష్ట్రంలో పాల ప్రాసెసింగ్‌కు తగిన సౌకర్యాలు కల్పించాలి. మదనపల్లిలో ఒక యూనిట్‌ ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో వచ్చే నెలలో యూనిట్లు ప్రారంభమవుతాయి. అప్పుడు అక్కడే పాలు ప్రాసెస్‌ చేసి ప్యాక్‌ చేసి విక్రయిస్తాం’ అని ఎండీ ఆర్‌ఎస్‌ సోధి వివరించారు. తమకు అవకాశం కల్పించిన సీఎం జగన్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం రోజుకు లక్ష లీటర్ల పాలు వస్తున్నాయని, రాబోయే రోజుల్లో సేకరణ మరింత పెరుగుతుందని చెప్పారు. తమ పాలకు అధిక ధర లభిస్తోందని ఈ సందర్భంగా పలువురు మహిళలు సీఎం జగన్‌కు వివరించారు. కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌, మంత్రులు సీదిరి అప్పలరాజు, తానేటి వనిత, సీఎస్‌ సమీర్‌శర్మ, వ్యవసాయ మిషన్‌ వైస్‌ఛైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి, వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్‌ అనూరాధ, ఏపీడీడీసీఎఫ్‌ ఎండీ ఎ.బాబు, పశుసంవర్థకశాఖ డైరెక్టర్‌ అమరేంద్రకుమార్‌, కైరా మిల్క్‌, బనస్కాంత, సబర్‌కాంత పాల సంఘాల ఎండీలు అమిత్‌ వ్యాస్‌, సంగ్రామ్‌ చౌదరి, అనిల్‌ బయాతీ, అమూల్‌ సీనియర్‌ జీఎం రాజన్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని