యాజమాన్య కోటా రిజిస్ట్రేషన్‌లోనూ బాదుడే

ఇంజినీరింగ్‌ యాజమాన్య కోటా (కేటగిరి-బీ) సీట్ల భర్తీకి రిజిస్ట్రేషన్‌ ఫీజులను ఉన్నత విద్యామండలి రెండింతలు పెంచేసింది. గతేడాది కన్వీనర్‌ కోటాలో ఈఏపీసెట్‌, జేఈఈలో అర్హత సాధించిన...

Published : 27 Sep 2022 05:25 IST

ఆదాయం కోసం విద్యార్థుల ఫీజులను రెండింతలుపెంచిన ఉన్నత విద్యామండలి

ఈనాడు, అమరావతి: ఇంజినీరింగ్‌ యాజమాన్య కోటా (కేటగిరి-బీ) సీట్ల భర్తీకి రిజిస్ట్రేషన్‌ ఫీజులను ఉన్నత విద్యామండలి రెండింతలు పెంచేసింది. గతేడాది కన్వీనర్‌ కోటాలో ఈఏపీసెట్‌, జేఈఈలో అర్హత సాధించిన వారి నుంచి రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద రూ.1,200, ఎస్సీ, ఎస్టీలకు రూ.600 వసూలు చేయగా.. ఈసారి అందరికీ దానిని రూ.2,500కు పెంచింది. ఈఏపీసెట్‌లో అర్హత సాధించని వారికి గతేడాది రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.1,800 కాగా.. ఇప్పుడు దాన్ని రూ.3,500 పెంచింది. కొత్తగా ఎన్‌ఆర్‌ఐ కోటాలో చేరే విద్యార్థి రూ.5వేలు చెల్లించాలనే నిబంధన పెట్టింది. చాలా మంది విద్యార్థులకు కోరుకున్న కళాశాల, కోర్సుల్లో సీట్లు రాకపోవడం, దూరంగా వెళ్ల లేక యాజమాన్య కోటాలో చేరుతారు. వారు ఇప్పుడు అదనపు ఆర్థిక భారాన్ని మోయాల్సి వస్తోంది.

విద్యార్థుల ఫీజులతో పారితోషికాలు: మరో పక్క పరీక్ష ఫీజు, కౌన్సెలింగ్‌ ఫీజుల రూపంలో విద్యార్థుల నుంచి ముక్కుపిండి వసూలు చేసి ఉన్నత విద్యామండలిలో పని చేసే వారు పారితోషికాలు తీసుకుంటున్నారు. ప్రవేశ పరీక్షలు ప్రారంభం నుంచి ముగింపు వరకు పర్యవేక్షణ బాధ్యతలు చూసినందుకు ఒక్కో అధికారి అదనంగా రూ.లక్ష నుంచి రెండున్నర లక్షల వరకు పారితోషికాన్ని తీసుకుంటున్నారు. ప్రభుత్వం సైతం అదనంగా నిధులు ఇవ్వాల్సిన పని లేనందున దీనిపై దృష్టి పెట్టడం లేదు.

కేటగిరి-బీ దరఖాస్తులు 28 నుంచి: యాజమాన్య కోటాకు ఈనెల 28 నుంచి అక్టోబరు 10వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. విద్యార్థులు నేరుగా కళాశాలలో లేదంటే కళాశాల, ఉన్నత విద్యామండలి వెబ్‌సైట్‌ల ద్వారానూ దరఖాస్తులు చేసుకోవచ్చు. అక్టోబరు 12 నుంచి కళాశాలలు దరఖాస్తులను డౌన్‌లోడ్‌ చేస్తారు. 14న అర్హుల జాబితాను రూపొందిస్తారు. 15న సీట్లు పొందిన అభ్యర్థుల వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని