CM jagan: సీఎం వస్తున్నారని గృహ నిర్బంధం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలు పర్యటన నేపథ్యంలో విధించిన ఆంక్షలు ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెట్టాయి. కృష్ణానగర్‌లో పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి ఇంట వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు శనివారం సీఎం విచ్చేశారు.

Updated : 17 Apr 2022 05:28 IST

 కర్నూలులో పలువురి ఇళ్లకు తాళాలు వేసిన వైనం

జన సంచారం పూర్తిగా నిషిద్ధం

కర్నూలు నేరవిభాగం, సచివాలయం, కల్లూరు గ్రామీణ, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలు పర్యటన నేపథ్యంలో విధించిన ఆంక్షలు ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెట్టాయి. కృష్ణానగర్‌లో పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి ఇంట వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు శనివారం సీఎం విచ్చేశారు. భద్రతా కారణాల పేరుతో పోలీసులు కృష్ణానగర్‌లో దుకాణాలన్నీ మూయించారు. కృష్ణానగర్‌ మీదుగా బిర్లాగేట్‌ వరకు ప్రధాన రహదారిపై ఇరువైపులా దుకాణాల ముందు శుక్రవారమే బారికేడ్లు పెట్టారు. జనం వాటిని దాటి రాకుండా ఉండేందుకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో వ్యాపారాలు సాగక వ్యాపారులు నష్టపోయారు. ఎమ్మెల్యే శ్రీదేవి నివాసం ఉండే కాలనీలో నివాసితులు బయటకు రాకుండా గృహ నిర్బంధం చేశారు. ప్రతి ఇంటి వద్ద, మిద్దెలపైన పోలీసు పహరా ఏర్పాటు చేశారు. కొందరి ఇళ్లకైతే ఏకంగా తాళాలు వేశారు. వీధులన్నీ మూసివేసి, జనసంచారాన్ని పూర్తిగా నిషేధించారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ముఖ్యమంత్రి పర్యటనకు ఆటంకం కలిగిస్తారన్న ఉద్దేశంతో తెదేపా, సీపీఎం, సీపీఐ నాయకులు, కొందరు ఉపాధ్యాయులను ముందస్తు అరెస్టు చేశారు. సీఎం తిరిగివెళ్లాక విడిచిపెట్టారు. భద్రత పేరుతో పోలీసులు చేపట్టిన చర్యలు హక్కుల ఉల్లంఘన అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పాపం సుభద్రమ్మ

గతేడాది డిసెంబర్‌ 22న కర్నూలు మండలం పంచలింగాల పరిధిలో ఓ వివాహానికి ముఖ్యమంత్రి హాజరైనప్పుడు కర్నూలు ఇందిరాగాంధీ నగర్‌కు చెందిన దివ్యాంగురాలు సుభద్రమ్మ భద్రతాసిబ్బందిని దాటుకుని సీఎంను కలిసింది. ఉద్యోగం ఇప్పించాలని విన్నవించింది. ఇది నిఘా వైఫల్యమేనని విమర్శలు రావడంతో అప్పటి నుంచి ముఖ్యమంత్రి జిల్లాకు వచ్చిన ప్రతిసారి పోలీసులు సుభద్రమ్మను గృహ నిర్బంధం చేస్తున్నారు. ఈసారీ ముందురోజు నుంచే ఆమెను ఇల్లు దాటి రాకుండా కట్టడి చేశారు.  ముఖ్యమంత్రికి వినతిపత్రాలు ఇచ్చేందుకు వచ్చినవారినీ పోలీసులు అనుమతించలేదు. వారు సీఎంను నేరుగా కలవకుండా అధికారులే రోడ్లపై ఉండి ప్రజల నుంచి వినతులు తీసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని