AP Govt: ఇకపై మంత్రులకే సలహాదారులు

సలహాదారుల నియామకం విషయంలో విధాన రూపకల్పనకు నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అదనపు అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఈ పాలసీని మంత్రివర్గం ముందుంచి ఆమోదం పొందాక జీవో ఇస్తామని తెలిపింది.

Updated : 22 Mar 2023 08:27 IST

ఇప్పటికే ఉన్నవారిని రీడిజిగ్నేట్‌ చేస్తాం
నియామకాలకు విధానాలు తెస్తున్నాం
మంత్రివర్గం ఆమోదించాక ఉత్తర్వులిస్తాం
సలహాదారులు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి..  
హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అదనపు అఫిడవిట్‌  
ఈనాడు - అమరావతి

లహాదారుల నియామకం విషయంలో విధాన రూపకల్పనకు నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అదనపు అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఈ పాలసీని మంత్రివర్గం ముందుంచి ఆమోదం పొందాక జీవో ఇస్తామని తెలిపింది. సలహాదారులు ప్రజా విధులు నిర్వర్తిస్తారని, వారు అవినీతి నిరోధక చట్టంలోని పబ్లిక్‌ సర్వెంట్‌ (ప్రజా సేవకుడు) నిర్వచనం కిందికి వస్తారని తెలిపింది. ఇకపై మంత్రులకు మాత్రమే సలహాదారులను నియమిస్తామని స్పష్టం చేసింది. మార్గదర్శకాల వివరాలను కోర్టు ముందుంచింది. సాధారణ పరిపాలనశాఖ (పొలిటికల్‌) ముఖ్య కార్యదర్శి రేవు ముత్యాలరాజు హైకోర్టులో తాజాగా ఈ మేరకు అదనపు అఫిడవిట్‌ దాఖలు చేశారు. జ్వాలాపురపు శ్రీకాంత్‌ను దేవాదాయ శాఖ సలహాదారుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 630ని సవాలు చేస్తూ ఏపీ బ్రాహ్మణసేవా సంఘ సమాఖ్య అధికార ప్రతినిధి హెచ్‌కే రాజశేఖరరావు హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సలహాదారుగా ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి నియామకాన్ని సవాలు చేస్తూ విశ్రాంత ఉద్యోగి ఎస్‌.మునెయ్య హైకోర్టులో మరో పిల్‌ వేశారు. వీటి విచారణ సందర్భంగా సలహాదారుల నియామకంపై ప్రభుత్వానికి హైకోర్టు పలు ప్రశ్నలు సంధించింది. శాఖలకు సలహాదారులేమిటంటూ నిలదీసింది. వారి నియామక నిబంధనలు ఎక్కడున్నాయని ప్రశ్నించింది. వారి నియామకం సమాంతర ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లవుతుందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సలహాదారుల నియామకం రాజ్యాంగ బద్ధతను తేలుస్తామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సాధారణ పరిపాలనశాఖ (పొలిటికల్‌) ముఖ్య కార్యదర్శి తాజాగా అదనపు అఫిడవిట్‌ వేశారు.

అఫిడవిట్లోని వివరాలివి..

ఆయా సబ్జెక్టులో నైపుణ్యం ఆధారంగా సంబంధిత మంత్రులకు సలహాదారులు/ప్రత్యేక సలహాదారులను నియమిస్తాం.

సలహాదారులను నియమించుకోవాలని మంత్రులు భావిస్తే ముఖ్యమంత్రి ఆమోదం పొందాలి. సలహాదారుల పదవీ కాలపరిమితి రెండేళ్లు ఉంటుంది. పనితీరు ఆధారంగా మరో రెండేళ్లు పొడిగించవచ్చు.

సలహాదారుల నియామకం అవసరం.. తగిన వ్యక్తా? కాదా తదితర అంశాలపై క్రమం తప్పకుండా సమీక్ష ఉంటుంది.

ప్రభుత్వ రహస్యాలను బహిర్గతం చేయబోమని ప్రతి సలహాదారు అఫిడవిట్‌పై సంతకం చేయాలి. ఎలాంటి వివరాలు గోప్యంగా ఉంచాలో అఫిడవిట్‌లో ఉంటాయి.

విధానాల రూపకల్పనలో మంత్రులకు సలహాలివ్వడం వరకే సలహాదారుల   పాత్ర పరిమితం. సివిల్‌ సర్వెంట్ల రోజువారీ కార్యకలాపాల్లో సలహాదారులు జోక్యం చేసుకోవడానికి వీల్లేదు.

2022లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ జీవో 36కు అనుగుణంగా జీతభత్యాల చెల్లింపు ఉంటుంది.  

సలహాదారుల నియామకం విషయంలో గతంలో మాదిరి కన్సల్టెంట్స్‌/కన్సల్టింగ్‌ ఏజెన్సీలను   కాంట్రాక్టు పద్ధతిలో నియమించుకునే అధికారం  ప్రభుత్వానికి ఉంటుంది.

ఇప్పటికే కొనసాగుతున్న సలహాదారులను సంబంధిత మంత్రులకు సలహాదారులుగా రీడిజిగ్నేట్‌ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఇప్పటివరకు ఏ బాధ్యతలు నిర్దేశించని సలహాదారులకు నిర్దుష్ట పాత్ర, బాధ్యతలను రూపొందించే పనిలో ప్రభుత్వముంది.

ముఖ్యమంత్రి సలహాదారులుగా ఉన్నవారికి సైతం ఇవే నియమ నిబంధనలు వర్తిస్తాయి.

ప్రభుత్వ విధాన నిర్ణయాన్ని క్యాబినెట్‌ ముందుంచి ఆమోదం పొందే ప్రక్రియ కొనసాగుతోంది. పాలసీని నోటిఫై చేస్తూ ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులిస్తుంది. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని తగిన ఉత్తర్వులివ్వాలి. ఈ వ్యాజ్యాలపై హైకోర్టు వచ్చే వారంలో విచారించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని