దిల్లీ వేదికగా అమరావతిపై విషం

బాబాయి హత్యకేసులో సీబీఐ దూకుడు పెంచడంతో దాన్నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే సీఎం జగన్‌ విశాఖపట్నమే రాజధాని అంటున్నారని అమరావతి రైతులు విమర్శించారు.

Updated : 01 Feb 2023 05:49 IST

సీఎం జగన్‌ వ్యాఖ్యలపై మండిపడిన రాజధాని రైతులు

తుళ్లూరు గ్రామీణం, న్యూస్‌టుడే: బాబాయి హత్యకేసులో సీబీఐ దూకుడు పెంచడంతో దాన్నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే సీఎం జగన్‌ విశాఖపట్నమే రాజధాని అంటున్నారని అమరావతి రైతులు విమర్శించారు. దిల్లీలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను రాజధాని రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీనిపై మంగళవారం వెలగపూడిలోని అమరావతి రైతు ఐకాస కార్యాలయంలో సమావేశం నిర్వహించి మాట్లాడారు.


న్యాయస్థానాల్లో ఉన్న అంశంపై ఎలా మాట్లాడతారు?

రాజధాని అమరావతి అంశం సుప్రీంకోర్టులో ఉంది. న్యాయస్థానాల పరిధిలో ఉన్న రాజధానిపై వ్యాఖ్యలు ఎలా చేస్తారు? రాజధాని విశాఖకు మారుస్తామని చెప్పడానికి మీకేం హక్కు ఉంది? సీఎం జగన్‌ రాజ్యాంగానికి విలువ లేకుండా చేస్తున్నారు.

 రాధిక, మహిళా రైతు, మందడం


ఇది సీఎం చెప్పే మరో పిట్ట కథ

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను 95% నెరవేర్చామని చెబుతున్న సీఎం జగన్‌ విశాఖే రాజధాని అంటూ మరో పిట్టకథ చెబుతున్నారు. మొన్నటివరకూ మూడు రాజధానులన్న సీఎం.. నేడు విశాఖ ఒక్కటే రాజధాని అనడం విడ్డూరం.

 నెలకుదిటి వెంకటపతిరావు, రైతు, దొండపాడు


సీబీఐ కేసుల నుంచి దృష్టి మరల్చడానికే

వివేకా హత్యకేసు విచారణపై సీబీఐ దూకుడు పెంచటంతో ప్రజల దృష్టి మరల్చడానికే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో ఇలా అనడం కోర్టుధిక్కరణ కిందకు వస్తుంది.

 కొమ్మినేని వరప్రసాదరావు, రైతు, దొండపాడు


భూములు అమ్ముకోవడానికే విశాఖ అంటున్నారు

విశాఖలో ఉన్న స్వామీజీతో కలసి అక్కడి భూములు అమ్ముకోవడానికి కొత్త నాటకానికి తెరతీశారు. మూడు రాజధానులని చెప్పిన ముఖ్యమంత్రి.. తాజాగా విశాఖ ఒక్కటే రాజధాని అంటున్నారు.

 అలూరి శ్రీదేవి, మహిళా రైతు, మందడం


బాబాయి హత్యకేసుతో అబ్బాయి హడావుడి

వివేకా హత్యకేసులో ఎంపీ అవినాష్‌రెడ్డిని సీబీఐ విచారణకు పిలవగానే అబ్బాయి ఆగమేఘాలపై దిల్లీ వెళ్లారు. అక్కడ పరిస్థితులు ప్రతికూలించడంతో విశాఖే రాజధాని అంటున్నారు. దావోస్‌ వెళ్లి మాట్లాడడం చేతగాని సీఎం.. ఈరోజు పెట్టుబడులు రాబడతామని ఎలా చెబుతున్నారు?

 వరలక్ష్మి, మహిళా రైతు, మందడం


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని