ఇలాంటి కేసును ఇప్పటికే హైకోర్టు కొట్టేసింది

జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ కేసుల తరవాత ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కేసులపై విచారణ చేపట్టేలా ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌లను గతంలో ఇదే హైకోర్టు కొట్టివేసిందని, ఇప్పుడు మళ్లీ అదే అభ్యర్థనపై

Updated : 19 Aug 2022 06:36 IST

అదే కేసులో నిందితులకు  ప్రత్యేక తీర్పు ఉండదు
జగతి, సాయిరెడ్డి పిటిషన్‌లపై  నివేదించిన ఈడీ

ఈనాడు, హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ కేసుల తరవాత ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కేసులపై విచారణ చేపట్టేలా ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌లను గతంలో ఇదే హైకోర్టు కొట్టివేసిందని, ఇప్పుడు మళ్లీ అదే అభ్యర్థనపై మరికొందరు నిందితులు పిటిషన్లను దాఖలు చేశారని, వీటిని అనుమతించరాదని హైకోర్టును ఈడీ అభ్యర్థించింది. ఇదే వివాదంపై అక్రమాస్తుల కేసులోని కొందరు నిందితులు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేయడంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారని, అక్కడ పెండింగ్‌లో ఉందని తెలిపింది. సీబీఐ కేసుల అనంతరం ఈడీ కేసుల విచారణను చేపట్టాలన్న అభ్యర్థనలను సీబీఐ కోర్టు కొట్టివేయడంతో వాటిని సవాలు చేస్తూ జగతి పబ్లికేషన్స్‌, భారతి సిమెంట్స్‌, విజయసాయిరెడ్డి తదితరులు దాఖలు చేసిన పిటిషన్‌లపై గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ విచారణ చేపట్టారు. ఈడీ తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ టి.సూర్యకరణ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ మనీలాండరింగ్‌ నిరోధక చట్టం ప్రత్యేకమైనదని, దీనిపై కేసును ప్రత్యేకంగా విచారణ చేపట్టవచ్చన్నారు. ప్రధాన కేసుపై విచారణ పూర్తయ్యేదాకా వేచి ఉండాల్సిన అవసరం లేదన్నారు. ఈడీ నమోదు చేసిన కేసులపై సత్వరం విచారణ చేపట్టి పూర్తి చేయాలన్నారు. ఇదే అక్రమాస్తుల వ్యవహారంలో ఇతర నిందితులు దాఖలు చేసిన పిటిషన్‌లను ఇదే హైకోర్టు కొట్టివేసిందన్నారు. అదే కేసుల్లోని నిందితుడికి ప్రత్యేక తీర్పు ఉండదని, వీరికి కూడా గతంలో ఇచ్చిన తీర్పే వర్తిస్తుందన్నారు. దీనిపై సుప్రీం కోర్టును ఆశ్రయించారని, ప్రస్తుత పిటిషనర్లు కావాలంటే అదే పిటిషన్‌లో ప్రతివాదులుగా చేరవచ్చని తెలిపారు. జగతి పబ్లికేషన్స్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ప్రధాన కేసుకు సంబంధించి ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఆధారపడలేమన్నారు. ఒకవేళ ప్రధానమైన సీబీఐ కేసు కొట్టివేసిన పక్షంలో మనీలాండరింగ్‌పై దాఖలు చేసిన కేసు నిలబడదని, దాన్ని కొనసాగింపు కుదరదని సుప్రీం చెప్పినపుడు ఈ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు నిలవవన్నారు. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో తాజాగా వాదనలు వినిపిస్తున్నామన్నారు. ఇరుపక్షాల వాదనలనూ విన్న న్యాయమూర్తి తీర్పును వాయిదా వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని