Steel: చుక్కల్లోకి ఉక్కు ధరలు!

ఎన్ని కష్టాలు పడినా చిన్న గూడు ఉండాలన్నది సగటు మనిషి కల. పరిస్థితులు అనుకూలించి చిన్న ఇల్లు కట్టుకుందామనో, ఫ్లాట్‌ కొనుక్కుందామనో అనుకునేసరికి...

Updated : 05 Feb 2022 03:51 IST

సిమెంటు ధరలు కూడా
రెండు వారాల్లోనే రూ.10 వేలకుపైగా పెరిగిన టన్ను ఉక్కు
బస్తాకు రూ.40 నుంచి రూ.60 వరకు పెరిగిన సిమెంటు
గృహనిర్మాణ రంగంపై పెనుభారం

ఈనాడు, అమరావతి: ఎన్ని కష్టాలు పడినా చిన్న గూడు ఉండాలన్నది సగటు మనిషి కల. పరిస్థితులు అనుకూలించి చిన్న ఇల్లు కట్టుకుందామనో, ఫ్లాట్‌ కొనుక్కుందామనో అనుకునేసరికి... నిర్మాణ సామగ్రి ధరలు పెరగడం సామాన్యులకు అశనిపాతంలా మారింది. ఉక్కు, సిమెంటు ధరలు రెండు వారాల్లోనే అనూహ్యంగా పెరిగిపోయాయి. ఉక్కు ధర 15 రోజుల్లో టన్నుకు రూ.10-11 వేలకు పైగా పెరిగింది. 50 కిలోల సిమెంటు బస్తా ధర బ్రాండును బట్టి రూ.40-60 వరకు పెంచేశారు. వేసవి మొదలు కానుండటం, మంచి ముహూర్తాలు ఉండటం, కరోనా అంత ప్రమాదకరంగా లేకపోవడంతో రాష్ట్రంలో చాలాచోట్ల నిర్మాణ రంగంలో కొంత కదలిక మొదలైంది. సొంతిళ్లతో పాటు అపార్టుమెంట్ల నిర్మాణాలూ ప్రారంభమవుతున్నాయి. ఈ డిమాండును సొమ్ము చేసుకునేందుకు ఉక్కు, సిమెంటు ఉత్పత్తిదారులు ధరలు పెంచేస్తున్నారు. దీంతో బడ్జెట్‌ గాడి తప్పి.. సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో ఉక్కు ధరలు అనూహ్యంగా పెరిగాయి.

విశాఖ ఉక్కు, సింహాద్రి టీఎంటీ సంస్థలు శుక్రవారం నుంచి టన్నుకు మరో రూ.2 వేలు ధర పెంచేశాయి. విశాఖ ఉక్కు తర్వాత అత్యధికంగా అమ్ముడయ్యే సింహాద్రి టీఎంటీ స్టీలు ధర 15రోజుల క్రితం టన్ను రూ.60,180 ఉండేది. ఇప్పుడది రూ.71,390కి చేరింది. ఈ ధరలు విశాఖలోనివి (అసలు ధరకు 18% జీఎస్టీ కలిపి). వీటికి లోడింగ్‌, బెండింగ్‌ ఛార్జీలు అదనం. అక్కడి నుంచి విజయవాడ వరకు వచ్చేసరికి టన్నుకి మరో రూ.600-700 వరకు అదనంగా ఖర్చవుతుంది.

* సింహాద్రి టీఎంటీ సంస్థ శుక్రవారం ప్రకటించిన కొత్త ధరల ప్రకారం జీఎస్టీ కలిపి... 8 మి.మీ. ఊచలు టన్ను రూ.71,390,.. 12 మి.మీ.నుంచి 25 మి.మీ. వరకు రూ.69,030,.. 10 మి.మీ., 32 మి.మీ. ఊచల ధరలు టన్ను రూ.70,250 ఉన్నాయి. ఇవి విశాఖలో డీలర్ల ధరలు. ప్రాంతాల్ని బట్టి రవాణా, డీలర్ల లాభాలు అదనం.
* విశాఖ ఉక్కు ఉత్పత్తుల ధర... సింహాద్రి టీఎంటీ కంటే టన్నుకు రూ.4వేల వరకు అదనంగా ఉంటుంది. కృష్ణాజిల్లా గుడివాడలో విశాఖ ఉక్కు టన్ను రూ.77 వేలకు విక్రయిస్తున్నట్టు ఒక డీలర్‌ తెలిపారు. చివరకు ఊచల్ని కలిపి కట్టేందుకు వాడే బైండింగ్‌ వైరు కూడా టన్ను రూ.10 వేలు పెరిగింది.

సిమెంటుదీ అదే దారి

* సిమెంటు కంపెనీలు ప్రతి నెలా ఒకటో తేదీన కొత్త ధరలు ప్రకటిస్తాయి. ఫిబ్రవరిలో 1న పెంచి, మళ్లీ రెండు రోజులకే మరోసారి పెంచేశారు. కొన్ని ప్రముఖ బ్రాండ్ల 50కిలోల బస్తా ధరలు రెండు వారాల్లో రూ.40 వరకు పెరిగాయి. బి-కేటగిరీలోకి వచ్చే కంపెనీల సిమెంటు ధరలు బస్తా రూ.60, సి-కేటగిరీవి రూ.30 వరకు పెరిగాయి.


మరింత పెరిగే అవకాశం?

డిమాండు బాగుండటంతో ఉక్కు, సిమెంటు ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆ రంగాలవారు చెబుతున్నారు. ఇనుప ఖనిజం, కోకింగ్‌ కోల్‌, కోల్‌ ధరలు పెరగడంతో ఉక్కు ఉత్పత్తుల ధరలు పెరిగాయని ఉత్పత్తిదారులు చెబుతున్నారు. కానీ డిమాండే అసలు కారణమన్నది నిర్మాణరంగ నిపుణుల మాట. డిమాండు పెరిగినప్పుడల్లా సిమెంటు ఉత్పత్తిదారులు ధరలు పెంచడం పరిపాటిగా మారింది. గతంలో ధరలు పెరగకుండా కొంత ప్రభుత్వ నియంత్రణ ఉండేది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని