Sarath Chandra Reddy: దిల్లీ మద్యం వ్యాపారంలో.. 30 శాతం శరత్‌ గుప్పిట్లోనే!

దిల్లీ మద్యం కుంభకోణంలో పెనక శరత్‌ చంద్రారెడ్డి కీలకంగా చక్రం తిప్పారని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఆరోపించింది. దిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ నివేదికలో ఈడీ పలు అభియోగాలను ప్రస్తావించింది.

Updated : 11 Nov 2022 10:15 IST

బినామీ కంపెనీలతో కలిసి 9 జోన్లు నిర్వహిస్తున్నారు
ఇప్పటివరకు రూ.64 కోట్లు మూటగట్టుకున్నారు
ఆయన భాగస్వామిగా ఉన్న సౌత్‌గ్రూప్‌ సిండికేట్‌
రూ.100 కోట్ల ముడుపులు ముట్టజెప్పింది
రిమాండ్‌ రిపోర్టులో ఈడీ వెల్లడి 

ఈనాడు, దిల్లీ: దిల్లీ మద్యం కుంభకోణంలో పెనక శరత్‌ చంద్రారెడ్డి కీలకంగా చక్రం తిప్పారని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఆరోపించింది. దిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ నివేదికలో ఈడీ పలు అభియోగాలను ప్రస్తావించింది. ‘దిల్లీ మద్యం విధానం ప్రకారం ఏ వ్యక్తి కూడా రెండు రిటైల్‌ జోన్లకు మించి నియంత్రించకూడదన్న నిబంధన ఉన్నప్పటికీ అందుకు విరుద్ధంగా శరత్‌చంద్రారెడ్డి తన గ్రూప్‌ అయిన ట్రైడెంట్‌ కెమ్‌ఫర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, బినామీ సంస్థలైన ఆగ్రానోమిక్స్‌ ఎకో సిస్టమ్స్‌, శ్రీ అవంతిక కాంట్రాక్టర్స్‌ ద్వారా 5 రిటైల్‌ జోన్లను నియంత్రిస్తున్నారు. శరత్‌ చంద్రారెడ్డి పెట్టుబడుల ద్వారా ఈ బినామీ కంపెనీలను తన గుప్పిట్లో ఉంచుకున్నారు. శరత్‌ ఆదేశాల మేరకు పైన పేర్కొన్న మూడు కంపెనీలకు చెందిన కార్యకలాపాలను తాము చూస్తున్నట్లు ఆయన కింద పనిచేసే ఉద్యోగులు చెప్పారు. తయారీదారులు, టోకు, చిల్లర వ్యాపారులతో కలిపి సౌత్‌గ్రూప్‌ పేరుతో ఏర్పాటైన అతిపెద్ద సిండికేట్‌లో శరత్‌ చంద్రారెడ్డి ప్రధాన భాగస్వామి. ఈ సిండికేట్‌లో మద్యం తయారీదారు సమీర్‌ మహేంద్రుతో పాటు, దేశంలో అతిపెద్ద మద్యం తయారీ సంస్థ అయిన పెర్నాడ్‌ రికార్డ్‌ (పీఆర్‌ఐ) భాగస్వాములుగా ఉన్నాయి. ఇండో స్పిరిట్స్‌ అనే సంస్థను పీఆర్‌ఐ సంస్థ తన హోల్‌సేల్‌ డిస్ట్రిబ్యూటర్‌గా నియమించింది. అయితే ఇండోస్పిరిట్స్‌ సంస్థ సమీర్‌ మహేంద్రు, అరుణ్‌పిళ్లై, ప్రేమ్‌ రాహుల్‌ మండూరిల చేతుల్లో ఉంది. ఇందులో శరత్‌ చంద్రారెడ్డితో పాటు, ఇతర బినామీలకు ఆర్థిక ప్రయోజనాలున్నాయి. ఇండో స్పిరిట్స్‌లో శరత్‌ చంద్రారెడ్డి కూడా పెట్టుబడులు పెట్టినట్లు వెలుగులోకి వచ్చింది.

* శరత్‌ చంద్రారెడ్డి నడుపుతున్న సౌత్‌గ్రూప్‌ పలు బినామీ సంస్థల ద్వారా తొమ్మిది రిటైల్‌ జోన్లను తన అధీనంలో ఉంచుకుంది. తన మూడు కంపెనీల ద్వారా 5 రిటైల్‌ జోన్లను, సిండికేట్‌లో సభ్యులుగా ఉన్న ఇతరుల ద్వారా మరో 4 జోన్లను శరత్‌ నడుపుతున్నారు. ముడుపులు ముట్టచెప్పడం, బినామీ సంస్థలు నడపడం, మద్యం పరిశ్రమలోని వివిధ భాగస్వాములతో కుట్ర పన్నడం లాంటి అవినీతి కార్యకలాపాలతో ఈ సిండికేట్‌ దిల్లీ మద్యం మార్కెట్‌లో 30 శాతాన్ని నియంత్రిస్తోంది.

* శరత్‌ చంద్రారెడ్డి, ఇతరుల ఆధ్వరంలో నడుస్తున్న సౌత్‌గ్రూప్‌ సిండికేట్‌ విజయ్‌నాయర్‌ ద్వారా రూ.100 కోట్ల ముడుపులు ముట్టజెప్పింది. ఇలా చేసిన చెల్లింపులను పలు రిటైల్‌ జోన్లు, ఇండోస్పిరిట్స్‌ ద్వారా ముందుగా రాబట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన దర్యాప్తు పురోగతిలో ఉంది.

* శరత్‌ చంద్రారెడ్డికి చెందిన రిటైల్‌జోన్లలో ఉన్న సర్వర్లను ఉద్యోగులు వేరే చోటికి తరలించేందుకు ప్రయత్నించినట్లు సోదాలు నిర్వహించినప్పుడు తెలిసింది. ఆ సర్వర్లను విశ్లేషించినప్పుడు అవంతిక, ట్రైడెంట్‌ సంస్థలకు చెందిన రెండు రిటైల్‌ జోన్లకు సంబంధించిన సమాచారం అందులో ఉన్నట్లు తేలింది. శరత్‌ నిర్దేశాల మేరకు కీలకమైన డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను తమ కార్యాలయ ప్రాంతాల నుంచి తొలగించినట్లు ఒక ఉద్యోగి చెప్పారు. సాక్ష్యాధారాలను ధ్వంసం చేయడానికి ఉద్దేశపూర్వకంగా ఈ పనిచేశారు. ట్రైడెంట్‌ మినహా మిగిలిన సంస్థల పేరుతో తనకు ఎలాంటి రిటైల్‌ జోన్లు లేవని శరత్‌ చంద్రారెడ్డి చెప్పినప్పటికీ అవంతిక, ట్రైడెంట్‌ సంస్థలకు చెందిన సర్వర్లను తరలించమని ఆయన ఆదేశాలు జారీచేశారు. ఆ సర్వర్లను విశ్లేషించినప్పుడు నేరనిరూపణకు అవసరమైన సమాచారం అందులో ఉన్నట్లు తేలింది.

* ఇండో స్పిరిట్స్‌ సంస్థ సొంతంగా శరత్‌ చంద్రారెడ్డి సంస్థలకు అధిక క్రెడిట్‌ నోట్లు జారీ చేసింది. తయారీదారులేమీ ఆ క్రెడిట్‌నోట్స్‌ను ట్రైడెంట్‌, అవంతిక, ఆగ్రానోమిక్స్‌కి జారీ చేయమని కోరుతూ ఇండోస్పిరిట్‌కి ఇవ్వలేదు. తయారీదారులు ఇవ్వకపోయినా క్రెడిట్‌నోట్స్‌ జారీ చేయడం మోసపూరితం. రూ.4.35 కోట్ల విలువైన క్రెడిట్‌నోట్స్‌ను ఇండో స్పిరిట్‌ ఈ మూడు సంస్థలకు జారీ చేయడానికి ప్రధాన కారణం శరత్‌ చంద్రారెడ్డి చేతుల్లో ఉన్న రిటైల్‌జోన్లకు అనుచిత లాభాలు/ప్రయోజనాలు బదిలీ చేయడమే. టోకు వ్యాపారులకు అదనంగా ఇచ్చిన 7% మార్జిన్‌ను లంచం రూపంలో ఇలా బదిలీ చేశారు.

* దర్యాప్తును తప్పుదోవ పట్టించడానికి చాలా క్రెడిట్‌నోట్స్‌ను వెనక్కు తీసుకున్నట్లు 2022 ఆగస్టులో కాగితాలమీద చూపారు. ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ ప్రారంభించిన తర్వాత ఆ పనిచేశారు. దీన్నిబట్టి ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన రూ.60 కోట్లు ట్రైడెంట్‌ కెమ్‌ఫర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఆగ్రానోమిక్స్‌ ఎకో సిస్టమ్స్‌, శ్రీ అవంతిక కాంట్రాక్టర్స్‌ ఆధ్వర్యంలోని రిటైల్‌జోన్లకు సంబంధించిందని స్పష్టంగా తెలుస్తోంది. ఎలాంటి సిండికేట్లు లేకుండా వ్యాపారం చేసే జోన్లతో పోలిస్తే వీటి దగ్గర ఇంత భారీ మొత్తం మిగలడం అన్నది అసాధారణం.

* శరత్‌ చంద్రారెడ్డికి చెందిన రిటైల్‌ గ్రూపుల వద్ద ఉన్న మిగులు మొత్తం గురించి ఏమీ అడగొద్దని సమీర్‌ మహేంద్రు తన ఫైనాన్స్‌ బృందానికి స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. దీన్నిబట్టి ఈ రూ.60 కోట్లు, ఇంతకుముందు పేర్కొన్న రూ.4.35 కోట్ల క్రెడిట్‌ నోట్స్‌ అన్నీ నేరపూరితంగా కూడగట్టుకొన్న సొమ్మే.

* వివిధ వ్యాపారులు, రాజకీయ నాయకులతో కలిసి శరత్‌ చంద్రారెడ్డి పక్కా ప్రణాళిక, కుట్ర ప్రకారం మోసపూరిత మార్కెట్‌ విధానాల ద్వారా దిల్లీ మద్యం విధానం నుంచి అనుచిత ప్రయోజనం పొందడానికి ప్రయత్నించినట్లు ఈ అంశాలు స్పష్టం చేస్తున్నాయి. శరత్‌ చంద్రారెడ్డి కుట్రపూరితంగా సిండికేట్‌ ద్వారా విస్తృత మార్కెట్‌ను నడపడం అన్నది కూడా దిల్లీ మద్యం విధానానికి విరుద్ధం. అవినీతిపనులు, కుట్ర ద్వారా ఆయన రూ.64.35 కోట్ల సొమ్మును కూడగట్టారు.

* ఇప్పటివరకు నిర్వహించిన దర్యాప్తు ప్రకారం నేరపూరితంగా సొమ్మును రాబట్టుకొని, దగ్గర ఉంచుకోవడంతోపాటు దాన్ని ఉపయోగించడంలో శరత్‌ చంద్రారెడ్డి పాలుపంచుకున్నట్లు తేలింది. మనీలాండరింగ్‌ నేరం కింద ఆయన నిందితుడు. దర్యాప్తునకు అతిముఖ్యమైన సమాచారం ఆయన వద్ద ఉంది. అందుకే పీఎంఎల్‌ఏ-2002 సెక్షన్‌ 19 కింద ఆయనను దిల్లీ ఈడీ ఆఫీసులో అరెస్టు చేశాం. వెంటనే ఆ విషయాన్ని ఆయన సతీమణికి ఫోన్‌ ద్వారా చెప్పాం.

* ఇప్పటివరకు నిర్వహించిన 169 సోదాల ద్వారా భారీగా డిజిటల్‌, ఫిజికల్‌ రికార్డులు స్వాధీనం చేసుకున్నాం. ఇప్పుడు అందులోని వివరాల గురించి ఆయనను విచారించాల్సి ఉంది. దిల్లీ ప్రభుత్వానికి జరిగిన రూ.2,631 కోట్ల ఆదాయ నష్టం గురించీ కస్టోడియల్‌ ఇంటరాగేషన్‌ చేయాల్సి ఉంది. మొత్తం నేరం పూర్వాపరాలను రాబట్టి ఇప్పటివరకు నేరపూరితంగా సంపాదించిన సొమ్మునంతా వెలికి తీయాల్సి ఉంది’ అని ఈడీ రిమాండ్‌ రిపోర్టులో పేర్కొంది.


140 ఫోన్లు ధ్వంసం చేశారు

దిల్లీ మద్యం కుంభకోణంలో కీలకంగా ఉన్న 34 మంది వ్యక్తులు సాక్ష్యాలను చెరిపేయడానికి ఇప్పటివరకు రూ.1.20 కోట్ల విలువైన 140 ఫోన్లను ధ్వంసం చేసినట్లు ఈడీ రిమాండ్‌ రిపోర్టులో పేర్కొంది. ఇందులో ప్రధాన నిందితులు, పెద్ద మద్యం వ్యాపారులు, సీనియర్‌ ప్రభుత్వాధికారులు, దిల్లీ ఎక్సైజ్‌ మంత్రి, ఇతర అనుమానితులు ఉన్నట్లు తెలిపింది. ఫోన్లు మార్చిన విషయాన్ని గమనిస్తే ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చిన వెంటనే ఆ పని చేసినట్లు స్పష్టమవుతోందని పేర్కొంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని