Amaravathi:అమరావతిపై అదే నిర్లక్ష్యం

రాజధాని అమరావతిలో నెల రోజుల్లో మౌలిక వసతులు కల్పించాలని, మూడు నెలల్లో రైతులకు లేఅవుట్‌లు అభివృద్ధి చేసి స్థలాలు అప్పగించాలని, మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం ఆరు నెలల్లో రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని హైకోర్టు

Updated : 12 Mar 2022 09:55 IST

రాజధాని నిర్మాణానికి కేటాయింపులు సున్నా
కోర్టు ఆదేశించినా పెడధోరణే
కేంద్రం నుంచి రూ.800 కోట్లు వస్తుందని మభ్యపెట్టే ప్రయత్నం

ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతిలో నెల రోజుల్లో మౌలిక వసతులు కల్పించాలని, మూడు నెలల్లో రైతులకు లేఅవుట్‌లు అభివృద్ధి చేసి స్థలాలు అప్పగించాలని, మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం ఆరు నెలల్లో రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని హైకోర్టు విస్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా... రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టూ లేదు. హైకోర్టు చెబితే ఏంటి? మా ధోరణి మాదే అన్న వైఖరినే ప్రదర్శిస్తోంది. రాజధాని అమరావతిలో మౌలిక వసతుల అభివృద్ధికి 2022-23 వార్షిక బడ్జెట్‌లో ఒక్క రూపాయీ కేటాయించకపోవడమే దీనికి నిదర్శనం. ఈ బడ్జెట్‌లో రాజధానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.1329.21 కోట్లు కేటాయించినట్లుగా చూపించి అంకెల గారడీ చేసింది. దానిలో రూ.800 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి సాయంగా వస్తుందని ఊహించి పెట్టింది. మిగతా మొత్తం గతంలో తీసుకున్న రుణాలకు వడ్డీలకు, రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు వార్షిక కౌలు, భూమి లేని పేద కుటుంబాలకు పింఛను చెల్లించేందుకు కేటాయించింది. అంతే తప్ప రాజధానిలో తక్షణం పనులు చేపట్టే దిశగా ఈ బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులూ చేయలేదు.

కేంద్రం ఎందుకు ఇస్తుంది?

రాజధాని నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా, కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.800 కోట్లు వస్తాయని బడ్జెట్‌లో ప్రతిపాదించడం రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టడానికేనని వివిధ వర్గాలు విమర్శిస్తున్నాయి. రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం.. తెదేపా ప్రభుత్వ హయాంలో రూ.1,500 కోట్లు ఇచ్చింది. మరో రూ.వెయ్యి కోట్లు వరకు ఇస్తామని మౌఖికంగా చెప్పినట్టు సమాచారం. అప్పట్లో తెదేపా ప్రభుత్వం రాజధానికి ఆర్థిక సాయం కోసం సుమారు రూ.69వేల కోట్లతో నీతిఆయోగ్‌కి డీపీఆర్‌లు పంపింది. రాజధానికి నిధులివ్వాలంటూ కేంద్రానికి పదే పదే విజ్ఞప్తులు చేసేది. వైకాపా ప్రభుత్వం వచ్చాక రాజధాని నిర్మాణ పనులు నిలిపివేసింది. రాజధాని నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు తేవడానికి ప్రయత్నించలేదు. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి నిధులు వస్తాయన్న గ్యారంటీ లేకపోయినా, బడ్జెట్లలో మాత్రం ప్రతిపాదనలు పెట్టడం, ఖర్చు సున్నా చూపించడం ప్రజల్ని మోసం చేయడమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి.  

అమరావతి మెట్రోకు రూ.2 కోట్లే!

అమరావతి మెట్రో రైలు ప్రాజెక్టుకు ప్రభుత్వం రూ.2 కోట్లే కేటాయించింది. 2021-22లో రూ.3.60 కోట్లు కేటాయించినట్లు చూపినా.. సవరించిన బడ్జెట్‌లో రూ.2.70 కోట్లుగా పేర్కొంది. తొలి దశలో చేపట్టే 38.74 కి.మీ. పనులకు సంబంధించిన అమరావతి మెట్రో రైలు డీపీఆర్‌ రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో కేంద్రానికి వెళ్లాల్సి ఉంది. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు డీపీఆర్‌ నిపుణుల పరిశీలనలోనే ఉంది. దీనికి ఒక్క రూపాయీ కేటాయించలేదు.

కేటాయింపులు ఇవే..

2022-23 బడ్జెట్‌ కేటాయింపుల్లో ‘ఏపీసీఆర్‌డీఏ’కి సాయం పేరుతో రూ.200 కోట్లు కేటాయించింది. అది గతంలో రాజధాని నిర్మాణం కోసం హడ్కో, బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలపై వడ్డీలు, అసలు చెల్లించేందుకు ఉద్దేశించింది. 2021-22 బడ్జెట్‌లో సవరించిన అంచనాల ప్రకారం రుణాలపై వడ్డీలు, అసలు చెల్లించేందుకు ఏడాదికి రూ.550 కోట్లు కావాలి. ఈ బడ్జెట్‌లో రూ.200 కోట్లే చూపించారు.

‘రాజధాని ప్రాంత సామాజిక భద్రతా నిధి’ పేరుతో మరో రూ.121.11 కోట్లు కేటాయించారు. అవి రాజధాని గ్రామాల్లోని భూమిలేని పేదలకు ప్రతి నెలా కౌలు చెల్లించేందుకు, ఇతర సామాజిక కార్యక్రమాలకు చేసిన   కేటాయింపులు.

‘కొత్త రాజధాని కోసం భూసమీకరణ’ పేరుతో రూ.208.10 కోట్లు కేటాయించారు. రాజధాని నిర్మాణానికి భూసమీకరణలో భూములిచ్చిన రైతులకు చెల్లించాల్సిన వార్షిక కౌలు   మొత్తం ఇది.

ఇవన్నీ తప్పనిసరిగా చెల్లించాల్సినవి కాబట్టి ప్రభుత్వం కేటాయింపులు చేసింది.

‘కొత్త రాజధాని నగరంలో అత్యవసర మౌలిక వసతుల అభివృద్ధి’ పేరుతో రూ.800 కోట్లను ప్రభుత్వం ప్రతిపాదించింది. దాన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థికసాయం వచ్చే హెడ్‌ కింద చూపింది. ఇదే పద్దు కింద 2021-22 బడ్జెట్‌లోనూ రూ.500 కోట్లు ప్రతిపాదించింది. కానీ 2021-22 సవరించిన బడ్జెట్‌ అంచనాల ప్రకారం చూస్తే... దీనికి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని