ప్రశ్నించానని పాలు, నీళ్లు లేకుండా చేశారు

‘ ప్రశ్నించానని పాలు రానీయకుండా చేశారు. విద్యుత్తు సరఫరా నిలిపేసి నీళ్లు లేకుండా చేశారు. జగనన్నా ఇదేనా మీ పాలనలో మహిళకు ఇచ్చే గౌరవం. ఇలా ఏ ప్రభుత్వంలోనైనా, ఏ రాష్ట్రం లోనైనా జరుగుతుందా. నాకేదైనా అయితే బాలినేని శ్రీనివాసరెడ్డే కారణం...’.

Updated : 26 Jun 2022 09:35 IST

జగనన్నా ఇదేనా మీ పాలనలో మహిళకు ఇచ్చే గౌరవం?
నాకేదైనా అయితే బాలినేని శ్రీనివాసరెడ్డే కారణం
ప్రకాశం జిల్లాకు చెందిన మహిళ కన్నీటి వేదన

ఈనాడు డిజిటల్‌, ఒంగోలు: ‘ ప్రశ్నించానని పాలు రానీయకుండా చేశారు. విద్యుత్తు సరఫరా నిలిపేసి నీళ్లు లేకుండా చేశారు. జగనన్నా ఇదేనా మీ పాలనలో మహిళకు ఇచ్చే గౌరవం. ఇలా ఏ ప్రభుత్వంలోనైనా, ఏ రాష్ట్రం లోనైనా జరుగుతుందా. నాకేదైనా అయితే బాలినేని శ్రీనివాసరెడ్డే కారణం...’. అంటూ ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం అల్లూరుకు చెందిన కవిత అనే మహిళ కన్నీటి పర్యంతమైన వీడియో శనివారం సామాజిక మాధ్యమాల్లో దుమారం రేపింది. ఆ వీడియోలో కవిత మాట్లాడుతూ... ‘నెల రోజుల క్రితం మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి అల్లూరు వచ్చినప్పుడు ఆయనను ప్రశ్నించాను. అప్పటి నుంచి సమస్యలు మొదలయ్యాయి. ఆయన అనుచరులు ఇంటి గేటుకు తాళం వేశారు. రైతు సమస్యలపై ప్రశ్నించినందుకు ఇలా బంధిస్తే ఎలా బతికేది? నాయకులు, పోలీసులు ఆయనకు వంతపాడుతూ ఇబ్బందులు సృష్టిస్తున్నారు. ఆడపిల్లకు భద్రత లేకుంటే ఎక్కడ బతకాలో మీరే చెప్పండి జగనన్నా? నాకేమైనా అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి వంద శాతం బాధ్యుడు. ఎన్ని రోజులైనా ఇక్కడే భూస్థాపితం అయిపోతాను...’ అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.


ఆడబిడ్డల్ని ఏడిపిస్తున్న పాపం ఊరికే వదలదు

- నారా లోకేశ్‌ విమర్శ

ఆడబిడ్డల్ని ఏడిపిస్తున్న పాపం సీఎం జగన్‌ను ఊరికే వదలదని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ట్విటర్‌లో విమర్శించారు. ‘‘వైకాపా నాయకుల పైశాచికత్వానికి రాష్ట్రంలో మహిళలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. కొత్తపట్నం మండలం ఆలూరులో జరిగిన గడపగడపకులో సమస్యలపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని ప్రశ్నించిన కవిత అనే మహిళ ఇంటికి వైకాపా మూకలు తాళాలు వేసి, వేధించడం దారుణం. కనీసం నీళ్లు, పాలు తెచ్చుకునే వీలు లేదంటూ నిర్బంధించడమే... వైకాపా పాలనలో మహిళలకు దక్కిన గౌరవమా? కవితను వేధిస్తున్న బాలినేని అనుచర గణం, వారికి సహకరిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి...’’ అని డిమాండ్‌ చేస్తూ లోకేశ్‌ ఆ వీడియోను పోస్టు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని