‘జల్‌జీవన్‌ మిషన్‌’ అమలులో ఏపీకి 13వ ర్యాంకు

జల్‌జీవన్‌ మిషన్‌ పథకం అమలు (ఓవర్‌ ఆల్‌ పెర్ఫార్మెన్స్‌)లో ఆంధ్రప్రదేశ్‌కు 13వ ర్యాంకు దక్కింది. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆదివారం ఇక్కడి విజ్ఞాన్‌భవన్‌లో నిర్వహించిన స్వచ్ఛభారత్‌ దివస్‌ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ల ఆధ్వర్యంలో ఈ పథకం అమలుకు సంబంధించిన 2022 సంవత్సరం నివేదికను విడుదల చేశారు.

Updated : 03 Oct 2022 06:59 IST

గత ఏడాది కంటే మూడు ర్యాంకులు పైకి..

ఈనాడు, దిల్లీ: జల్‌జీవన్‌ మిషన్‌ పథకం అమలు (ఓవర్‌ ఆల్‌ పెర్ఫార్మెన్స్‌)లో ఆంధ్రప్రదేశ్‌కు 13వ ర్యాంకు దక్కింది. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆదివారం ఇక్కడి విజ్ఞాన్‌భవన్‌లో నిర్వహించిన స్వచ్ఛభారత్‌ దివస్‌ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ల ఆధ్వర్యంలో ఈ పథకం అమలుకు సంబంధించిన 2022 సంవత్సరం నివేదికను విడుదల చేశారు. 2020-21లో ఓవర్‌ ఆల్‌ పనితీరులో 50% మార్కులు సాధించిన ఆంధ్రప్రదేశ్‌.. 2022లో దాన్ని 68%కి పెంచుకొని మూడు ర్యాంకులు ఎగబాకింది. రాష్ట్రంలోని 13 జిల్లాల పరిధిలో 374 గ్రామాల్లో 8,827 ఇళ్లు, 849 ప్రభుత్వ సంస్థల నుంచి నమూనాలు సేకరించారు. ఇందులో 14% ఎస్సీ, 6% ఎస్టీ, 32% ఓబీసీ, 48% జనరల్‌ కుటుంబాలున్నాయి. 57% పురుషులు, 43% మహిళలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 22 నుంచి ఏప్రిల్‌ 25 మధ్యకాలంలో 10 బృందాలు 63 రోజులపాటు శ్రమించి ఈ నమూనాలను సేకరించాయి. దేశవ్యాప్తంగా 3,01,389 కుటుంబాల నుంచి నమూనాలు సేకరించగా అందులో 14% కుటుంబాలకు పనిచేసే కుళాయి లేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి కుటుంబాల సంఖ్య 2% ఉంది.

* రాష్ట్రంలో సర్వే చేసిన ఇళ్లలో 92%కి రోజూ తలసరి 50 లీటర్లకుపైన, 3%కి 40 లీటర్లపైన, 5%కి 40లీటర్లలోపు నీరు అందుతోంది.

* పనిచేసే కుళాయిలున్న ఇళ్లు గత ఏడాది 91% ఉండగా, ఈసారి అది 92%కి చేరింది.
* 72% గ్రామాల్లోనే ఓవర్‌హెడ్‌ట్యాంక్‌/సంపులాంటి నీటినిల్వ ఏర్పాట్లు ఉన్నాయి.

* 79% ఇళ్లకు క్రమం తప్పకుండా, 17% ఇళ్లకు పాక్షికంగా క్రమంగా, 4% ఇళ్లకు క్రమం లేకుండా నీళ్లు అందుతున్నాయి.

* క్రమం తప్పకుండా నీరు అందే కుటుంబాల సంఖ్య గత ఏడాదికాలంలో 91% నుంచి 79%కి పడిపోయింది. ఈ విషయంలో ఏపీ ఏడాదిలో 8 స్థానాలు కోల్పోయింది.

* రాష్ట్రంలో 87% ఇళ్లకు రోజుకోసారి, 11% ఇళ్లకు రోజుకు రెండుసార్లు, 2% ఇళ్లకు రోజుకు మూడుసార్లు నీటి సరఫరా జరుగుతోంది.74% ఇళ్లకు వారంలో ఏడు రోజులూ, 8%ఇళ్లకు 5 నుంచి 6 రోజులు, 16% ఇళ్లకు 3 నుంచి 4 రోజులు, 2% ఇళ్లకు 1 నుంచి 2 రోజులు నీరు అందుతోంది.

* 90% ఇళ్లకు సరఫరా అయ్యే నీరు తాగునీటి యోగ్యంగా ఉండగా, 10% తాగు నీటి యోగ్యంగా లేదు.

* రాష్ట్రంలో 33% కుటుంబాలు గత ఏడాదికాలంలో తమ కుళాయి నీటిని పరీక్షించారు.

* రాష్ట్రంలో 75% కుటుంబాలు కుళాయి నీటినే ప్రధానంగా వాడుతున్నాయి. 24% కుటుంబాలు ఇతర మెరుగైన మార్గాల నుంచి తీసుకుంటున్నాయి. 1% మాత్రం ఇతర మార్గాల నుంచి వాడుకుంటున్నాయి.

* 79% కుటుంబాలు తాగడానికి ముందు నీటిని శుద్ధి చేసుకుంటున్నాయి.
* రాష్ట్రంలో 10% కుటుంబాలు నీటి సర్వీస్‌ ఛార్జీలు చెల్లిస్తున్నాయి.
* 82% కుటుంబాలు కుళాయి నీటిని నిల్వ చేసుకుంటున్నాయి. 18% కుటుంబాలకు అలాంటి సౌకర్యం లేదు.

* కుళాయి నీరు తీసుకోవడానికి 46% కుటుంబాలు బూస్టర్‌ పంపులు వాడుతున్నాయి. ఈ విషయంలో ఏపీ దేశంలో 3వ స్థానంలో ఉంది.

* 30% కుటుంబాలు నీటి కొరతను ఎదుర్కొంటున్నట్లు చెప్పాయి. అయితే దాన్ని ఏదో ఒక విధానంలో అధిగమిస్తున్నట్లు పేర్కొన్నాయి.

* 35% గ్రామాలు తమ వద్ద భూగర్భజల వనరులున్నట్లు చెప్పాయి. అయితే 7% గ్రామాల్లోనే భూగర్భ జలవనరుల సంరక్షణ నిర్మాణాలున్నాయి.

* 39% గ్రామాల్లోనే ఫీల్డ్‌ టెస్ట్‌ కిట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని వినియోగించే నైపుణ్యం ఉన్న వ్యక్తులు 33% గ్రామాల్లోనే ఉన్నారు.

* రాష్ట్రంలో 9% గ్రామాల్లో నీటి నమూనాలను ఏటా మూడుకు మించి, 12% గ్రామాల్లో 1-2వరకు పరీక్షలు చేయిస్తున్నారు. 79% గ్రామాల్లో ఏటా ఒక్క పరీక్ష కూడా చేయించలేదు.

* రాష్ట్రంలో 21% గ్రామాల్లోనే క్లోరినేషన్‌ యంత్రాంగం ఉంది.
* 16% గ్రామాల్లో ఇళ్లనుంచి నీటి సర్వీసు ఛార్జీలు వసూలు చేస్తున్నారు.

* 32% గ్రామాల్లో మాత్రమే ప్రభుత్వ నీటి పథకాల నిర్వహణకు తగ్గ నైపుణ్య మానవ వనరులున్నాయి. 5% గ్రామాల్లో నిర్వహణ, యాజమాన్య సవాళ్లు ఎదురవుతున్నాయి.

* కుళాయినీరు ఇవ్వడంవల్ల 48రోజుల వార్షిక పనిదినాలు పెరిగినట్లు తేలింది. నీటి కారణంగా వచ్చే వ్యాధులు పూర్తిగా తగ్గాయి.

* ఇంటికి కుళాయినీటి సేకరణకోసం వెచ్చించే సమయం తగ్గినట్లు 85%కుటుంబాలు పేర్కొన్నాయి.

* ప్రాథమికోన్నత పాఠశాలల్లో దీనివల్ల బాలికల హాజరు 16% మెరుగుపడినట్లు తేలింది. 45% కుటుంబాలు తమ ఆదాయం వృద్ధిచెందినట్లు పేర్కొన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని