మహనీయుల త్యాగఫలమే స్వాతంత్య్రం

ఎంతో మంది సమరయోధుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం, సమాజంలో జరిగే తప్పులను నిర్భయంగా ప్రశ్నించే స్వేచ్ఛ మనకు లభించాయని మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సీహెచ్‌. శైలజాకిరణ్‌ అన్నారు. హాంకాంగ్‌

Updated : 16 Aug 2022 06:21 IST

సిద్ధార్థ మహిళా కళాశాల వేడుకల్లో మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌

విజయవాడ సిటీ, న్యూస్‌టుడే: ఎంతో మంది సమరయోధుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం, సమాజంలో జరిగే తప్పులను నిర్భయంగా ప్రశ్నించే స్వేచ్ఛ మనకు లభించాయని మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సీహెచ్‌. శైలజాకిరణ్‌ అన్నారు. హాంకాంగ్‌ లాంటి చాలా అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోనూ స్వేచ్ఛ కోసం ప్రజలు పోరాడుతూనే ఉన్నారన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న వారిలో నాలుగు శాతం మంది మన మధ్య జీవించే ఉన్నారన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని నేటి పౌరులు నిబద్ధత, బాధ్యతతో పనిచేస్తే గొప్ప దేశంగా ఎదగగలమని చెప్పారు. విజయవాడలోని శ్రీ దుర్గామల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో సోమవారం నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవాల్లో శైలజాకిరణ్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవ వందనం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. సుసంపన్నమైన భారతదేశంలోని సహజ వనరులు, వస్తుసంపదను ఆంగ్లేయులు దోచుకుపోయి దేశాన్ని పేదరికంలోకి నెట్టారన్నారు. స్వాతంత్య్రం అనంతరం పాలించిన ఎంతోమంది నాయకుల కృషి, సమర్థ పాలనతో దేశం తిరిగి కోలుకుందన్నారు. స్వాతంత్య్రం వచ్చేసరికి 35 నుంచి 40 శాతం పేదరికం ఉంటే.. ప్రస్తుతం 10 శాతానికి తీసుకురాగలిగారన్నారు. ప్రభుత్వాలే తమకు అన్నీ చేయాలనే ధోరణిని ప్రజలు విడనాడి, సమాజానికి తామేం చేయగలమని బాధ్యతతో ఆలోచించాలన్నారు. దేశభవిష్యత్తు యువతపైనే ఆధారపడి ఉందని, ప్రతిఒక్కరూ చదువుకుని ఉన్నత స్థానానికి ఎదగాలని శైలజాకిరణ్‌ సూచించారు. అనంతరం విద్యార్థినులతో కలిసి డ్రమ్ము వాయించి, కొమ్ముబూర ఊది వారిని ఉత్సాహపరిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని