సంక్షిప్త వార్తలు (18)

విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) ప్రకారం గతంలో సరఫరా చేసిన విద్యుత్‌కూ స్థిర ఛార్జీలను చెల్లించాలని హిందుజా సంస్థ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) బుధవారం విచారించనుంది.

Updated : 01 Feb 2023 06:08 IST

స్థిర ఛార్జీల వ్యత్యాసాన్ని చెల్లించాలి
ఏపీఈఆర్‌సీలో హిందుజా సంస్థ పిటిషన్‌పై విచారణ

ఈనాడు, అమరావతి: విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) ప్రకారం గతంలో సరఫరా చేసిన విద్యుత్‌కూ స్థిర ఛార్జీలను చెల్లించాలని హిందుజా సంస్థ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) బుధవారం విచారించనుంది. 2016 జులై నుంచి డిస్కంలు తీసుకున్న విద్యుత్‌కు పీపీఏలో నిర్దేశించిన ధరల ప్రకారం సుమారు రూ.500 కోట్లు స్థిర ఛార్జీల బకాయిలు చెల్లించాలని హిందుజా సంస్థ పిటిషన్‌లో కోరింది. సుప్రీంకోర్టు తీర్పు మేరకు హిందుజా సంస్థతో గతేడాది ఆగస్టులో డిస్కంలు పీపీఏ కుదుర్చుకున్నాయి. అందులో స్థిరఛార్జీల కింద యూనిట్‌కు రూ.1.40 వంతున చెల్లించాలని లెక్కించాయి. మధ్యంతర టారిఫ్‌లో పేర్కొన్న స్థిరఛార్జీలకంటే పీపీఏ ప్రకారం 34 పైసలు అధికంగా డిస్కంలు చెల్లిస్తున్నాయి. ఇదే మొత్తాన్ని ఆరేళ్లుగా సరఫరా చేసిన విద్యుత్‌కు చెల్లించాలని హిందుజా కోరుతోంది.


ఏటా 1.08లక్షల మంది కౌలుదారుల కుటుంబాలకు రైతు భరోసా

ఈనాడు-అమరావతి: రాష్ట్రంలో ఏటా 5లక్షల మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేస్తున్నామని, వారిలో 1.08 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారికి రైతు భరోసా కింద రూ.13,500 అందిస్తున్నామని వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్‌ సీహెచ్‌.హరికిరణ్‌ పేర్కొన్నారు. ‘రైతు భరోసాపై ఎన్ని మడతలో’ శీర్షికన మంగళవారం ‘ఈనాడు’ ప్రధాన పత్రికలో వచ్చిన కథనంపై వ్యవసాయశాఖ వివరణ ఇచ్చింది. రైతు భరోసా-పీఎం కిసాన్‌ పథకం కింద నాలుగేళ్లలో 52.38 లక్షల కుటుంబాలకు రూ.25,971.33 లబ్ధి కలిగిందని హరికిరణ్‌ తెలిపారు. అందులో పీఎం కిసాన్‌ కింద రూ.10,394.99 కోట్లు ఉన్నాయని పేర్కొన్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు 1.08 లక్షల మంది కౌలు రైతు కుటుంబాలకు రూ.485 కోట్లు, అటవీ భూముల హక్కుదారులకు రూ.407.45 కోట్ల లబ్ధి అందించామని వివరించారు.


స్థానిక సంస్థల్లో బీసీల జనాభా ఆధారంగా రిజర్వేషన్లు  
బాధ్యత బీసీ కమిషన్‌కు అప్పగింత

ఈనాడు డిజిటల్‌, అమరావతి: స్థానిక సంస్థల్లో బీసీల జనాభా శాతం ఆధారంగా రిజర్వేషన్లను నిర్ధారించేందుకు ప్రభుత్వం బీసీ కమిషన్‌కు అధ్యయన బాధ్యతను అప్పగించింది. మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్ల శాతం 50 శాతానికి మించరాదని స్పష్టం చేసింది. వెనుకబడిన తరగతుల వెనుకబాటుతనానికి అనుగుణంగా క్షేత్ర స్థాయిలో ప్రస్తుతం అమలవుతున్న రిజర్వేషన్‌ పరిస్థితి ఎలా ఉందనే విషయాన్ని పరిశీలించి కమిషన్‌ చర్యలు తీసుకోవాలని పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు మంగళవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.


ఎవరి గన్‌మన్‌నూ తొలగించలేదు: ఏఆర్‌ ఏఎస్పీ

నెల్లూరు, న్యూస్‌టుడే: జిల్లాలో ఏ ఒక్క ప్రజాప్రతినిధికీ కేటాయించిన గన్‌మన్లను తొలగించలేదని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఏఆర్‌ ఏఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. ప్రజాప్రతినిధులకు 1+1 చొప్పున ఇద్దరు గన్‌మన్లు, పీఎస్‌వోలను కొనసాగిస్తున్నామన్నారు.


విచారణకు రాని అమరావతి కేసు

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి కేసు మంగళవారం సుప్రీంకోర్టు ధర్మాసనం ఎదుట విచారణకు రాలేదు. ముందస్తు షెడ్యూల్‌ ప్రకారం జస్టిస్‌ జోసెఫ్‌ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇతర కేసుల్లోకి వెళ్లడంతో అమరావతి విచారణకు అవకాశం లేకపోయింది. తదుపరి విచారణ తేదీని ఇంకా ప్రకటించలేదు.


కృష్ణా బోర్డు కొత్త ఛైర్మన్‌ శివ్‌ నందన్‌కుమార్‌

ఈనాడు, హైదరాబాద్‌: కృష్ణా బోర్డుకు కొత్త ఛైర్మన్‌గా శివ్‌ నందన్‌కుమార్‌ను నియమిస్తూ కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ ముఖ్య కార్యనిర్వాహక అధికారిగా ఉన్న ఆయనను పదోన్నతి ద్వారా బోర్డు ఛైర్మన్‌గా నియమించారు. దిల్లీలోని కేంద్ర జలసంఘంలో సభ్యులుగా నవీన్‌కుమార్‌, ఎస్‌.కె.సిబాల్‌లను కొత్తగా నియమించారు. ఈ మేరకు కేంద్ర మంత్రిత్వశాఖ సంచాలకుడు చందన్‌ ముఖర్జీ ఆదేశాలు జారీ చేశారు.


వసూళ్ల వ్యవహారంలో నలుగురికి సంజాయిషీ నోటీసులు

ఈనాడు, అమరావతి: వేతనం పెంపు కోసం ప్రయత్నిస్తున్నామని పేర్కొంటూ సహచర కాంపౌండర్ల నుంచి డబ్బులు వసూలు చేసిన నలుగురికి ఆయుష్‌ శాఖ సంజాయిషీ నోటీసులు జారీ చేసింది. వేతనం పెంపు ఉత్తర్వులు జారీ కావాలంటే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కార్యాలయం, జాతీయ ఆరోగ్య మిషన్‌ డైరెక్టర్‌ కార్యాలయం వారికి ఫార్మాలిటీస్‌ కింద డబ్బులు ఇవ్వాలని పేర్కొంటూ ఒప్పంద విధానంలో పనిచేస్తోన్న పలువురు కాంపౌండర్లు వాట్సప్‌ గ్రూపు ద్వారా వసూళ్లు ప్రారంభించారు. ఈ క్రమంలో పలువురు రెండు వేల రూపాయల నుంచి ఐదు వేలు, రూ.10వేల వరకు చెల్లించారు. వీటిపై అందిన ఫిర్యాదులపై మంత్రి రజిని జారీ చేసిన ఆదేశాలు అనుసరించి, ఎన్‌హెచ్‌ఎం సీఈఓ విచారణ జరిపి కాంపౌండర్ల మధ్య జరిగిన వాట్సప్‌ ప్రచారం, నగదు చెల్లింపు వ్యవహారాలు పరిశీలించారు. కొందరు యూనియన్‌ అవసరాలకు నగదు చెల్లింపులు చేశామని ఈ సందర్భంగా వివరణ ఇవ్వడం గమనార్హం. చివరిగా నంద్యాల, బాపట్ల, అనకాపల్లి, నెల్లూరు జిల్లాల్లో పనిచేస్తోన్న ఒక్కొక్క కాంపౌండర్‌ను బాధ్యులుగా గుర్తించారు. ఎందుకు విధుల నుంచి తప్పించకూడదో మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని పేర్కొంటూ వీరికి ఆయుష్‌ కమిషనర్‌ నివాస్‌ సంజాయిషీ నోటీసు జారీ చేశారు. ఈ తరహా చర్యలపై పాల్పడే వారిపై పోలీసు కేసులు కూడా నమోదు చేయిస్తామని తెలిపారు.


ఎక్కువ సహాయం అందిస్తున్నాం: కమిషనర్‌

ఈనాడు, అమరావతి: ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్సార్‌ బీమా పథకంలో భవన నిర్మాణ కార్మికులకు ఎంతో మేలు జరుగుతోందని, ప్రమాదవశాత్తూ మరణించిన కార్మికులకు రూ.5లక్షలు, సహజ మరణానికి రూ.లక్ష సహాయం అందచేస్తోందని కార్మిక శాఖ కమిషనర్‌ ఎం.ఎం.నాయక్‌ తెలిపారు. ‘ఈనాడు’ ప్రధాన సంచికలో సోమవారం ప్రచురితమైన ‘కార్మికుల నిధుల దారి మళ్లింపు’ కథనంపై స్పందించి వివరణ ఇచ్చారు. 2021-22, 2022-23కు సంబంధించి సహజ మరణాలకు రూ.419కోట్లు, ప్రమాద మరణాలకు రూ.91కోట్లు పరిహారంగా చెల్లించామని వెల్లడించారు. ప్రతి ఏడాది వైఎస్సార్‌ బీమాకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రభుత్వం బడ్జెట్‌ కేటాయిస్తోందని, సంక్షేమ బోర్డు ద్వారా కార్మికులకు అందించే ఉపకారవేతనాల కంటే ప్రభుత్వం అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన పథకాల ద్వారా ఎక్కువ మొత్తం ఇస్తోందని తెలిపారు. బోర్డు కల్పించే పథకాల కంటే ఎక్కువగా రూ.1.20 కోట్లను అసంఘటిత రంగాల్లో పని చేస్తున్న కార్మికులకు సంతృప్తి స్థాయిలో ఆర్థిక సహాయం అందిస్తున్నామని వెల్లడించారు.


సీపీఎస్‌ రద్దుకు సంకల్పదీక్ష: యూటీఎఫ్‌

ఈనాడు, అమరావతి: కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ పథకాన్ని(సీపీఎస్‌) రద్దు చేసి, పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ 3న కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని ధర్మస్థలి ప్రాంగణంలో సంకల్ప దీక్ష నిర్వహిస్తున్నట్లు ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య(యూటీఎఫ్‌) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వర్లు, ప్రసాద్‌ వెల్లడించారు. విజయవాడలో మంగళవారం సంకల్పదీక్షకు సంబంధించిన కరపత్రాలు, పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం వారు విలేకర్లతో మాట్లాడుతూ.. ‘‘ఈ సభకు పలువురు మంత్రులు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తున్నాం. సీపీఎస్‌ రద్దు చేసి, పాత పెన్షన్‌ను పునరుద్ధరిస్తామని ప్రతిపక్ష నేతగా జగన్‌ ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని అమలు చేయకుండా గ్యారెంటెడ్‌ పెన్షన్‌ పథకం(జీపీఎస్‌)ను అమలు చేస్తున్నామంటున్నారు. జీపీఎస్‌ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. పశ్చిమబెంగాల్‌లో మొదటి నుంచి పాత పెన్షన్‌ విధానమే కొనసాగుతుండగా.. రాజస్థాన్‌, ఛత్తీస్‌గడ్‌, జార్ఖండ్‌, పంజాబ్‌ రాష్ట్రాలు పాత పెన్షన్‌ను పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. పొరుగున ఉన్న తమిళనాడు ఏప్రిల్‌ ఒకటి నుంచి సీపీఎస్‌ను రద్దు చేస్తోంది...’’ అని వెల్లడించారు.


విద్యుత్‌ ఉద్యోగులకు జనవరి డీఏ విడుదల

ఈనాడు-అమరావతి: విద్యుత్‌ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ఎట్టకేలకు గత ఏడాది జనవరి నుంచి బకాయి ఉన్న కరవు భత్యాన్ని (డీఏ) చెల్లించేలా ఇంధన శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2018లో సవరించిన వేతనాల కారణంగా డీఏ 22.02 శాతాన్ని 24.99 శాతానికి పెరిగింది. డీఏ పెంపు నిబంధన ఉద్యోగులతో పాటు పింఛన్‌దారులకు కూడా వర్తిస్తుందని తెలిపింది. ఈ మేరకు ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కంలు వేర్వేరు ఉత్తర్వులను జారీ చేశాయి. డీఏ బకాయిలను ఎప్పటిలోగా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేస్తామనే విషయాన్ని మాత్రం ఉత్తర్వుల్లో పేర్కొనలేదు.


క్లౌడ్‌ కంప్యూటింగ్‌ కోర్సులు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో క్లౌడ్‌ కంప్యూటింగ్‌, ఎమర్జింగ్‌ టెక్నాలజీ రీస్కిల్లింగ్‌ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి వెల్లడించింది. నాస్కామ్‌ ఫ్యూచర్‌ స్కిల్స్‌ ప్రైమ్‌, గుగూల్‌ క్లౌడ్‌తో సహకారంతో వీటిని అమలు చేయనున్నట్లు తెలిపింది. ప్రభుత్వ కార్యకలాపాలు, పరిశ్రమలు, సంస్థలు క్లౌండ్‌ కంప్యూటింగ్‌పై దృష్టి పెట్టాయని, ఇందులో విద్యార్థులకు మంచి అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. రాష్ట్రంలో 16 విశ్వవిద్యాలయాలు, 2,500 కళాశాలల కోసం ఐదు కోర్సుల సిరీస్‌ ప్రోగ్రామ్‌ క్లౌడ్‌ కంప్యూటింగ్‌, నాస్కామ్‌ సర్టిఫికేషన్‌ ఎమర్జింగ్‌ టెక్నాలజీ కోర్సులను అమలు చేయనున్నట్లు వెల్లడించింది.


పదోన్నతి నియమావళి సవరణ

ఈనాడు-అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అగ్నిమాపక శాఖలో డ్రైవర్‌ ఆపరేటర్‌, లీడింగ్‌ ఫైర్‌మ్యాన్‌, స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ డివిజినల్‌ ఫైర్‌ ఆఫీసర్‌ పోస్టుల పదోన్నతి పొందేందుకు నిర్దేశించిన నియమావళిని రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. పదోన్నతికి అర్హత పొందడంతో పాటు నిర్దేశిత కాలవ్యవధితో ప్రీ ప్రమోషనల్‌ ట్రైనింగ్‌, పోస్టు ప్రమోషనల్‌ ఓరియెంటేషన్‌ కోర్సులు పూర్తి చేసి ఉండాలని పేర్కొంది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్‌కుమార్‌ గుప్తా మంగళవారం ఉత్తర్వులిచ్చారు.


ఎంఈఓ, డిప్యూటీ డీఈఓ పదోన్నతులు సాధ్యం కాదు: కమిషనరేట్‌

ఈనాడు, అమరావతి: గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పని చేస్తున్న వారికి ఎంఈఓ, డిప్యూటీ డీఈఓ పోస్టులు ఇచ్చేందుకు సాధ్యం కాదంటూ పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌ ఆదేశాలు జారీ చేసింది. ఎంఈఓ, డిప్యూటీ డీఈఓ పదోన్నతులు కల్పించాలని వివిధ ప్రధానోపాధ్యాయులు ఇచ్చిన వినతులపై సమాధానం ఇచ్చింది. పాఠశాల విద్యాశాఖ పరిధిలో గిరిజన సంక్షేమ పాఠశాలలు లేవని, ఇవి ప్రత్యేకంగా ఉన్నాయని పేర్కొంది.


పొగాకుబోర్డు సభ్యులుగా ఎంపీలు అర్వింద్‌, బాలశౌరి

ఈనాడు, దిలీ:్ల పొగాకు బోర్డు సభ్యులుగా నిజామాబాద్‌ భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్‌, మచిలీపట్నం వైకాపా ఎంపీ వల్లభనేని బాలశౌరిలు నియమితులయ్యారు. ఈమేరకు కేంద్ర వాణిజ్యశాఖ మంగళవారం రాత్రి నోటిఫికేషన్‌ జారీచేసింది. వీరిద్దరూ మూడేళ్లు.. లేదంటే లోక్‌సభ పదవీకాలం ముగిసేంతవరకు ఈ పదవిలో కొనసాగుతారని ఇందులో పేర్కొంది.


నక్సల్స్‌ ప్రభావంపై మూడు రాష్ట్రాల పోలీసుల సమీక్ష

మంచిర్యాల, న్యూస్‌టుడే: గోదావరి, ప్రాణహిత నది పరీవాహక ప్రాంతాల పరిధిలోని తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు మంగళవారం జైపుర్‌ విద్యుదుత్పత్తి కేంద్రంలోని విశ్రాంతి భవనంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మావోయిస్టుల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు, దాడులను తిప్పికొట్టడం, అప్రమత్తతపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. సమావేశంలో మూడు రాష్ట్రాల గ్రేహౌండ్స్‌, ఎస్‌బీ, ఇంటెలిజెన్స్‌ ఉన్నతాధికారులతో పాటు రామగుండం సీపీ రెమా రాజేశ్వరి, గడ్చిరోలి డీఐజీ సందీప్‌పాటిల్‌, ఎస్పీలు, అదనపు ఎస్పీలు, ఓఎస్‌డీలు పాల్గొన్నారు.


సింహపురి, దేవగిరి ఎక్స్‌ప్రెస్‌లకు ఎల్‌హెచ్‌బీ బోగీలు

ఈనాడు, హైదరాబాద్‌: సింహపురి, దేవగిరి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు కొత్త రూపు, ఆధునికతను సంతరించుకోనున్నాయి. పాతతరం ఐసీఎఫ్‌ కోచ్‌ల స్థానంలో ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో ఈ రైళ్లు పరుగులు తీయనున్నాయి. ఫిబ్రవరి 13, 14 తేదీల నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానున్నట్లు దక్షిణ మధ్య రైల్వే మంగళవారం ప్రకటించింది. సికింద్రాబాద్‌-గూడూరు, గూడూరు-సికింద్రాబాద్‌ (నెం.12710/12709) మధ్య సింహపురి ఎక్స్‌ప్రెస్‌.. సికింద్రాబాద్‌-సీఎస్‌టీ ముంబయి, సీఎస్‌టీ ముంబయి-సికింద్రాబాద్‌ (నెం.17058/17057)ల మధ్య దేవగిరి ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణిస్తున్నాయి. ఒక్కో రైల్లో- రెండు జనరల్‌, 9 స్లీపర్‌, 5 థర్డ్‌ ఏసీ, 2 సెకండ్‌ ఏసీ, 1 ఫస్ట్‌ ఏసీ బోగీలు ఉంటాయి. ఎల్‌హెచ్‌బీ బోగీల్లో బెర్తుల సంఖ్య అధికం.


రూ.11.50 కోట్లతో పాదరక్షల తయారీ కేంద్రాలు
మంత్రి మేరుగు నాగార్జున

ఈనాడు డిజిటల్‌, అమరావతి: లిడ్‌క్యాప్‌ ద్వారా రాష్ట్రంలో రూ.11.50 కోట్లతో పాదరక్షల తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. సచివాలయంలో ఆయన మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ‘ఎస్సీ కార్పొరేషన్‌ ఆర్థిక సాయంతో లిడ్‌క్యాప్‌ ద్వారా చేపడుతున్న పనుల్లో భాగంగా ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని యడవల్లి, ఎన్టీఆర్‌ జిల్లా జి.కొండూరు మండలంలోని వెల్లటూరు గ్రామాల వద్ద రూ.5.75 కోట్ల చొప్పున వెచ్చించి పాదరక్షల తయారీ కేంద్రాలు నిర్మిస్తాం. రూ.కోటితో 300 మంది యువకులకు తోలు వస్తువుల తయారీలో శిక్షణ అందిస్తాం. పీఎం అజయ్‌ పథకంలో భాగంగా ప్రకృతి వ్యవసాయం చేసే ఎస్సీ రైతుల్లో 29,272 మందికీ సాయం అందిస్తాం’ అని పేర్కొన్నారు.


ఏప్రిల్‌లో సార్వత్రిక విద్యా పీఠం పరీక్షలు

ఈనాడు, అమరావతి: సార్వత్రిక విద్యా పీఠం పది, ఇంటర్మీడియట్‌ పరీక్షలను ఏప్రిల్‌ మూడు నుంచి 17 వరకు నిర్వహించనున్నట్లు డైరెక్టర్‌ శ్రీనివాసులరెడ్డి వెల్లడించారు. మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు పరీక్షలు ఉంటాయని, ప్రాక్టికల్‌ పరీక్షలు ఏప్రిల్‌ 18 నుంచి 23వరకు ఆదివారం సైతం నిర్వహిస్తామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని