నటశేఖరుడికి కన్నీటి వీడ్కోలు

తెలుగు చలనచిత్ర సూపర్‌స్టార్‌.. నటశేఖర కృష్ణకు కుటుంబసభ్యులు.. ఆప్తులు.. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన అభిమానులు బుధవారం కన్నీటి వీడ్కోలు పలికారు.

Published : 17 Nov 2022 06:15 IST

నివాళి అర్పించిన గవర్నర్‌ తమిళిసై, ఏపీ సీఎం జగన్‌
పద్మాలయ స్టూడియోకు వేల మంది అభిమానులు
ప్రభుత్వ లాంఛనాల మధ్య సూపర్‌స్టార్‌ కృష్ణ అంత్యక్రియలు

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, జూబ్లీహిల్స్‌, ఫిలింనగర్‌, రాయదుర్గం: తెలుగు చలనచిత్ర సూపర్‌స్టార్‌.. నటశేఖర కృష్ణకు కుటుంబసభ్యులు.. ఆప్తులు.. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన అభిమానులు బుధవారం కన్నీటి వీడ్కోలు పలికారు. కళారంగానికి చిరస్మరణీయ సేవలందించిన కృష్ణ అంత్యక్రియలను తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో నిర్వహించి ఘన నివాళి అర్పించింది. అంతకుముందు ఉదయం 7 గంటలకు కృష్ణ పార్థివ దేహాన్ని అభిమానుల సందర్శనార్థం నానక్‌రాంగూడ నుంచి జూబ్లీహిల్స్‌లోని పద్మాలయ స్టూడియోకు తరలించారు. ఉదయం నుంచే వేలాది అభిమానులు.. ప్రముఖులు ఆయనకు నివాళులర్పించేందుకు వచ్చారు. మధ్యాహ్నం 12 గంటలకు అనుకున్న అంతిమయాత్ర అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరగడంతో మధ్యాహ్నం 2.30 గంటలకు మొదలైంది. మహాప్రస్థానంలోని మోక్షస్థల్‌ కలప దహన వాటికలో హిందూ సంప్రదాయ పద్ధతిలో కృష్ణ అంత్యక్రియలను ఆయన కుమారుడు మహేశ్‌బాబు నిర్వహించారు. అంతకుముందు పోలీసులు కృష్ణ భౌతికకాయానికి గౌరవ వందనం చేసి నివాళులు అర్పించారు. సంతాప సూచకంగా మూడుసార్లు గాల్లోకి కాల్పులు జరిపారు. మహా ప్రస్థానం వెలుపల ఆయన అభిమానులు కృష్ణ అమర్‌ రహే, జోహార్‌ కృష్ణ అంటూ నినాదాలు చేశారు. అంత్యక్రియల అనంతరం కృష్ణ కుటుంబ సభ్యులు, ప్రముఖులు వెళ్లిపోయాక పోలీసులు అభిమానులను మహాప్రస్థానంలోకి అనుమతించారు. వారు చితిని సందర్శించి కంటతడి పెట్టారు.

ప్రముఖుల నివాళులు

పద్మాలయ స్టూడియోలో కృష్ణ పార్థివదేహానికి ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌, తెలంగాణ గవర్నర్‌ తమిళిసై, రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌ నివాళులర్పించి.. మహేశ్‌బాబును ఓదార్చారు. సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఏపీ పర్యాటక మంత్రి రోజా, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, వసుంధర, నారా బ్రాహ్మణి, మోహన్‌బాబు, అల్లు అరవింద్‌, నితిన్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, దిల్‌ రాజు, దగ్గుబాటి సురేష్‌, అశ్వనీదత్‌, మలినేని గోపీచంద్‌, సి.కళ్యాణ్‌, మెహర్‌ రమేష్‌, తమ్మారెడ్డి భరద్వాజ, పరుచూరి గోపాలకృష్ణ, అలీ, కీరవాణి, కొరటాల శివ, బి.గోపాల్‌, జయప్రద, మురళీమోహన్‌, కోట శ్రీనివాసరావు, మణిశర్మ, శేఖర్‌ కమ్ముల, కె.ఎస్‌.రామారావు తదితరులు కూడా నివాళులు అర్పించారు. ఎంపీ రఘురామకృష్ణరాజు, తెలంగాణ ఎమ్మెల్యే దానం నాగేందర్‌, ఏపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, గల్లా అరుణ, ప్రజా గాయకుడు గద్దర్‌, కాంగ్రెస్‌ నేత వి.హనుమంతరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, మాజీ ఎంపీ సుజనాచౌదరి తదితరులు మహేశ్‌బాబును, కుటుంబ సభ్యులను పరామర్శించారు. పద్మాలయ స్టూడియోలో కృష్ణ అంత్యక్రియల కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ పర్యవేక్షించారు. ప్రభుత్వ లాంఛనాల మధ్య కృష్ణ భౌతిక కాయాన్ని ప్రత్యేక పూల రథంలో జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానానికి తరలించడం నుంచి అంతిమ సంస్కారాల ప్రక్రియ వరకు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ దగ్గరుండి చూసుకున్నారు.

బాలకృష్ణను పలకరించిన ఏపీ సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అమరావతి నుంచి హైదరాబాద్‌కు వచ్చి.. పద్మాలయ స్టూడియోలో కృష్ణకు పుష్పాంజలి ఘటించారు. మహేశ్‌బాబును ఆలింగనం చేసుకుని ధైర్యం చెప్పారు. కృష్ణ అల్లుడు, ఎంపీ గల్లా జయదేవ్‌, పద్మావతి, మంజుల, సంజయ్‌ స్వరూప్‌, సుధీర్‌బాబు, ప్రియదర్శిని, నమ్రతా శిరోద్కర్‌, గౌతమ్‌, సితారలను ఆయన పేరుపేరునా పలకరించారు. అక్కడే ఉన్న నందమూరి బాలకృష్ణను కూడా జగన్‌ పలకరించారు. ఇద్దరూ పరస్పరం అభివాదం చేసుకున్నారు.

సాహసానికి మారుపేరు ఆయనే: బాలకృష్ణ

సాహసానికి మారుపేరు సూపర్‌స్టార్‌ కృష్ణ. డ్యాషింగ్‌, డేరింగ్‌, డైనమిక్‌ హీరో కృష్ణ మన మధ్య లేరన్నది నమ్మలేని నిజం. ఆయన సినిమాలు సాహసాలకు, ప్రయోగాలకు మారుపేరుగా నిలిచాయి. కొత్త నిర్మాతలు, దర్శకులను పరిచయం చేసింది నాన్న ఎన్టీఆర్‌, కృష్ణ. ఆయన అందగాడు అంటూ నాన్న పదే పదే గుర్తు చేసేవారు. కళామతల్లికి ఆయన చేసిన సేవలు, తీసిన సినిమాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి.

అందరూ ఇష్టపడే ఏకైక హీరో: రోజా

తెలుగు చిత్ర పరిశ్రమలో అందరూ ఇష్టపడే ఒకే ఒక్క హీరో కృష్ణ. ఆయన లేరంటే జీర్ణించుకోలేకపోతున్నాం. పరిశ్రమకు పెద్ద దిక్కయిన ఎన్టీఆర్‌, ఏఎన్‌ఆర్‌, కృష్ణంరాజు, కృష్ణలను భగవంతుడు తనకు కావాలని తీసుకుపోయాడు. చిన్నప్పటి నుంచి ఆయనకు పెద్ద అభిమానిని. ఆయనతో కథానాయికగా పనిచేయడం నా అదృష్ణం. ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్నివ్వాలి.

నాటకరంగం నుంచి చివరి సినిమా వరకు..

కృష్ణకు ఆయన వ్యక్తిగత మేకప్‌మేన్‌ మాధవరావు నివాళులు అర్పించారు. నాటక రంగంలో ఉన్నప్పటి నుంచే ఆయనకు మేకప్‌ వేసేవాడినని, ‘సాక్షి’ సినిమా నుంచి ఆయన చివరి సినిమా వరకు కలిసి పనిచేశానని, కృష్ణ జీవితం ఒక పుస్తకంలాంటిదని, ఆయనను చూసి యువ కథానాయకులు నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

గాంధీభవన్‌లో నేతల నివాళి

మాజీ ఎంపీ, సినీ నటుడు సూపర్‌స్టార్‌ కృష్ణ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్‌ నేతలు బుధవారం గాంధీభవన్‌లో ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు, నాయకులు టి.కుమార్‌రావు, సాయికుమార్‌, తదితరులు పాల్గొన్నారు.


అభిమానం కిక్కిరిసింది

కృష్ణ భౌతిక కాయాన్ని సందర్శించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పద్మాలయ స్టూడియో వద్దకు వేల సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా పశ్చిమ మండల డీసీపీ జోయల్‌ డేవిస్‌ పర్యవేక్షించినా.. బ్యారికేడ్లను తోసుకుంటూ వచ్చేశారు. వారిని అడ్డుకోవడం ఒక దశలో పోలీసుల తరం కాలేదు. పలుమార్లు లోపలికి దూసుకొచ్చారు. దీంతో వారు లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. ఒకరిద్దరు స్వల్పంగా గాయపడ్డారు. వేలాది మంది యువకులతో పాటు 50 ఏళ్లకు పైబడిన చాలా మంది అభిమానులు కృష్ణ భౌతికకాయాన్ని కడసారి చూసి కన్నీళ్ల పర్యంతమయ్యారు. వేలాది మందితో జూబ్లీహిల్స్‌ రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. వచ్చిన అభిమానులకు భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని