ఇదేం కక్ష!

వేల మందికి ఉపాధి కల్పించే భారీ పరిశ్రమలు రాష్ట్రంనుంచి వెళ్లిపోయినా ఫర్వాలేదు.. ఉపాధి, ఉద్యోగాల్లేక యువత పొరుగు రాష్ట్రాలకు తరలిపోయినా మాకేమీ నష్టం లేదు.. నైపుణ్యమున్న మానవ వనరులన్నీ ఇతర రాష్ట్రాలకు వెళ్లి స్థిరపడిపోయినా పట్టించుకునేదే లేదు..

Updated : 04 Dec 2022 07:13 IST

పరిశ్రమలపై పగ
కొత్తవి రానివ్వరు
ఉన్నవాటిని బతకనివ్వరు
ఇదీ వైకాపా ప్రభుత్వ తీరు
మానవ వనరులు తరలిపోతున్నా పట్టదు
వేల కోట్ల ఆదాయం కోల్పోతున్నా చింతలేదు
ఈనాడు - అమరావతి

వేల మందికి ఉపాధి కల్పించే భారీ పరిశ్రమలు రాష్ట్రంనుంచి వెళ్లిపోయినా ఫర్వాలేదు..

ఉపాధి, ఉద్యోగాల్లేక యువత పొరుగు రాష్ట్రాలకు తరలిపోయినా మాకేమీ నష్టం లేదు.. 

నైపుణ్యమున్న మానవ వనరులన్నీ ఇతర రాష్ట్రాలకు వెళ్లి స్థిరపడిపోయినా పట్టించుకునేదే లేదు..

వారి నైపుణ్యాన్ని, మేధాశక్తిని ఆ రాష్ట్రాభివృద్ధికి ధారపోసినా మాకేమీ పట్టదు..

వారి సేవల్ని వాడుకుని ఆ రాష్ట్రాలు ఆర్థికంగా ఎదుగుతున్నా బెంగపడం..

మాకు కావలసిందల్లా ఒకటే.. గత ప్రభుత్వ హయాంలో ఒప్పందం చేసుకున్న పరిశ్రమేదీ రాష్ట్రానికి రావడానికి వీల్లేదు. పెట్టుబడులు, పరిశ్రమల్లేక రాష్ట్రం నష్టపోయినా పర్వాలేదుగానీ.. గత ప్రభుత్వానికి మాత్రం ఎలాంటి ఘనతా దక్కకూడదు!

ప్రతిపక్ష పార్టీ వారి పరిశ్రమలనయితే ముందే తరిమికొట్టేయాలి... వారి ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టేయాలి.. రాష్ట్రానికి ఏదైనా పరిశ్రమ వచ్చినా అది మనోళ్లదే అయిఉండాలి.. ఇదీ మూడున్నరేళ్లుగా వైకాపా ప్రభుత్వ వైఖరి. అదే ఇప్పుడు రాష్ట్రాభివృద్ధికి శాపంగా మారింది. పొరుగు రాష్ట్రాలన్నీ పారిశ్రామిక, సేవా రంగాల్లో శరవేగంగా దూసుకుపోతుంటే... ఆంధ్రప్రదేశ్‌ మాత్రం రాన్రానూ తిరోగమనంలోకి జారిపోతోంది. కొత్త పరిశ్రమల్ని ఆకర్షించేందుకు ప్రభుత్వం తగిన ప్రయత్నాలు చేయకపోగా, గతంలో వచ్చిన పరిశ్రమలను కక్షసాధింపుతో తరిమికొడుతుండటంతో రాష్ట్రం ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతోంది. రాష్ట్రంలో 14 ఏళ్లలోపు పిల్లల సంఖ్య ఏటికేడాది తగ్గిపోతోందన్న కేంద్ర సర్వేల లెక్కలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. రాష్ట్రంలో ఉపాధి అవకాశాల్లేక యువత వలసపోవడమే దీనికి కారణమని, ఇదే ధోరణి కొనసాగితే రాబోయే ఒకటి రెండు దశాబ్దాల్లో ఏపీ వృద్ధుల రాష్ట్రంగా మిగిలిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టూ లేదు!

ఒక భారీ పరిశ్రమ వచ్చిందంటే దానికి అనుబంధంగా అనేక చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఏర్పాటవుతాయి. వాటిలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు ఆ చుట్టుపక్కలే ఆవాసం ఏర్పాటు చేసుకుంటారు. అక్కడో పట్టణమే అవతరిస్తుంది. క్రమంగా అదో నగరంగా ఎదుగుతుంది. ప్రభుత్వానికి పన్నుల రూపంలో రూ.కోట్లలో ఆదాయం వస్తుంది. ఆ డబ్బుతో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చు! రాష్ట్ర భవిష్యత్తుపై నిజమైన అక్కర, శ్రద్ధ, నిబద్ధత ఉన్న ఏ ప్రభుత్వమైనా పరిశ్రమల్ని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంది. వైకాపా ప్రభుత్వం మాత్రం.. పచ్చటి చెట్లలా ఎదిగి, వేల మందికి నీడనిస్తున్న పరిశ్రమల్ని కూకటివేళ్లతో పెకిలించేయాలని చూస్తోంది. రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు.. కక్ష తీరడమే తమకు ముఖ్యమని పదేపదే నిరూపిస్తోంది. తాజాగా అమరరాజా పరిశ్రమ రాష్ట్రంలో పెట్టాల్సిన పెట్టుబడులను తెలంగాణకు తరలించడానికీ ఈ వైఖరే కారణమైంది.

పాడికుండను కాలదన్నడమే!

ఒక భారీ పరిశ్రమతో కొన్ని వేల మందికి ఉపాధి దొరుకుతుంది. పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఏటా రూ.కోట్లలో ఆదాయం వస్తుంది. ఉదాహరణకు రూ.10 వేల కోట్లతో ఒక పరిశ్రమ ఏర్పాటైతే ప్రత్యక్షంగా, పరోక్షంగా కనీసం 8 వేల మందికి ఉపాధి లభిస్తుంది. అంటే 8 వేల కుటుంబాల్లోని సుమారు 25 వేల మంది నేరుగా ఆ పరిశ్రమపై ఆధారపడి బతుకుతున్నట్టే. అనుబంధ పరిశ్రమల్లో పనిచేసేవారు, వారిపై ఆధారపడి బతికే వివిధ వృత్తులవారు లక్షల్లో ఉంటారు. అలాంటి పరిశ్రమను రాష్ట్రం నుంచి వెళ్లగొట్టడమంటే పాడికుండను కాలదన్నినట్టేనని ఆర్థికరంగ నిపుణులు చెబుతున్నారు. వారి విశ్లేషణ ప్రకారం.. రూ.10 వేల కోట్ల పెట్టుబడితో పరిశ్రమ ఏర్పాటైతే వార్షిక టర్నోవర్‌పై ఆ పరిశ్రమ చెల్లించే జీఎస్టీ, ఉద్యోగులు వారి వేతనాల్ని వివిధ అవసరాల కోసం ఖర్చు చేసినప్పుడు చెల్లించే పన్నులు, పరిశ్రమ, ఉద్యోగులు చెల్లించే ఆదాయపన్ను, ఇతర పన్నుల రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యక్షంగా ఏటా రూ.800 కోట్లకుపైనే ఆదాయం వస్తుందని అంచనా. మొదటి అయిదేళ్లలో ప్రభుత్వం ఇచ్చే రాయితీలను బట్టి ఈ ఆదాయంలో కొంత హెచ్చుతగ్గులు ఉండొచ్చు. అయితే ప్రభుత్వానికి పరోక్షంగా మరింత ఆదాయం సమకూరుతుంది.

ఐటీ కంపెనీలొస్తే.. మూడు పువ్వులు ఆరు కాయలే

తయారీ రంగంతో పోలిస్తే సేవారంగంలో తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ మందికి ఉపాధి దొరుకుతుంది. ముఖ్యంగా ఐటీ వంటి రంగాల్లో వేతనాలూ ఎక్కువగా ఉంటాయి. అలాంటి రంగాలు అభివృద్ధి చెందే కొద్దీ ఆర్థిక వ్యవస్థ వేగంగా పరుగులు పెడుతుంది. రూ.100 కోట్ల పెట్టుబడితో ఒక ఐటీ పరిశ్రమను ఏర్పాటు చేస్తే ప్రత్యక్షంగా వెయ్యి మందికి ఉపాధి దొరుకుతుందని అంచనా. వారిపై ఆధారపడిన మరో 3-4 వేల మందికి పరోక్ష ఉపాధి లభిస్తుంది. సగటున ఒక్కో ఐటీ ఉద్యోగికి సంవత్సరానికి కనీసం రూ.4 లక్షల జీతం ఇస్తారనుకున్నా.. రూ.40 కోట్లు అవుతుంది. ఓ మాదిరి ఐటీ కంపెనీలు ప్రస్తుతం ఓ స్థాయి ఉద్యోగికి ఏడాదికి రూ.15 లక్షలు చెల్లిస్తున్నాయి. ఆ లెక్కన వేసుకుంటే వారికిచ్చే జీతం రూ.150 కోట్లవుతుంది.

* ఐటీ రంగంలో ఒక ఉద్యోగిపై కంపెనీ సగటున రూ.40 లక్షల వరకు టర్నోవర్‌ చేస్తుందని అంచనా. దానిపై కట్టే జీఎస్టీ, లాభాలపై చెల్లించే ఆదాయపన్ను రూపంలో ప్రభుత్వానికి డబ్బే డబ్బు.

ప్రభుత్వం ఏం చేస్తోంది?

ఉన్న పరిశ్రమల్నే వెళ్లగొడుతోంది. పారిశ్రామికవేత్తల్ని భయపెడుతోంది. రాజకీయ ప్రత్యర్థుల కర్మాగారాలపై కక్ష సాధిస్తోంది. ఫలితంగా.. పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. తాజాగా అమరరాజా సంస్థ చిత్తూరు జిల్లాలో పెట్టాల్సిన రూ.9,500 కోట్లను తెలంగాణలో పెడుతోంది. జాకీ దుస్తుల తయారీ పరిశ్రమా తెలంగాణకే  తరలిపోయింది. రిలయన్స్‌ గుడ్‌బై చెప్పేసింది. ఇలా ఒకటా రెండా.. పెద్ద పెద్ద కంపెనీలన్నీ రాష్ట్రం నుంచి తరలిపోతున్నాయి. అసలే అంతంతమాత్రంగా ఉన్న ఐటీ రంగాన్నీ వైకాపా ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. విశాఖలోని స్టార్టప్‌ విలేజ్‌ ఖాళీ అయిపోయింది. డిజిగ్నేటెడ్‌ టెక్నాలజీ పార్క్‌ విధానంలో ఇచ్చే 50 శాతం రాయితీని ప్రభుత్వం రద్దు చేసింది. కొత్తగా ఏర్పాటయ్యే ఐటీ కంపెనీల్ని ప్రోత్సహించేందుకు గత ప్రభుత్వం ఉద్యోగులకు వేతనాల్లో ఇచ్చిన రాయితీల్ని తొలగించింది. ఇక్కడి వాతావరణం చూసి.. రాష్ట్రానికి పెట్టుబడులతో రావాలంటేనే పారిశ్రామికవేత్తలు భయపడే పరిస్థితి నెలకొంది.

* తెలంగాణలోని ఐటీ, ఐటీఈఎస్‌... కంపెనీల్లో ప్రస్తుతం సుమారు 8 లక్షల మంది పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పట్టుమని పాతిక వేల మంది కూడా లేరు. వారిలోనూ అత్యధిక మందికి నెల జీతం రూ.15 వేల నుంచి రూ.20 వేల లోపే.

మిగిలేది వృద్ధులే..

రాష్ట్రంలో ఉపాధినిచ్చే పరిశ్రమలు, ఐటీ కంపెనీలు లేకపోవడంతో మెజారిటీ యువతంతా విదేశాలకు, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ వంటి నగరాలకు వలసపోతున్నారు. అక్కడే వివాహాలు చేసుకుని, స్థిరపడి పోతున్నారు.  వారి సంపాదనంతా ఆయా నగరాల్లోనే ఖర్చు పెడుతున్నారు. అక్కడే ఇళ్లు కొనుక్కుంటున్నారు. రాబోయే రోజుల్లో యువతరం వలసలు ఇంకా పెరిగితే, రాష్ట్రంలో మిగిలేది వృద్ధులేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

* కేంద్ర గణాంకశాఖ 2019 గణాంకాల ప్రకారం రాష్ట్ర జనాభాలో నాలుగేళ్లలోపు పిల్లలు 5.5 శాతం. జాతీయ సగటు 7.8 శాతం. పద్నాలుగేళ్లలోపు పిల్లలు జాతీయ సగటు 25.4% కాగా రాష్ట్రంలో 19.4 శాతమే ఉంది.

* 2020లో నాలుగేళ్లలోపు పిల్లల జాతీయ సగటు 7.5 శాతం ఉంటే రాష్ట్ర జనాభాలో 5.3 శాతమే. 0-14 సంవత్సరాల పిల్లల సంఖ్య జాతీయ సగటు 24.8 శాతం ఉంటే రాష్ట్రంలో 19 శాతమే ఉండటం గమనార్హం.

* రాష్ట్రంలో ప్రతి వెయ్యి జనాభాలో నాలుగేళ్లు, ఆలోపు పిల్లలు 53 మంది మాత్రమే ఉంటే, బిహార్‌ 110, ఉత్తరాఖండ్‌లో 101గా ఉండటం విశేషం. మనకంటే వెనుకబడ్డ రాష్ట్రాలతో పోల్చినా మన రాష్ట్రంలో జనాభాలో సమతౌల్యం లోపిస్తోందని అర్థ్ధమవుతోంది. ఇక్కడ తగినన్ని ఉపాధి అవకాశాలు లేకపోవడమే దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు.

వెళ్లేవారే తప్ప వచ్చేవారేరీ?

హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లో ఐటీ రంగంలో పనిచేసే ఉద్యోగుల్లో 30-40 శాతం బయటి ప్రాంతాల నుంచి వచ్చిన అత్యంత నైపుణ్యంగలవారు (హైలీ స్కిల్డ్‌ మైగ్రెంట్‌) ఉంటారు. అత్యంత నైపుణ్యమున్నవారు బయటి ప్రాంతాల నుంచి వచ్చి పనిచేయడాన్ని అక్కడ ఆ రంగ పురోభివృద్ధికి ఒక సూచీగా పరిగణిస్తారు. ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి దానికి పూర్తి భిన్నం. నిపుణులు బయటి నుంచి రావడం దేవుడెరుగు.. ఇక్కడ చదువుకున్న పిల్లలకే ఉపాధిలేక తరలిపోతున్నారు. ఏపీలో ఐటీ కంపెనీల్లో రూ.15 వేలు వచ్చేవారికి కూడా హైదరాబాద్‌ వంటి చోట్ల కనీసం రూ.30 వేల వేతనం దొరుకుతోంది. దీంతో అందరూ అటే పరుగులు తీస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న కొద్దిపాటి ఐటీ కంపెనీల్లోనూ అత్యంత నిపుణులైన సిబ్బంది లేక అంత విలువైన ప్రాజెక్టులు రావడం లేదు.


రూ.10 వేల కోట్లతో అద్భుతాలు చేయొచ్చు..!

రాష్ట్ర ప్రభుత్వం విధ్వంసక ధోరణిని వీడి.. కనీసం గత ప్రభుత్వ హయాంలో ఒప్పందాలు జరిగిన పరిశ్రమలైనా ప్రారంభమయ్యేలా చేయగలిగితే, వాటి నుంచి వివిధ రూపాల్లో ఇప్పటికే ఏటా రూ.10 వేల కోట్ల వరకు అదనపు ఆదాయం లభించేది. రాజధాని నిర్మాణ పనులు కొనసాగించి ఉంటే అక్కడ జరిగే నిర్మాణాల వల్లే ప్రభుత్వానికి ఏటా కనీసం రూ.5-6 వేల కోట్ల ఆదాయం వచ్చేది. ఆర్థిక పరిస్థితి అధ్వానంగా మారి, అప్పుల్లో మునిగిపోయిన రాష్ట్రానికి రూ.10 వేల కోట్ల ఆదాయం అదనంగా వస్తే చాలా అద్భుతాలు చేయొచ్చు. మూలధన వ్యయాన్ని గణనీయంగా పెంచొచ్చు. నిధుల కొరత పేరుతో ప్రభుత్వం నిలిపివేసిన అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్ని కొనసాగించొచ్చు.

* ప్రైవేటు కళాశాలల్లో పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ చదివే విద్యార్థులకు ప్రభుత్వం 2020-21 నుంచి బోధన రుసుముల చెల్లింపు నిలిపివేసింది. పాత బకాయిలు రూ.400 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. వారందరికీ నిక్షేపంగా బోధన రుసుములు చెల్లించొచ్చు.

* 2020-21లో కరోనాతో కళాశాలలు సరిగా నిర్వహించలేదంటూ అండర్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్థులకు నాలుగో త్రైమాసిక ఫీజు దాదాపు రూ.650 కోట్లను ప్రభుత్వం చెల్లించలేదు. వీటిని విద్యార్థుల నుంచి కళాశాలలు వసూలు చేసుకున్నాయి. విద్యార్థులకు ఆ ఫీజు ప్రభుత్వమే చెల్లించొచ్చు. నాడు-నేడు వంటి కార్యక్రమాల్ని జాప్యం లేకుండా పూర్తి చేయొచ్చు.

* రాష్ట్రంలో అధ్వానంగా ఉన్న రహదారులకు మరమ్మతులు చేయొచ్చు.

* వెనుకబడిన ప్రాంతాల్లోని వెలుగొండ, ఉత్తరాంధ్రలోని వంశధార రెండో భాగం రెండో దశ, వంశధార-నాగావళి అనుసంధానం, చింతలపూడి ఎత్తిపోతలు వంటి పథకాల్ని పూర్తి చేయొచ్చు.

* ఏటా రూ.3 వేల కోట్లు ఖర్చు పెడితే.. రైతులకు రాయితీపై ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలను అందించవచ్చు. బిందు, తుంపర సేద్య పరికరాలను రాయితీపై పెద్దఎత్తున అందించడం ద్వారా నీటి సంరక్షణతోపాటు రైతులకు పెట్టుబడి తగ్గించి ఆదాయం పెంపొందించవచ్చు. ఏడాదికి రూ.50 కోట్లతో సూక్ష్మపోషకాలను ఉచితంగా అందిస్తే రైతులు అధిక దిగుబడులు సాధించే వీలుంటుంది.

* రూ.5 వేల కోట్లు ఖర్చుపెడితే.. రాష్ట్రంలోని నిరుపేదల కుటుంబాలకు నెల నెలా నిత్యావసరాలను రాయితీపై అందించవచ్చు.


భారీ కర్మాగారం వస్తే.. ఒక నగరాన్ని నిర్మించినట్టే

ఒక భారీ కర్మాగారం ఏర్పాటైతే అక్కడో చిన్న పట్టణమైనా ఏర్పాటవుతుంది. హైదరాబాద్‌లో హైటెక్‌ సిటీ వచ్చి దిగ్గజ ఐటీ కంపెనీలన్నీ ఏర్పాటయ్యాక సైబరాబాద్‌ ఆవిర్భవించింది. విశాఖలో ఉక్కు కర్మాగారం ఏర్పాటయ్యాక ఉక్కునగరమే పురుడుపోసుకుంది.  

* ఒక భారీ పరిశ్రమ ఏర్పాటై 3-4 వేల మందికి ఉపాధి లభిస్తే అన్ని వేల కుటుంబాలు అక్కడే ఉంటాయి. విద్యా సంస్థలు, ఆస్పత్రులు, నిత్యావసరాల దుకాణాలు, సినిమా హాళ్లు.. ఇలా అనేకం వస్తాయి. అనేక వృత్తులవారికి ఉపాధి లభిస్తుంది.

* ఒక ఉద్యోగికి నెలకు రూ.లక్ష జీతం వస్తుందనుకుంటే.. దానిలో రూ.10-15 వేల పన్నులు, పీఎఫ్‌ రూపంలో పోయినా రూ.85 వేల వరకు చేతికి వస్తుంది. దానిలో రూ.25-30 వేలు మదుపు చేసినా... రూ.55-60 వేలు ఖర్చు చేస్తారు. ఎన్నో రంగాలవారికి ఉపాధి దొరుకుతుంది. వారు ఖర్చు పెట్టే ప్రతి రూపాయిపై ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం వెళుతుంది.

* రూ.లక్ష వేతనం వచ్చేవారు..గూడు అమర్చుకోవాలని చూస్తారు. వారి కోసం ఇళ్లు, అపార్ట్‌మెంట్‌ల నిర్మాణం జరుగుతుంది. నిర్మాణరంగంపై ఆధారపడే 50-60 రకాల వ్యాపారాల వారికీ ఉపాధి లభిస్తుంది.


Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు