హాజరు వేయగానే.. వెళ్లిపోయారు

ఏలూరు జిల్లా దెందులూరులో శనివారం నిర్వహించిన ముఖ్యమంత్రి సభకు అధికారులు, నాయకులు అత్యుత్సాహంతో భారీగా జనసమీకరణ చేశారు.

Updated : 26 Mar 2023 07:44 IST

సీఎం ప్రసంగిస్తుండగా వెనుదిరిగిన మహిళలు

ఈనాడు డిజిటల్‌, ఏలూరు: ఏలూరు జిల్లా దెందులూరులో శనివారం నిర్వహించిన ముఖ్యమంత్రి సభకు అధికారులు, నాయకులు అత్యుత్సాహంతో భారీగా జనసమీకరణ చేశారు. ప్రతి నియోజకవర్గం నుంచి 50- 100 బస్సుల్లో పొదుపు సంఘాల మహిళలను తీసుకొచ్చారు. సభకు రాకపోతే రుణాలు, పథకాల విషయంలో ఇబ్బందులు పడతారని వారిని అధికారులు హెచ్చరించారు. గ్రూపుల వివరాలు, సభ్యుల పేర్లున్న రిజిస్టర్లు తీసుకొచ్చి అందరూ వచ్చారా లేదా అని సభా ప్రాంగణం దగ్గర హాజరు వేశారు. సభా ప్రాంగణ సామర్థ్యం 10 వేలు ఉంటే దాదాపు 50 వేల మందిని తరలించినట్లు తెలుస్తోంది. పాఠశాలలు, ఆర్టీసీ, ప్రైవేటు వాహనాలు అన్ని కలిపి వెయ్యి వరకు పార్కింగ్‌ స్థలంలో దర్శనమిచ్చాయి. రద్దీ ఎక్కువగా ఉండటంతో మహిళలు ఉక్కిరిబిక్కిరయ్యారు. లోపలికి వెళ్లే వీలులేక మండుటెండలో నేలపై కూర్చున్నారు. హాజరు వేసేవరకూ ఓపిక పట్టి, ఆ వెంటనే తిరుగుప్రయాణమయ్యారు. దీంతో సీఎం సభా ప్రాంగణానికి రాక ముందే సగం మంది వెళ్లిపోయారు. ఆయన ప్రసంగిస్తున్నప్పుడూ జనాలు భారీగా బయటికి వచ్చేశారు. పోలీసులు అడ్డగించినా బారికేడ్లలో నుంచి దూరి వెళ్లిపోయారు. మొదట జనంతో కిక్కిరిసిన సభా ప్రాంగణం తర్వాత ఖాళీ కుర్చీలతో వెలవెలబోయింది.  సీఎం పర్యటన నేపథ్యంలో ప్రజలను తరలించేందుకు ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పాఠశాలల బస్సులను కేటాయించారు. పాఠశాలలను తెరిచే ఉంచి విద్యార్థులు రాలేదన్నట్లు హాజరు పట్టికల్లో నమోదు చేశారు. బస్సు రాకుండా విద్యార్థులు బడికెలా వెళ్తారని తల్లిదండ్రులు వాపోయారు. ఏలూరు, పశ్చిమ, కృష్ణా జిల్లాల నుంచి ఆర్టీసీ బస్సులను సభకు తీసుకురావడంతో ఏలూరు, భీమవరం, జంగారెడ్డిగూడెం, తాడేపల్లిగూడెం, నరసాపురం, నూజివీడు తదితర ప్రాంతాల్లో ప్రయాణికులు సకాలంలో బస్సులు రాక ఇబ్బందులు పడ్డారు. ఇదే అదనుగా ప్రైవేటు వాహనాలవారు ధరలు పెంచి వసూలు చేశారు. సీఎం పర్యటన ముగిసేవరకూ దెందులూరులో దుకాణాలను మూయించారు. అక్కడి ప్రభుత్వ పాఠశాలలకు శుక్రవారం నుంచే సెలవులు ప్రకటించారు. 


నిర్బంధాలు.. అడ్డగింతలు

శ్రం కళాశాల కూడలిలో పనిచేసే 70 మంది హమాలీలు సభకు వచ్చారు. వీరు ఎరుపు రంగు దుస్తులు ధరించి ఉండటంతో లోపలికి వెళ్లేందుకు వీల్లేదంటూ భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ప్రొటోకాల్‌ ప్రకారం ఆహ్వానం ఉన్నా ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీని పోలీసులు అడ్డుకున్నారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయంటూ  ఆయన్ను గృహనిర్బంధంలో ఉంచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని