AP News:‘గ్రామ’ ఉద్యోగులకు ఆర్థిక గండం!

ఉద్యోగంలో చేరి రెండేళ్లయినా ప్రొబేషన్‌ ఖరారవ్వక చాలీచాలని జీతంతో గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. వీరిలో అత్యధికులు వివిధ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగం చేస్తూ

Updated : 10 Jan 2022 04:54 IST

 గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్‌ ఖరారులో జాప్యం

అరకొర వేతనాలతో అవస్థలు

ఈనాడు - అమరావతి

ఉద్యోగంలో చేరి రెండేళ్లయినా ప్రొబేషన్‌ ఖరారవ్వక చాలీచాలని జీతంతో గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. వీరిలో అత్యధికులు వివిధ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగం చేస్తూ పరీక్షలు రాసి ఎంపికైనవారే. సచివాలయాల్లో ప్రస్తుతం వస్తున్న జీతంకంటే ప్రైవేటు సంస్థల్లో రెండింతలు పొందేవారు. ప్రభుత్వ ఉద్యోగం కావడంతో చేరారు. రెండేళ్లు పూర్తయ్యాక ప్రొబేషన్‌ ఖరారైతే జీతం పెరుగుతుందని ఆశించారు. సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్‌, కన్ఫర్మేషన్‌ ప్రక్రియ జూన్‌30లోగా పూర్తి చేస్తామని సీఎం ఉద్యోగ సంఘాల నాయకులతో తాజాగా శుక్రవారం హామీనిచ్చారన్న సమాచారంతో వారు మరింత ఆవేదనకు గురయ్యారు. ఎన్నాళ్లీ ఆర్థిక కష్టాలని ఆందోళన చెందుతున్నారు.

మొదట కలెక్టరు... ఇప్పుడు ప్రభుత్వం

సచివాలయాల్లో ఉద్యోగుల ప్రొబేషన్‌ను కలెక్టర్లే ఖరారు చేస్తారని 2021 సెప్టెంబరు29న జారీ చేసిన సర్క్యులర్‌లో గ్రామ, వార్డు సచివాలయాలశాఖ పేర్కొంది. జిల్లా ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో ఉద్యోగాల నియామక ప్రక్రియ పూర్తి చేసినందున ప్రొబేషన్‌ ప్రక్రియను కలెక్టర్లు పూర్తి చేస్తారని అధికారులు అప్పట్లో   వెల్లడించారు.

2021 డిసెంబరు 17న విడుదలచేసిన మరో సర్క్యులర్‌లో ప్రొబేషన్‌ ఖరారు చేయదలచిన ఉద్యోగుల జాబితాలను కలెక్టర్లు సంబంధిత ప్రభుత్వ శాఖల రాష్ట్ర స్థాయి విభాగాధిపతులకు పంపాలని సూచించారు. వీటిని ప్రభుత్వం ఆమోదించాకే ఉద్యోగుల ప్రొబేషన్‌ ఖరారైనట్లు భావించి సవరించిన వేతనాలు అమలుచేయాలని వార్డు, సచివాలయాల శాఖ పేర్కొంది.  2నెలల వ్యవధిలో ఇచ్చిన రెండు సర్క్యులర్లతో జిల్లాల్లో ప్రొబేషన్‌ ప్రక్రియ కొలిక్కి రాలేదు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలకూ దూరం

సచివాలయాల్లో చేరిన వారంతా ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు అనర్హులుగా తేల్చారు.  రేషన్‌, ఆరోగ్యశ్రీ కార్డులను వారు కోల్పోయారు. అప్పటివరకు పిల్లలకు అందిన జగనన్న    అమ్మఒడి, విద్యా దీవెన రద్దు చేశారు.


ఎందుకీ జాప్యం?

ఉద్యోగుల ప్రొబేషన్‌ ఖరారు చేస్తే ప్రభుత్వంపై నెలకు దాదాపు రూ.134 కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా. ప్రస్తుతం నెలకు రూ.15వేల జీతం చొప్పున రాష్ట్రంలోని 1,34,694 మంది సచివాలయ ఉద్యోగులకు రూ.202 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ప్రొబేషన్‌ ఖరారుచేసి వేతనాలు సవరిస్తే ఒక్కో ఉద్యోగికి నెలకు సుమారు రూ.25వేల జీతం చెల్లించాల్సి ఉంటుందని లెక్కిస్తున్నారు. అంటే నెలకు రూ.336 కోట్లు అవసరవుతాయి. ఆర్థికంగా ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మరింత భారమని ప్రొబేషన్‌ ఖరారులో జాప్యం చేస్తుందా? అనే అనుమానాన్ని ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు.


క ప్రైవేటు సంస్థలో నెలకు రూ.30వేల వేతనం వదులుకుని సచివాలయ ఉద్యోగిగా చేరా. రెండేళ్లకుపైగా నెలకు రూ.15వేల జీతానికి పని చేస్తున్నా. ఇంటి అద్దె, రోజువారీ ఖర్చులు, పిల్లల స్కూలు ఫీజులకు నెలకు రూ.25వేలు ఖర్చవుతోంది. చక్కటి ఉద్యోగం వదులుకుని ఎందుకు చేరానా? అని ఒక్కోసారి బాధేస్తోంది.

-గుంటూరు జిల్లాలోని ఒక గ్రామసచివాలయం ఉద్యోగి ఆవేదన


నెలకు రూ.40 వేల జీతం ఇస్తామన్న బెంగళూరులోని సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో చేరుదామనేలోగా సచివాలయాల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇవ్వడంతో పరీక్ష రాసి ఎంపికయ్యా. గది అద్దె, భోజనం, బండికి పెట్రోల్‌, ఇతర ఖర్చులకే రూ.15వేల జీతం సరిపోవడం లేదు. ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని ఊహించలేకపోయా.

-తూర్పుగోదావరి జిల్లాలోని ఒక వార్డు సచివాలయ ఉద్యోగి ఆందోళన

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని