Published : 13 Aug 2022 03:43 IST

ఆధిపత్య పోరుతో రచ్చరచ్చ

60:40 వాటాలు.. అయినా తప్పని తలనొప్పులు

సెజ్‌లో పనులపై అధికార పార్టీ నేతల పట్టుకు ఎత్తులు

ఈనాడు డిజిటల్‌, అనకాపల్లి, న్యూస్‌టుడే, అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల పరిధిలోని సెజ్‌లో 180 వరకు దేశ, విదేశాలకు చెందిన పరిశ్రమలు ఉన్నాయి. నిన్నమొన్నటి వరకు ఈ సెజ్‌లో ఏ పని జరగాలన్నా స్థానిక ఎమ్మెల్యే యూవీ రమణమూర్తి రాజు (కన్నబాబు) అనుమతి తప్పనిసరి. గ్రావెల్‌, ఇసుక, ఇతర మెటీరియల్‌ను స్థానిక ప్రజాప్రతినిధి ద్వారానే సమకూర్చుకునేవారు. సెజ్‌లోని చిన్నచిన్న కాంట్రాక్టులను ఎమ్మెల్యే వర్గీయులకు అప్పగించేవారు. ఇప్పుడు ఆ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఓ నాయకుడు జిల్లా మంత్రిని సెజ్‌ సెటిల్‌మెంట్‌ వ్యవహారాల్లోకి దింపాడు. నేరుగా కంపెనీ ప్రతినిధులతోనే మాట్లాడించి ఇకపై పనులేవైనా తాము సూచించిన వారికి కూడా అప్పగించాలని హుకుం జారీ చేయించాడు. దీంతో ఇప్పటివరకు గుట్టుగా సాగిన కాంట్రాక్టు పనుల వ్యవహారం నేతల మధ్య ఆధిపత్య పోరుతో రచ్చరచ్చవుతోంది. సెజ్‌లో పనులు చేసే వారు రెండు వర్గాలుగా విడిపోయి తగాదాలు పడుతున్నారు. వీరి పంచాయితీలను తీర్చలేక కంపెనీ ప్రతినిధులు తలలు పట్టుకుంటున్నారు.

రోజూ వాదులాటలే..
ఫెర్రో ఎల్లాయిస్‌ పరిశ్రమ నుంచి ఆఖరిగా స్లాగ్‌ వెలువడుతుంది. దీన్ని అమ్ముకునే బాధ్యతను స్థానిక ఎమ్మెల్యే కన్నబాబురాజు సూచించిన పార్టీ కార్యకర్తలకు కంపెనీల ప్రతినిధులు అప్పగించారు. దీని నుంచి ప్రతినెలా రూ.4లక్షల వరకు ఆదాయం వస్తుండడంతో ఈ పనులపై మరో నాయకుడి కన్నుపడింది. మంత్రిని రంగంలోకి దించి తమ వారికీ స్లాగ్‌ రవాణా అప్పగించాలని, లేకుంటే ఇబ్బందుల్లో పడాల్సి వస్తుందని హెచ్చరికలు పంపించాడు. వారు చెప్పిన వారికీ పనులు కేటాయించారు. ఈ  ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య గత కొద్ది రోజులుగా నలిగిపోతున్న కంపెనీ ప్రతినిధులు మధ్యేమార్గంగా స్థానిక ఎమ్మెల్యే వర్గానికి 60శాతం, సదరు మంత్రి సూచించిన వ్యక్తులకు 40 శాతం స్లాగ్‌ రవాణా బాధ్యతలను అప్పగించి సమస్య పెద్దది కాకుండా జాగ్రత్తపడ్డారు. అయినా రోజూ ఈ రెండు వర్గాల కార్యకర్తల మధ్య వాదులాటలు జరుగుతూనే ఉన్నాయి. ఎలమంచిలి నియోజకవర్గంలో మూడు సార్లు గెలుపొందిన రమణమూర్తిరాజు (కన్నబాబు) పేరు చెబితే భయపడే సామాన్య కార్యకర్తలు నేడు ఆయనపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. దీని వెనుక సదరు మంత్రి అండతో పాటు తెదేపా నుంచి వైకాపాలోకి వచ్చిన ఒకే సామాజికవర్గానికి చెందిన ఇద్దరు నాయకుల హస్తం ఉందని పార్టీలో ప్రచారం జరుగుతోంది.

నలిగిపోతున్న ఇటుకల తయారీదారులు
ఫెర్రో ఎల్లాయిస్‌ నుంచి వచ్చే స్లాగ్‌పై ఆధారపడి ఉమ్మడి జిల్లాలో 210 వరకు ఇటుకల తయారీ యూనిట్లు నడుస్తున్నాయి. గతంలో ఈ స్లాగ్‌ను ఇటుకల తయారీకి ఉచితంగానే ఇచ్చేవారు. తర్వాత సిమెంట్‌ కంపెనీల్లోనూ వాడడం మొదలుపెట్టాక ఉచితానికి మంగళం పాడేశారు. మార్కెట్‌లో డిమాండ్‌ పెరగడంతో దీనిపై ప్రజాప్రతినిధుల కన్నుపడింది. వారే కంపెనీలతో మాట్లాడి తక్కువ ధరకు స్లాగ్‌ను తీసుకుపోయి ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్నారు. ధరలను మూడు నెలలకు ఒకసారి పెంచుతూ దీనిపై ఆధారపడేవారి నడ్డి విరుస్తున్నారు. గతంలో ఉచితంగా ఇచ్చేది ఇప్పుడు డబ్బులిచ్చినా దొరక్కపోవడంతో పలువురు ఇటుకల తయారీదారులు వైకాపా నాయకుల నిలువు దోపిడీని నిరసిస్తూ కంపెనీ ముందు ఆందోళనకు దిగుతున్నారంటే పరిస్థితి ఎంతవరకు వచ్చిందో తేటతెల్లమవుతోంది.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని