Kodali Nani: మాకు.. జూనియర్‌ ఎన్టీఆర్‌కి ఏంటి సంబంధం?

‘మాకు జూనియర్‌ ఎన్టీఆర్‌కి ఏంటి సంబంధం. నన్ను, వంశీని ఆయన ఎందుకు నియంత్రిస్తారు. మేమేమన్నా ఆయన పార్టీనా? ఆయన సినిమాకు నిర్మాతలమా? లేదా డైరెక్టర్లమా? లేకపోతే ఆయన దగ్గరేమన్నా నటన నేర్చుకున్నామా?

Updated : 26 Nov 2021 11:23 IST

మేం వైకాపాలో ఉన్నాం... జగన్‌ కోసం ఏమైనా చేస్తాం: మంత్రి కొడాలి నాని

విలేకరులతో మాట్లాడుతున్న మంత్రి కొడాలి నాని. పక్కన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ‘మాకు జూనియర్‌ ఎన్టీఆర్‌కి ఏంటి సంబంధం. నన్ను, వంశీని ఆయన ఎందుకు నియంత్రిస్తారు. మేమేమన్నా ఆయన పార్టీనా? ఆయన సినిమాకు నిర్మాతలమా? లేదా డైరెక్టర్లమా? లేకపోతే ఆయన దగ్గరేమన్నా నటన నేర్చుకున్నామా? ఒకప్పుడు కలిసి ఉన్నాం. విభేదాలు వచ్చి బయటకు వచ్చాం. ఇప్పుడు వైకాపాలో ఉన్నాం. జగన్‌ మా నాయకుడు. ఆయన చెప్పినా... చెప్పకపోయినా ఆయన కోసం ఏదైనా చేస్తాం. జూనియర్‌ ఎన్టీఆర్‌ చెబితే మేమెందుకు వింటాం?’ అని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. సచివాలయ ఆవరణలో వైకాపాతో సన్నిహితంగా ఉంటున్న ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో కలిసి గురువారం విలేకరులతో మంత్రి మాట్లాడారు. ‘చంద్రబాబు శిష్యులు వైకాపా, తెరాసలో ఉన్నారు. స్పీకర్‌ తమ్మినేని సీతారాం, వైకాపా ఎమ్మెల్యే రోజా, తెరాస మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ చంద్రబాబు శిష్యులే కదా? వారు ఆయన్ని తిడుతున్నారుగా? వారిని చంద్రబాబు నియంత్రించారా?’ అని ప్రశ్నించారు. ‘నందమూరి కుటుంబం అంటే అందరికీ గౌరవం ఉంది. వాళ్లు చంద్రబాబు ఉచ్చులో చిక్కుకున్నారు. వాళ్లను చూస్తే జాలేస్తుంది. నందమూరి కుటుంబంలో ఒక్కరిని తప్ప చంద్రబాబు మిగతా వారందరినీ మోసం చేయగలరు’ అని పేర్కొన్నారు.

జగన్‌ ఏమన్నా పైనుంచి నీళ్లు పోశారా?: ‘రెండు టీఎంసీలు పట్టే అన్నమయ్య ప్రాజెక్టులో 6 గంటల వ్యవధిలో 32 టీఎంసీలు వస్తే గేట్లు కొట్టుకుపోవా? ఎవరైనా ఆపగలరా? ఇందులో మానవ తప్పిదం ఏముంది? జగన్‌ ఏమన్నా పైనుంచి నీళ్లు పోశారా?’ అని ప్రశ్నించారు.

సీఎం, పీఎం వెళితే సమస్యలు పరిష్కారమవుతాయా?: ‘సీఎం వెళితే వరద సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని ఇక్కడి నుంచే రోజూ కలెక్టర్లతో సమీక్షిస్తున్నారు. తక్షణ సౌకర్యాలు కల్పించిన తర్వాత పలకరించడమో... పరామర్శించడమో చేస్తారు. అయినా సీఎం, పీఎం వెళితే సమస్యలన్నీ పరిష్కారమవుతాయా?. చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి. సానుభూతి, ఓట్లు పొందాలనుకుంటున్నారు. కడప జిల్లాపై జగన్‌ కన్నా చంద్రబాబుకు ఎక్కువ ప్రేమ ఉంటుందా?’ అని వ్యాఖ్యానించారు. ‘చంద్రబాబు సతీమణి గురించి ఆయనే అల్లరి చేసుకుంటుంటే మేమెందుకు క్షమాపణ చెప్పాలి. మేమన్నా అంటే కదా? ఆమె పేరును అసెంబ్లీ లోపల, బయట ఎక్కడా మేం చెప్పలేదు’ అని అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని