సంక్షిప్త వార్తలు (17)

‘యురోపియన్‌ కామన్‌ కెస్ట్రల్‌’గా పిలిచే చిట్టిడేగ వైయస్‌ఆర్‌ జిల్లా కడప శివారు సిద్దవటం సమీపంలో మంగళవారం కనిపించింది.

Updated : 08 Feb 2023 06:16 IST

కడపలో ఐరోపా అతిథి!

‘యురోపియన్‌ కామన్‌ కెస్ట్రల్‌’గా పిలిచే చిట్టిడేగ వైయస్‌ఆర్‌ జిల్లా కడప శివారు సిద్దవటం సమీపంలో మంగళవారం కనిపించింది. ఈకలపై నల్ల మచ్చలతో చూడముచ్చటగా ఉంది. ఐరోపాలోని శీతల ప్రాంతాల్లో ఉండే చిట్టిడేగలు మన వద్ద చలికాలం మొదలవగానే వస్తాయని యోగి వేమన విశ్వవిద్యాలయం బొటానికల్‌ గార్డెన్‌ పర్యవేక్షకులు, ఆచార్యులు మధుసూదన్‌రెడ్డి తెలిపారు. ‘మార్చి నుంచి తిరిగి స్వస్థలానికి వెళ్తుంటాయి. కదులుతున్న ఎలుకలు, పక్షులపై మెరుపు వేగంతో దాడి చేయడంలో ఇవి దిట్ట. 1990లో వీటి సంఖ్య వెయ్యి మాత్రమేనని తేలింది. అందుకే అంతరించిపోయే దశలో ఉన్న పక్షి సంతతిగా గుర్తించారు. ఇప్పుడిప్పుడే వీటి సంఖ్య పెరుగుతోంది’ అని మధుసూదన్‌రెడ్డి వివరించారు.

ఈనాడు, కడప


గొర్రె తోక మూరెడు!

సాధారణంగా గొర్రెలకు తోక బెత్తెడు ఉంటుంది. తిరుపతిలో ఓ పొట్టేలుకు మూరెడు తోక ఉండటంతో స్థానికులు ఆసక్తిగా తిలకించారు. తిరుపతి సత్యనారాయణపురానికి చెందిన మహ్మద్‌ అలీ మహారాష్ట్ర నుంచి పొట్టెళ్లను తీసుకొచ్చారు. అందులో రెండు పొట్టెళ్లకు తోకలు మూరెడు ఉన్నాయి. ఇవి సొనాడి జాతి పొటేళ్లని, రాజస్థాన్‌లో ఎక్కువగా వీటిని పెంచుతారని స్థానిక అధికారులు తెలిపారు.

ఈనాడు, తిరుపతి


10న కల్యాణమస్తు, షాదీ తోఫా సాయం విడుదల

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వైఎస్సార్‌ కల్యాణమస్తు, షాదీ తోఫా పథకం ఆర్థిక సాయాన్ని ఈనెల 10న ప్రభుత్వం విడుదల చేయనుంది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి జగన్‌ బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. గతేడాది అక్టోబరు 1 నుంచి డిసెంబరు 31 మధ్య వివాహాలు చేసుకున్న వారిలో ప్రభుత్వం నిర్దేశించిన వివిధ వర్గాలకు చెందిన యువతులకు ఆర్థిక సాయాన్ని అందిస్తారు.


ప్రభుత్వ పథకాలు ఇచ్చిన ఇళ్లన్నింటికీ స్టిక్కర్లు
‘మా నమ్మకం నువ్వే జగన్‌’ పేరుతో 11 నుంచి కార్యక్రమం

ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందుతున్న ఇళ్లకు స్టిక్కర్లు వేసేందుకు అధికార వైకాపా సిద్ధమైంది. ‘మా నమ్మకం నువ్వే జగన్‌’ పేరుతో ఈ స్టిక్కర్లను ఈ నెల 11 నుంచి     రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికీ అతికించేలా కార్యాచరణను సిద్ధం చేశారు. ప్రభుత్వ పథకాలను ఎంత మందికి, ఎన్ని ఇళ్లకు ఇచ్చామనే ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించేందుకు వీలుగా ఈ స్టిక్కర్లను అతికిస్తున్నారు. ఇంటి యజమాని అంగీకరిస్తేనే స్టిక్కర్‌ అతికించాలని ప్రాథమికంగా వైకాపా అధినాయకత్వం నిర్ణయించినా క్షేత్ర స్థాయిలో మాత్రం అన్ని ఇళ్లకూ అంటించనున్నారు. ఇందులోభాగంగా సచివాలయ వైకాపా సమన్వయకర్తలు, గృహ సారథులకు శిక్షణ ఇస్తున్నారు.


జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో శ్రీచైతన్య సంచలనం

ఈనాడు, హైదరాబాద్‌: జేఈఈ మెయిన్‌ 2023 సెషన్‌-1 ఫలితాల్లో తమ విద్యార్థులు వావిలాల చిద్విలాస్‌ రెడ్డి, దుగ్గినేని వెంకట యుగేష్‌, గుతికొండ అభిరామ్‌, బిక్కిన అభినవ్‌ చౌదరి 100 పర్సంటైల్‌ సాధించి సత్తా చాటారని శ్రీచైతన్య అకడమిక్‌ డైరెక్టర్‌ సుష్మ తెలిపారు. సబ్జెక్టు పరంగా 100 పర్సంటైల్స్‌ సంఖ్య 70కి పైగా ఉందని పేర్కొన్నారు.


నారాయణ విద్యార్థుల సత్తా

జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో తమ విద్యార్థులు సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్లు పి.సింధూర నారాయణ, పి.శరణి నారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. తమ విద్యార్థి ఎన్‌.కె. విశ్వజిత్‌ 100 పర్సంటైల్‌ సాధించి తమ విజయప్రస్థానాన్ని కొనసాగించారని పేర్కొన్నారు. 17 మంది 99.99 పర్సంటైల్‌ సాధించడం గర్వకారణమన్నారు.


ఎస్సార్‌ విద్యాసంస్థల ప్రభంజనం

జేఈఈ మెయిన్‌ సెషన్‌-1 ఫలితాల్లో తమ విద్యార్థులు మరోసారి ఎస్సార్‌ విజయపతాకాన్ని ఎగరవేశారని ఆ విద్యాసంస్థల ఛైర్మన్‌ ఎ.వరదారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. తమ విద్యార్థులు 26 మందికి పైగా 99 పర్సంటైల్‌ను సాధించారని పేర్కొన్నారు.


భాష్యం మెరుపులు

ఈనాడు, హైదరాబాద్‌: జేఈఈ మెయిన్‌-2023 ఫలితాల్లో భాష్యం ఐఐటీ జేఈఈ అకాడమీ విద్యార్థులు 99.99 పర్సంటైల్‌తో జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించారని ఆ విద్యాసంస్థల ఛైర్మన్‌ భాష్యం రామకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. ఎ.వెంకట శివరామ్‌, పి.నిశ్చల్‌ సుభాష్‌ ఓపెన్‌ కేటగిరీలో టాపర్లుగా నిలిచారని పేర్కొన్నారు. 99.9 పర్సంటైల్‌ ఆపైగా 18 మంది, 99 పర్సంటైల్‌ ఆపైగా 82 మంది సాధించారని వివరించారు.  


తిరుమల విద్యార్థుల ప్రతిభ

రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే: జేఈఈ మెయిన్‌లో తమ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని తిరుమల విద్యాసంస్థల ఛైర్మన్‌ నున్న తిరుమలరావు ఓ ప్రకటనలో తెలిపారు. 99.5 పర్సంటైల్‌ పైన 50 మంది, 95 పర్సంటైల్‌ పైన 415 మంది, 90 పర్సంటైల్‌ పైన 734 మంది సాధించారని వివరించారు.


సత్తాచాటిన శశి వేలివెన్ను విద్యార్థులు

ఈనాడు, హైదరాబాద్‌: జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో తమ విద్యార్థులు సత్తాచాటారని వేలివెన్ను శశి విద్యాసంస్థల ఛైర్మన్‌ బూరుగుపల్లి రవికుమార్‌ వెల్లడించారు. 98 పర్సంటైల్‌ పైన 41 మంది, 90 పర్సంటైల్‌ పైన 205 మంది సాధించారని పేర్కొన్నారు. విద్యార్థులను వైస్‌ ఛైర్మన్‌ బూరుగుపల్లి లక్ష్మీ సుప్రియ అభినందించారు.


విజ్ఞాన్‌ విజయభేరి

ఈనాడు, హైదరాబాద్‌: జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో విజ్ఞాన్‌ విద్యార్థులు విజయభేరి మోగించారని ఆ విద్యా సంస్థల సమన్వయకర్త గుదిమెళ్ల శ్రీకూర్మనాథ్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు. తమ వద్ద శిక్షణ తీసుకున్న విద్యార్థుల్లో 25 శాతం మంది 90 శాతం పైగా పర్సంటైల్‌ సాధించారని పేర్కొన్నారు. ప్రతిభ చూపిన విద్యార్థులను విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య, వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ పి.నాగభూషణ్‌ అభినందించారు.


ఏపీ, గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌లకు బల్క్‌డ్రగ్‌ పార్కులు

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌లలో బల్క్‌డ్రగ్‌ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర వైద్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ తెలిపారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు. గత ఏడాది అక్టోబరు, నవంబర్లలో వీటి ఎంపిక జరిగిందని, వచ్చే 24-28 నెలల్లో ప్రాజెక్టుల ఏర్పాటును పూర్తి చేసే అవకాశముందన్నారు. ఒక్కో పార్కుకు రూ.వెయ్యి కోట్ల చొప్పున మొత్తం రూ.3వేల కోట్లు కేటాయించామని, ఇందులో 70% కేంద్రం సమకూరుస్తుందని తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్‌, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, పంజాబ్‌, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశాల నుంచి ప్రతిపాదనలు అందగా.. మూడు రాష్ట్రాలను ఎంపిక చేశామన్నారు.


రోడ్లు, కాలువలకు మూడేళ్లలో రూ.3,112 కోట్ల వ్యయం
పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ కోన శశిధర్‌

ఈనాడు-అమరావతి: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా)లో మెటీరియల్‌ కాంపోనెంట్‌ కింద గత మూడేళ్లలో సిమెంట్‌ రోడ్లు, కాలువల కోసం రూ.3,112.97 కోట్లు వెచ్చించామని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ కోన శశిధర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. గత ప్రభుత్వంలో ప్రారంభించి మధ్యలో నిలిపివేసిన.. కొత్తగా ప్రారంభించిన వాటితో కలిపి 47,258 కిలో మీటర్ల సిమెంట్‌, బీటీ రోడ్లకు సంబంధించి 49,402 పనులు జరుగుతున్నాయని వివరించారు. ‘ఈనాడు’ ప్రధాన పత్రికలో మంగళవారం ‘దారివ్వని ప్రభుత్వం’ శీర్షికతో వెలువడిన కథనంపై ఆయన స్పందించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించి మధ్యలో నిలిపివేసిన రహదారులు, కాలువలు పనులు పూర్తి చేయించి బిల్లులు చెల్లించడానికి ప్రస్తుత ప్రభుత్వ హయాంలో రూ.4,400 కోట్లు ఖర్చు చేసినట్లు కమిషనర్‌ శశిధర్‌ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి మెటీరియల్‌ కింద ఇంకా రూ.2 వేల కోట్లు రావాల్సి ఉందని, విడుదలైన వెంటనే పనులు మరింత వేగంగా పూర్తి చేస్తామన్నారు.


ఆర్‌సెట్‌ రెండో విడత కౌన్సెలింగ్‌ 9నుంచి

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఆర్‌సెట్‌ రెండో విడత కౌన్సెలింగ్‌ను ఈ నెల 9వ తేదీ నుంచి చేపట్టనున్నట్లు ఉన్నత విద్యామండలి కార్యదర్శి నజీర్‌ అహ్మద్‌ తెలిపారు. వెబ్‌ కౌన్సెలింగ్‌ రిజిస్ట్రేషన్‌, ధ్రువపత్రాల అప్‌లోడ్‌ 9-11, ధ్రువపత్రాల పరిశీలన 10-12, వెబ్‌ఐచ్ఛికాలు 13-15, సీట్ల కేటాయింపు 17న నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సీట్లు పొందిన అభ్యర్థులు 20 నుంచి 24లోపు కళాశాలల్లో చేరాలని సూచించారు.


ప్రభుత్వానికి కాగ్‌, ఆడిట్‌ నివేదికలు

ఈనాడు, అమరావతి: రాష్ట్ర రెవెన్యూ, రవాణా శాఖలకు సంబంధించి 2021 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సర కాగ్‌, ఆడిట్‌ జనరల్‌ తనిఖీ నివేదికలను ఈనెల 3న రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశామని ఏపీ ఆడిట్‌ ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ జనరల్‌ (ఆడిట్‌) ఇందు అగర్వాల్‌ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర శాసనసభలో వీటిని ప్రవేశపెట్టేందుకు తెలుగు, ఆంగ్ల భాషల్లో రూపొందించామని పేర్కొన్నారు.


టెలీ మెడిసిన్‌తో తగ్గనున్న రోగాల భారం
కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి విశాల్‌చౌహాన్‌

ఈనాడు, అమరావతి: రోగులకు టెలీ మెడిసిన్‌ ద్వారా సేవలు అందించడంలో ఏపీ ప్రభుత్వం ఉత్తమ ప్రతిభ కనబరుస్తోందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి విశాల్‌చౌహాన్‌ పేర్కొన్నారు. టెలీ మెడిసిన్‌ విధానాన్ని బలోపేతం చేయడంపై మంగళవారం దిల్లీ నుంచి వర్చువల్‌ సదస్సులో ఆయన మాట్లాడారు. సమావేశంలో ఏపీ కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ కమిషనర్‌ జె.నివాస్‌ మాట్లాడుతూ.. కొవిడ్‌ కాలంలో ఏపీలో 6,145 మంది వైద్యులు 13,74,698 మంది బాధితులకు సలహాలు, సూచనలు ఇచ్చారని తెలిపారు. ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌ (ఏబీడీఎం) కింద వివిధ రకాల యాప్‌లను అందుబాటులోకి తెచ్చి టెలీమెడిసిన్‌ విధానాన్ని ఉపయోగిస్తున్నామని అన్నారు. రోగుల అభిప్రాయాలనూ సేకరిస్తున్నామని అన్నారు.


అవసరం మేరకు యూరియా ఉంది
వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్‌ హరికిరణ్‌

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఫిబ్రవరి నెల అవసరాలకు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్‌ సి.హరికిరణ్‌ తెలిపారు. ‘జనవరిలో రాష్ట్రానికి కేటాయించిన యూరియా 2.07లక్షల టన్నులు కాగా 2.35లక్షల టన్నులు తెప్పించగలిగాం. ఫిబ్రవరికి 1.94లక్షల టన్నులు అవసరం. ఇప్పటికే 30వేల టన్నులు సరఫరా అయింది. నాలుగైదు రోజుల్లో 25వేల టన్నులు జిల్లాలకు చేరుతుంది’ అని ఓ ప్రకటనలో తెలిపారు. ఆర్‌బీకేల్లో ఎరువుల సరఫరా పెంచాలని, యూరియాతో సహా అన్ని రకాల ఎరువుల్ని అందుబాటులో ఉంచామని తెలిపారు. ‘త్వరలో కొత్త డ్రోన్‌ విధానం తెస్తున్నాం. 1,003 సంఘాలను ఏర్పాటు చేశాం. బృందాల వారీగా వారికి ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నాం’ అని వివరించారు. వేసవిలో అపరాల సాగుకు సంబంధించి వేరుసెనగ, మినుము, రాగులు, ఊదల మినీ కిట్లు సరఫరా చేయనున్నట్లు తెలిపారు.


జీతం కోసం ప్రతి నెలా ఎదురు చూపులేనా?
యూటీఎఫ్‌ విమర్శ

ఈనాడు, అమరావతి: ప్రతినెలా జీతాల కోసం ఎదురుచూడాల్సి రావడం సరికాదని ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య (యూటీఎఫ్‌) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అన్నారు. కొంతకాలంగా ఒకటో తేదీన జీతం అందడం లేదని, ఎప్పుడు వస్తుందో చెప్పేవారు లేకుండాపోయారని పేర్కొన్నారు. సమయానికి జీతాలు రాకపోవడంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సకాలంలో ఈఎంఐలు చెల్లించలేక డిఫాల్టర్‌గా మారాల్సి వస్తోందని విమర్శించారు.


పేద క్రీడాకారులకు ఆర్థిక ప్రోత్సాహం

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని పేద క్రీడాకారులను ఆర్థికంగా ప్రోత్సహించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్‌) ఛైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి తెలిపారు. ఇందుకోసం ఈనెల 15 నుంచి 17 వరకు మూడు రోజులపాటు విజయవాడలోని శాప్‌ కార్యాలయంలో మెగా గ్రీవెన్స్‌ నిర్వహిస్తామని చెప్పారు. మంగళవారం జరిగిన శాప్‌ 82వ పాలకవర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. ‘గోవాలో జరిగే జాతీయ క్రీడల్లో శాప్‌ తరఫున పాల్గొనే క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు రూ.2 కోట్ల నుంచి రూ.2.50 కోట్లు వెచ్చించాలని నిర్ణయించాం. జిల్లా ప్రాధికార సంస్థల అభివృద్ధితోపాటు క్రీడా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, క్రీడా పరికరాలకు కల్పనకు ప్రాధాన్యమిస్తాం. టెన్నీస్‌ కోర్టులు, ఇండోర్‌ మైదానాల నిర్మాణాలకు పాలకవర్గం ఆమోదం తెలిపింది. వాటర్‌ స్పోర్ట్స్‌, అథ్లెటిక్స్‌ను ప్రోత్సహించాలని నిర్ణయించాం’ అని వివరించారు.


ఎన్‌ఈపీని రద్దు చేయాలని ధర్నాలు

ఈనాడు, అమరావతి: విద్యా రంగాన్ని కాషాయీకరణ, కార్పొరేటీకరణ, కేంద్రీకరణ చేసే జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)-2020ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహించారు. కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఈ ధర్నాల సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. జాతీయ విద్యా విధానం ప్రజా వ్యతిరేకమైనదని, రిజర్వేషన్లను కల్పించడంలేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అమలు చేస్తూ పాఠశాలలను ముక్కలు చేస్తోందని, 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తూ మూడు వేల ప్రాథమిక పాఠశాలలను రద్దు చేసిందని వెల్లడించారు. విద్యా హక్కు చట్టానికి విరుద్ధంగా మాతృభాష మాధ్యమం లేకుండా చేశారని, తెలుగు మాధ్యమంలో చదువుకోవాలంటే పక్క రాష్ట్రాలకు పోవాల్సిన దుస్థితి వచ్చిందని విమర్శించారు.


సీపీఎస్‌ రద్దు చేయాలి: సురేష్‌బాబు

ఈనాడు, అమరావతి: కాంట్రిబ్యూటరీ పింఛను పథకం (సీపీఎస్‌)ను రద్దు చేయాలని ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు దేవరపల్లి సురేష్‌బాబు డిమాండ్‌ చేశారు. జీతాలు చెల్లింపులో ఎందుకు ఆలస్యం అవుతోందో ప్రభుత్వం స్పష్టమైన కారణాలను చెప్పాలని, జీతాలు, ఇతర సమస్యలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

హైదరాబాద్‌లోనూ ఈహెచ్‌ఎస్‌ అనుమతించాలి: బుచ్చిరాజు

ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని (ఈహెచ్‌ఎస్‌) హైదరాబాద్‌లోని నిమ్స్‌, సరోజిని కంటి ఆసుపత్రుల్లోనూ అనుమతించాలని హైదరాబాద్‌ సెటిల్డ్‌ పింఛనర్ల సంఘం ప్రధాన కార్యదర్శి బుచ్చిరాజు కోరారు. ఈ మేరకు వైఎస్సార్‌ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ సీఈఓ శ్రీహరిప్రసాద్‌కు విన్నవించారు. మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ ప్రొసీజర్‌ను తగ్గించాలని కోరారు.


ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ అసిస్టెంట్‌ పోస్టులకు దరఖాస్తులు

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ప్రయోగశాలలో పొరుగుసేవల ప్రాతిపదికన 10 ల్యాబ్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు శాంతిభద్రతల విభాగం అదనపు డీజీపీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. భౌతిక శాస్త్రానికి సంబంధించి 3, రసాయన శాస్త్రం 2, జీవ శాస్త్రానికి సంబంధించి 5 పోస్టులు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆయా విభాగాల్లో బీఎస్సీ చదివిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. డైరెక్టర్‌, ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ప్రయోగశాల, నాలుగో అంతస్తు, టెక్‌టవర్‌, ఏపీ డీజీపీ కార్యాలయం పక్కన, పిన్‌ నెంబర్‌-522503 చిరునామాకు ఈ నెల 23వ తేదీలోగా దరఖాస్తులు అందేలా స్పీడ్‌ పోస్టు ద్వారా పంపించాలని సూచించారు.


తనిఖీలకు ముందే వివరాలు అందించాలి: ప్రవీణ్‌ప్రకాశ్‌

ఈనాడు, అమరావతి: మధ్యాహ్న భోజనం 80% కంటే తక్కువ మంది పిల్లలు తింటున్న పాఠశాలలు, విద్యార్థులు బూట్లు ధరించని బడుల జాబితాలను అందించాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్‌ ఆదేశించారు. శుక్ర, శనివారాల్లో తనిఖీలకు వెళ్లినప్పుడు తాను అడిగిన సమాచారం తీసుకురావాలని సూచించారు. బైజూస్‌ కంటెంట్‌ వినియోగం, నాడు-నేడు రెండోవిడత పనుల పురోగతి, చిక్కీ, గుడ్ల సరఫరా, విద్యాకానుక-3 బ్యాగులు, బూట్ల పంపిణీ వివరాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఉపాధ్యాయుల ముఖ హాజరు, పాఠశాల నిర్వహణ నిధుల విడుదల, బడుల్లో ఆయాలకు జీతాల చెల్లింపు, అర్హత కలిగిన ఎస్జీటీలను సబ్జెక్టు టీచర్లుగా నియమించడం లాంటి వివరాలను అందించాలని వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని