అక్రమార్కుల బరితెగింపు!

అనకాపల్లి జిల్లా కశింకోట మండలం విస్సన్నపేటలో అధికార పార్టీ నేతలు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు.

Updated : 24 Nov 2022 06:18 IST

సొంత లేఅవుట్‌ రోడ్డుకు 10 ఎకరాల ఆక్రమణ
అధికారులు పాతిన హెచ్చరిక బోర్డుల తొలగింపు
రైతులను బెదిరించి ఎసైన్డ్‌ భూముల కొనుగోళ్లు
విస్సన్నపేటలో వైకాపా నేతల ఇష్టారాజ్యం

ఈనాడు డిజిటల్‌, అనకాపల్లి -న్యూస్‌టుడే, కశింకోట: అనకాపల్లి జిల్లా కశింకోట మండలం విస్సన్నపేటలో అధికార పార్టీ నేతలు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. తమ సొంత లేఅవుట్‌కు రోడ్డు విస్తరించుకునేందుకు రూ.కోట్ల విలువైన సుమారు పదెకరాల ప్రభుత్వ భూములను ఆక్రమించేశారు. వీటిపై ఏడాది క్రితమే స్థానికులు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన అధికారులు అక్రమాలను గుర్తించి ఇటీవల ఆయా భూముల్లో హెచ్చరిక బోర్డులను పాతారు. అయితే ఆక్రమణదారులు ఆ బోర్టులను పీకేశారు. వాటిపై రాయించిన ఆక్రమణల వివరాలనూ చెరిపేశారు. బోర్డులను ఆక్రమిత స్థలాల్లో కాకుండా వేరేచోట పాతిపెట్టారు. ఇంత జరుగుతున్నా అధికారులు అటుగా కన్నెత్తి చూడటంలేదు.

తోటలను తొలగించి... కొండలను కరిగించి...

బయ్యవరం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 195/2లో సుమారు 600 ఎకరాల భూములను ఏడాది కిందట అధికార పార్టీ పెద్దలు కొనుగోలు చేశారు. వాటిలో ఉన్న తోటలను తొలగించి, కొండలను కరిగించి ఒకే కమతంగా మార్చేశారు. ఈ భూముల లావాదేవీలన్నీ వైకాపాకు చెందిన గవర కార్పొరేషన్‌ ఛైర్మన్‌ బొడ్డేడ ప్రసాద్‌ చూస్తున్నారు. ఈయన ఎంపీ విజయసాయిరెడ్డి, పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కు అత్యంత సన్నిహితుడు. విశాఖలోని దసపల్లా భూముల అభివృద్ధికి ఒప్పందం చేసుకున్న ఎష్యూర్‌ ఎస్టేట్స్‌ డెవలపర్‌ గోపీనాథ్‌రెడ్డి ఇక్కడ 6.56 ఎకరాలు కొనుగోలు చేశారు. ఇటీవలే మౌంట్‌ విల్లాస్‌ పేరిట ఒక బ్రోచర్‌ విడుదల చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా... ఈ లేఅవుట్‌లోకి వెళ్లే మార్గం కేవలం అడుగుల వెడల్పు మాత్రమే ఉండేది. ఈ దారిని చూపించి స్థలాల అమ్మకం కష్టమని వైకాపా పెద్దలు భావించారు. లేఅవుట్‌ నిర్మాణానికి ముందుగానే ఆ దారికి ఒకవైపు ప్రభుత్వ, ఎసైన్డ్‌ భూములను ఆక్రమించేశారు. మరోవైపు అల్లిమెట్ట కొండను చాలావరకు తొలిచేశారు. ఒకప్పుడు ఎడ్లబండి నడిచే దారిని నేడు వంద అడుగులకుపైగా విస్తరించారు. ఈ రోడ్డు నిర్మాణంలోనే... సర్వే నంబరు 624లోని గెడ్డపోరంబోకు స్థలంలో 83 సెంట్లు, సర్వే నంబరు 2లోని 4.87 ఎకరాలు, సర్వే నంబరు 108లోని 4.23 ఎకరాలు ఆక్రమించి చదును చేసేశారు. మొత్తంగా 9.93 ఎకరాలను ఆక్రమించి రోడ్డు వేశారు. ఈ ఆక్రమణలపై స్థానికుల ఒత్తిడితో అధికారులు హెచ్చరిక బోర్డులు పాతారు. బోర్డులుంటే తమ లేఅవుట్‌కు ఇబ్బందని ఆక్రమణదారులు వాటిని తొలగించేశారు.


ఎసైన్డ్‌ భూములపై కన్ను

నేతల లేఅవుట్‌ను ఆనుకుని ఎసైన్డ్‌ భూములున్నాయి. గతంలో దళితులు, మాజీ సైనికులకు ఇక్కడ భూములిచ్చారు. వారంతా జీడి తోటలు వేసుకున్నారు. ఈ భూములపై ఇప్పుడు నేతల కన్నుపడింది. ఇప్పటికే కొందరి భూములను తమ చేతుల్లోకి తీసుకుని, తోటలను తొలగించారు. మిగతా రైతులతో బేరసారాలు నడుపుతున్నారు. ఎసైన్డ్‌ భూములు కొనడం నేరమని తెలిసినా వైకాపా అండతో బెదిరింపులకు దిగుతున్నారు. తాజాగా సర్వే నంబరు 108లో ఓ మాజీ సైనికుడి భూమిని ఎలాంటి ఎన్వోసీ లేకుండానే దక్కించుకున్నట్లు సమాచారం. ఈ విషయమై తహసీల్దారు సుధాకర్‌ వద్ద ప్రస్తావించగా... బోర్డులు తొలగించిన విషయం తెలియదని, వెంటనే వాటిని పునరుద్ధరిస్తామన్నారు. మళ్లీ ఎవరైనా తొలగించడానికి ప్రయత్నిస్తే వారిపై క్రిమినల్‌ కేసులు పెట్టిస్తామని, ఎసైన్డ్‌ భూములు చేతులు మారినా చర్యలు తీసుకుంటామని తెలిపారు.విలువైన సుమారు పదెకరాల ప్రభుత్వ భూములను ఆక్రమించేశారు. వీటిపై ఏడాది క్రితమే స్థానికులు ఫిర్యాదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని