గవర్నర్‌కు రాఖీలు కట్టిన విద్యార్థినులు

విజయవాడలోని రాజ్‌భవన్‌లో రక్షాబంధన్‌ వేడుకలను గురువారం నిరాడంబరంగా నిర్వహించారు. నిర్మలా ఉన్నత పాఠశాల, నల్లూరి వారి సెయింట్‌ మాథ్యూస్‌ ఉన్నత పాఠశాల, తక్షశిల

Published : 12 Aug 2022 05:49 IST

ఈనాడు, అమరావతి: విజయవాడలోని రాజ్‌భవన్‌లో రక్షాబంధన్‌ వేడుకలను గురువారం నిరాడంబరంగా నిర్వహించారు. నిర్మలా ఉన్నత పాఠశాల, నల్లూరి వారి సెయింట్‌ మాథ్యూస్‌ ఉన్నత పాఠశాల, తక్షశిల ఐఏఎస్‌ అకాడమీకి చెందిన పలువురు విద్యార్థినులు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు రాఖీలు కట్టారు. గవర్నర్‌ వారందరినీ పేరుపేరునా పలకరించి ఆశీర్వదించారు. ఆ విద్యార్థినులందరూ తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి, పూరీ జగన్నాథస్వామి ఆశీస్సులతో ఉజ్వల భవిష్యత్తును పొందాలని గవర్నర్‌ ఆకాంక్షించారు.

మన ఆకాంక్షల సూచిక జాతీయ జెండా
మన ఆశలు, ఆకాంక్షలను జాతీయ పతాకం సూచిస్తుందని, జాతికి గర్వకారణమైన చిహ్నమని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ అన్నారు. ప్రతీ ఒక్కరూ వారి నివాసాలపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం ద్వారా హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శనివారం నుంచి ఈ నెల 15వరకు జాతీయ పతాకాన్ని ఎగురవేయాలన్నారు. తూర్పు నావికాదళ కమాండ్‌కు చెందిన గ్యాలంట్రీ అవార్డు గ్రహీతలను గురువారం రాజ్‌భవన్‌లో ప్రత్యేక కార్యక్రమంలో గవర్నర్‌ సత్కరించారు. స్వాతంత్య్ర వేడుకల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

అవార్డు గ్రహీతలు కమాండర్‌ వరుణ్‌ సింగ్‌, కెప్టెన్‌ శౌర్యచక్ర మిలింద్‌ మోహన్‌ మొకాషి, కెప్టెన్‌ ఏకే తొమురోతు, కమాండర్లు శైలేందర్‌ సింగ్‌, ధీరేందర్‌ బిష్ట్‌, లెఫ్టినెంట్‌ కమాండర్‌ మను మిశ్రా, పెట్టీ ఆఫీసర్లు టి.ప్రకాశ్‌ సింగ్‌, విజయ్‌ కుమార్‌ వర్మ, ఎల్‌ఏ అమిత్‌, ఎంసీ ఎ.రమేష్‌కుమార్‌ ముఖర్‌, విశ్రాంత కమాండర్‌ చిన్న వీరయ్య, కమాండర్‌ శౌర్యచక్ర జై ప్రకాశ్‌, కమాండర్‌ ఎం.గోవర్ధన్‌ రాజులను గవర్నర్‌ సత్కరించారు. కార్యక్రమంలో ఏపీ నావల్‌ ఆఫీసర్‌-ఇన్‌ఛార్జి లెఫ్టినెంట్‌ కమాండర్‌ దినేష్‌కుమార్‌, రాజ్‌భవన్‌ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


మంగళగిరిలో గురువారం తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌కు తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత రాఖీ కట్టారు. ఈ సందర్భంగా లోకేశ్‌ పలువురు మహిళలకు కుట్టు మిషన్లు ఉచితంగా అందజేశారు. ‘సొంత అక్కాచెల్లెళ్లు లేని నాకు ఆడపడుచులంతా సొంత సోదరీమణులే. మీ అందరికీ అన్నలా అండగా.. తమ్ముడిలా తోడుగా ఉంటా. మీ అనురాగమే నాకు రక్ష’ అని తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని