Published : 06 Jul 2022 05:41 IST

సంక్షిప్త వార్తలు

రూ.2,000 కోట్ల రుణ సమీకరణ

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మంగళవారం రూ2,000 కోట్ల బహిరంగ రుణం తీసుకుంది. రిజర్వుబ్యాంకు నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో పాల్గొని ఈ మొత్తం సమీకరించింది. 18, 20 ఏళ్ల కాలపరిమితితో చెరో రూ.వెయ్యి కోట్లు అప్పుచేసింది. రూ.వెయ్యి కోట్లు 7.95 శాతం వడ్డీకి, మరో రూ.వెయ్యి కోట్లు 7.92 శాతం వడ్డీకి సమీకరించింది.


ఇంజినీరింగ్‌ పరీక్ష కొంచెం కఠినం

ఈనాడు, అమరావతి: ఏపీ ఈఏపీసెట్‌ ఇంజినీరింగ్‌కు మంగళవారం 94.17శాతం మంది హాజరయ్యారు. మొత్తం 41,847మంది దరఖాస్తు చేసుకోగా.. 39,407మంది రాశారు. మొదటి సెషన్‌ పరీక్షలో గణితం, భౌతికశాస్త్రం నుంచి వచ్చిన ప్రశ్నలు కఠినంగా ఉన్నట్లు గణిత నిపుణులు విఘ్నేశ్వరరావు తెలిపారు. గణితంలో ప్రమేయాలు, త్రికోణమితి, సరళరేఖల నుంచి ఎక్కువగా ప్రశ్నలు వచ్చాయని పేర్కొన్నారు. మధ్యాహ్నం నుంచి నిర్వహించిన రెండో సెషన్‌లో గణితం మధ్యస్థంగా ఉండగా.. భౌతికశాస్త్రం కఠినంగా ఉందని పేర్కొన్నారు. ప్రశ్నపత్రం మధ్యస్థంగా ఉందని వెల్లడించారు.


ఆక్వా సాగులో పదెకరాల వరకూ విద్యుత్తు రాయితీ

ఈనాడు, అమరావతి: పదెకరాల వరకు విస్తీర్ణంలో ఆక్వా సాగుచేసే రైతులకు విద్యుత్తు రాయితీని వర్తింపజేస్తూ ఇంధనశాఖ ఉత్తర్వులు జారీచేసింది. గుర్తించిన ఆక్వా అభివృద్ధి జోన్ల పరిధిలో సాగుచేసే వారికే యూనిట్‌ విద్యుత్తును రూ.1.50 చొప్పున సరఫరా చేయాలని ఆదేశించింది. ఆక్వా రైతులకు యూనిట్‌ విద్యుత్తును రూ.2 చొప్పున ఏడాది పాటు సరఫరా చేయాలని 2018 ఆగస్టు 1న అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 2019 జులై నుంచి యూనిట్‌ విద్యుత్తును రూ.1.50 చొప్పున సరఫరా చేస్తున్నారు. అయితే ఆక్వాజోన్ల పరిధిలో సాగుచేసే వారికి, అయిదెకరాల్లోపు విస్తీర్ణం వరకే విద్యుత్తు రాయితీ వర్తింపజేయాలని ఈ ఏడాది ఏప్రిల్‌ 8న ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. తాజాగా దీన్ని పదెకరాల వరకు పెంచుతూ ఉత్తర్వులు విడుదలయ్యాయి.


బీసీ హక్కుల సాధనకు ఆగస్టు 2న దిల్లీలో ధర్నా
జాతీయ బీసీ సంక్షేమ సంఘం వెల్లడి

ఈనాడు డిజిటల్‌, అమరావతి: బీసీ హక్కుల సాధనకు వచ్చే నెల 2, 3 తేదీల్లో దిల్లీలోని జంతర్‌మంతర్‌ దగ్గర ధర్నా నిర్వహించనున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలిపింది. విజయవాడలో ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు వెంగళరావు, ఇన్‌ఛార్జి నూకానమ్మ మాట్లాడుతూ..‘కులాల వారీగా జనాభా గణన చేయాలి. చట్టసభల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం 50% రిజర్వేషన్లు కల్పించాలి. బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు, ప్రత్యేకంగా మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలి’అని అన్నారు. ధర్నాకు అన్ని పార్టీల ఎంపీలు, సీఎం జగన్‌, ప్రతిపక్షనేత చంద్రబాబును ఆహ్వానిస్తామని వెల్లడించారు. మొదటిరోజు నిరసన, రెండోరోజు ప్రధాని మోదీని కలిసి వినతిపత్రం ఇస్తామని వివరించారు.


నిందితుల ముందస్తు బెయిల్‌ పిటిషన్ల కొట్టివేత
కోనసీమ అల్లర్ల కేసులో హైకోర్టు ఉత్తర్వులు

ఈనాడు, అమరావతి: కోనసీమ అల్లర్ల వ్యవహారంలో అమలాపురం పోలీసులు నమోదు చేసిన కేసులో నిందితుడు అరిగెల వెంకటరామారావు, మరొకరికి ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. వారి పిటిషన్లను కొట్టేసింది. అల్లర్లలో పిటిషనర్లది కీలక పాత్రని, సాక్షులు సైతం ఇదే విషయం వాంగ్మూలంలో చెప్పారని అదనపు పీపీ దుష్యంత్‌రెడ్డి కోర్టుకు విన్నవించారు. పిటిషనర్లను విచారించాల్సి ఉందని, వ్యాజ్యాల్ని కొట్టేయాలని కోరారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకుని పిటిషన్లను న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.సుబ్బారెడ్డి కొట్టివేశారు. కోనసీమ జిల్లా పేరును అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పేరుగా మార్చాలన్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ చేసిన ఆందోళన హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే.


మూగజీవాల అక్రమ రవాణా నిరోధానికి నోడల్‌ అధికారులను నియమించాలి: హైకోర్టు

ఈనాడు, అమరావతి: మూగజీవాల అక్రమ రవాణా, వధను నిలువరించేందుకు చట్ట నిబంధనలను పాటించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, అక్రమ రవాణాపై ఫిర్యాదులు అందుకునేందుకు నోడల్‌ అధికారులను నియమించాలని పోలీసు కమిషనర్లు, ఎస్పీలకు సూచించింది. నోడల్‌ అధికారుల వివరాలు, ఫోన్‌నంబర్లు, మూగజీవాల సంక్షేమ బోర్డు ఇచ్చిన మార్గదర్శకాలను సమాచార, ప్రసారశాఖ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలంది. పత్రికల్లో ప్రచురించాలంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. బక్రీద్‌ సందర్భంగా మూగజీవాల అక్రమ రవాణా, విచక్షణారహిత వధను నిలువరించాలని యానిమల్‌ రెస్క్యూ ఆర్గనైజేషన్‌ కార్యదర్శి ఎస్‌.గోపాలరావు, మరొకరు హైకోర్టులో వ్యాజ్యం వేశారు. చట్ట నిబంధనలు, జంతు సంక్షేమ బోర్డు మార్గదర్శకాలు అమలయ్యేలా పోలీసులకు తగిన ఆదేశాలివ్వాలని వారు కోరారు.


పోలవరం అథారిటీలో బదిలీల గందరగోళం!
బదిలీ చేసిన జల వనరులశాఖ.. రిలీవ్‌ చేయబోమంటున్న అధికారులు

ఈనాడు, అమరావతి: పోలవరం ప్రాజెక్టు అథారిటీలో పనిచేస్తున్న 8 మంది ఇంజినీర్లను జలవనరులశాఖ బదిలీ చేసింది. కానీ వారిని రిలీవ్‌ చేయడానికి అథారిటీ ఉన్నతాధికారులు ఇష్టపడట్లేదు. దీంతో ఆ అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పోలవరం అథారిటీ పర్యవేక్షిస్తోంది. అక్కడ కీలక స్థానాల్లో ఉన్నవారంతా కేంద్ర జలసంఘం అధికారులే. మిగిలిన 11 మంది ఏపీ జలవనరుల శాఖలో పని చేస్తారు. వారిని ఏపీ ప్రభుత్వం అక్కడకు డిప్యుటేషన్‌పై బదిలీ చేసింది. ప్రస్తుతం అందులో ఒక డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరు, మరో ఏడుగురు అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లను జలవనరులశాఖ ఉన్నతాధికారులు బదిలీచేసి, వారికి ఆన్‌లైన్‌లో ఉత్తర్వులు పంపారు. అంతకుముందు ఇచ్చిన డిప్యుటేషన్‌ ఉత్తర్వులన్నీ రద్దుచేసినట్లు పేర్కొన్నారు. ఉత్తర్వులు అందుకున్న వారంలోగా వారు రిలీవ్‌ అయ్యి, కొత్త పోస్టులో చేరాలి. ఈ గడువు బుధవారంతో ముగుస్తోంది. దీంతో.. బదిలీ అయినవారు తమను రిలీవ్‌ చేయాలని అథారిటీ అధికారులను కోరగా, వారు ససేమిరా అంటున్నారు. తాము ఏపీ జలవనరులశాఖ కార్యదర్శికి లేఖ రాస్తామని, ఇక్కడి నుంచి వెళ్లేందుకు వీల్లేదని అడ్డు పడుతున్నారు. తాము సకాలంలో తమ స్థానాల్లో చేరకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని ఆ ఇంజినీర్లు ఆందోళన చెందుతున్నారు. జులై నెల జీతాలు రావడమూ ఇబ్బందేనని చెబుతున్నారు. పోలవరం అథారిటీ అధికారులతో జలవనరులశాఖ అధికారులు సమన్వయం చేసుకోకపోవడం వల్లే ఈ సమస్యలు ఎదురయ్యాయి.


విశాఖలో అగ్నివీరుల ఎంపిక
ఆగస్టు 14 నుంచి 31 వరకు

ఈనాడు, విశాఖపట్నం: సైన్యంలో అగ్నివీరులుగా విధులు నిర్వర్తించాలనుకునే వారికోసం ఆగస్టు 14 నుంచి 31 వరకు విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ‘ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ’ని నిర్వహించనున్నట్లు తూర్పు నౌకాదళం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కోనసీమ, ఏలూరు, కాకినాడ, ఎన్టీఆర్‌ జిల్లాలు, యానాంకు చెందినవారు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. అగ్నివీర్‌ జనరల్‌ డ్యూటీ, అగ్నివీర్‌ టెక్నికల్‌, అగ్నివీర్‌ క్లర్క్‌/స్టోర్‌ కీపర్‌ టెక్నికల్‌, అగ్నివీర్‌ ట్రేడ్స్‌మ్యాన్‌(పది పాసైనవారు), అగ్నివీర్‌ ట్రేడ్స్‌మ్యాన్‌(8 పాసైనవారు)ని ఎంపిక చేస్తామని వెల్లడించారు. జులై 30 వరకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని, వారికి ఆగస్టు 7 నుంచి అడ్మిట్‌ కార్డులను జారీ చేస్తామని తెలిపారు. www.joinindianarmy.nic.in అంతర్జాల చిరునామా నుంచి అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. ఎంపికకు ఏ తేదీన రావాలనే విషయం అడ్మిట్‌కార్డులో ఉంటుందన్నారు. నియామకాలకు సంబంధించిన సందేహాల నివృత్తికి మొబైల్‌యాప్‌ 'army calling' ను గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని అందులో అభ్యర్థులకు ‘లైవ్‌ చాట్‌’ సౌకర్యం కల్పించినట్లు వివరించారు. విశాఖలోని రిక్రూట్‌మెంట్‌ కార్యాలయం నంబర్లు 0891- 2756959, 2754680లకు ఫోన్‌ చేసి కావాల్సిన సమాచారాన్ని పొందవచ్చని తెలిపారు.


ఆహార భద్రత చట్టం అమలులో రాష్ట్రానికి 3వ ర్యాంకు

ఈనాడు, దిల్లీ: జాతీయ ఆహార భద్రత చట్టం అమలులో ఒడిశా, ఉత్తర్‌ప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌లు తొలి మూడు ర్యాంకులు కైవశం చేసుకున్నాయి. తెలంగాణ సాధారణ రాష్ట్రాల్లో 12, సాధారణ, ప్రత్యేకహోదాగల రాష్ట్రాల ఉమ్మడి ర్యాంకుల్లో 14వ స్థానంలో నిలిచింది. మంగళవారం దిల్లీలో జరిగిన సదస్సులో కేంద్ర ఆహారం, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్‌గోయల్‌ తొలిసారి జాతీయ ఆహార భద్రత చట్టం సూచీ ర్యాంకులను విడుదల చేశారు. ఆహార భద్రత చట్టం కింద కవరేజి, అర్హులైన వారిని లక్ష్యంగా చేసుకొని ప్రయోజనాలు అందించడం, ఆహార భద్రత చట్టంలోని నిబంధనల అమలు, తిండి గింజల కేటాయింపు, వాటి రవాణా, చౌక దుకాణాలకు సరఫరా, పౌష్టికాహారం అందించడానికి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల ఆధారంగా ఈ ర్యాంకులు ప్రకటించారు. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాలూ డిజిటైజేషన్‌, ఆధార్‌ అనుసంధానం, ఈపోస్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు ఈ నివేదిక పేర్కొంది. ఆహారభద్రతా చట్టం కవరేజి, టార్గెటింగ్‌, చట్టంలోని నిబంధనల అమలు విభాగంలో ఏపీకి 8, తెలంగాణకు 21వ ర్యాంకులు దక్కాయి. డెలివరీ ప్లాట్‌ఫాం విభాగంలో ఏపీకి 2, తెలంగాణకు 3వ స్థానం వచ్చాయి. ఈ నివేదిక విడుదల సందర్భంగా కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ మాట్లాడుతూ ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య కార్డుల జారీకి ఆధార్‌ అనుసంధాన      ప్రజాపంపిణీ వ్యవస్థను ఉపయోగించనున్నట్లు చెప్పారు.


తెలంగాణ రాష్ట్ర రుణ పరిమితిలో రూ.19 వేల కోట్ల కోత
ఈ ఏడాది రూ.34,970 కోట్లకే కేంద్రం ఆమోదం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర రుణ పరిమితిని 2022-23 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం రూ.19 వేల కోట్ల మేర తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బాండ్ల విక్రయం ద్వారా రూ.34,970 కోట్లను రాష్ట్ర అభివృద్ధి రుణంగా తీసుకునేందుకు కేంద్ర ఆర్థికశాఖ ఆమోదించింది. ప్రస్తుత సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి(జీఎస్‌డీపీ) ప్రకారం ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి మేరకు బాండ్ల విక్రయం ద్వారా రూ.53,970 కోట్లను రుణంగా తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.


Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని