రాబోయే ఎన్నికల్లో యుద్ధం జరగబోతోంది

రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో యుద్ధం జరగబోతోందని.. తాను బటన్‌ నొక్కి ఖాతాల్లోకి నగదు పంపే డీబీటీకి.. చంద్రబాబు దోచుకోవడానికి, పంచుకోడానికి.. తినుకోడానికి (డీపీటీ) మధ్య ఆ యుద్ధం ఉంటుందని సీఎం జగన్‌ అన్నారు.

Published : 02 Jun 2023 04:45 IST

పేదవాడు వైకాపా వైపు... పెత్తందార్లు మరోవైపు
అన్ని పార్టీల పథకాల కాపీ.. బాబు మేనిఫెస్టో: సీఎం జగన్‌
కర్నూలు జిల్లా పత్తికొండలో రైతు భరోసా నిధుల విడుదల

ఈనాడు, కర్నూలు: రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో యుద్ధం జరగబోతోందని.. తాను బటన్‌ నొక్కి ఖాతాల్లోకి నగదు పంపే డీబీటీకి.. చంద్రబాబు దోచుకోవడానికి, పంచుకోడానికి.. తినుకోడానికి (డీపీటీ) మధ్య ఆ యుద్ధం ఉంటుందని సీఎం జగన్‌ అన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండలో గురువారం ‘వై.ఎస్‌.ఆర్‌. రైతు భరోసా-పి.ఎం.కిసాన్‌’ నిధుల విడుదల, ఇన్‌పుట్‌ సబ్సిడీ జమ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెదేపా సామాజిక అన్యాయానికి.. వైకాపా సామాజిక న్యాయానికి మధ్య యుద్ధం జరుగుతోందని పేర్కొన్నారు. వారి యుద్ధం జగన్‌తో కాదని. పేదలతో యుద్ధమని గుర్తుంచుకోవాలని చెప్పారు. పేదవాడు వైకాపా వైపు ఉంటే.. పెత్తందారులు మరోవైపు ఉండి యుద్ధం చేస్తున్నారన్నారు. వారిది రాజకీయ పోరాటం కాదని, అధికారం కోసం ఆరాటమని ఎద్దేవా చేశారు. దోచుకోవడానికి, ఆ దోచుకున్నది తినడానికే వారికి అధికారం కావాలన్నారు. రాజమహేంద్రవరంలో ఒక డ్రామా కంపెనీ మాదిరిగా మహానాడు జరిగిందని అన్నారు. వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తానని, బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానని గతంలో హామీ ఇచ్చి.. తనకు ఓటేసిన ఓటర్లను నిలువునా ముంచేశారన్నారు. ఎన్నికల ముందు ఆకర్షణీయమైన మేనిఫెస్టో విడుదల చేయడం.. ప్రజలను వెన్నుపోటు పొడవడం చంద్రబాబునాయుడి రాజకీయ ఫిలాసఫీ అని పేర్కొన్నారు. కర్ణాటకలో వివిధ పార్టీలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ కలిపేసి ఆయన మేనిఫెస్టోను తయారు చేశారన్నారు. దీనిని ప్రజలు గమనించాలన్నారు. తెదేపాకు 175 నియోజకవర్గాల్లో 175 మంది అభ్యర్థులు కూడా లేరని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని 14 ఏళ్లు పాలించి.. ప్రస్తుతం మళ్లీ మరో అవకాశం ఇవ్వాలని అడుగుతున్నారని ఎద్దేవా చేశారు.

ఐదో ఏడాది తొలి విడత సాయం..

వరుసగా ఐదో ఏడాది తొలి విడత సాయాన్ని 52,30,939 మంది రైతుల ఖాతాలకు మొత్తం రూ. 3,923 కోట్లు జమ చేస్తున్నట్లు సీఎం జగన్‌ ప్రకటించారు. ఏటా రూ. 12,500 చొప్పున ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పి... దానికన్నా మిన్నగా రూ. 13,500 ఇస్తున్నామని చెప్పారు. ప్రతి రైతన్నకు మొత్తం రూ. 61,500 సాయం అందినట్లవుతుందని తెలిపారు. గురువారం రూ. 5,500, త్వరలో మిగిలిన రూ.2,000 పీఎం కిసాన్‌ నిధులు జమవుతాయని చెప్పారు. ప్రభుత్వం రైతు భరోసా కోసం మొత్తం రూ. 30,985 కోట్లు వెచ్చించిందని గుర్తుచేశారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద ఏ సీజన్లో నష్టాన్ని ఆ సీజన్లోనే చెల్లిస్తున్నామని తెలిపారు. మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో వర్షాలకు నష్టపోయిన 51 వేల మంది రైతన్నల కుటుంబాల ఖాతాల్లోకి మరో రూ. 54 కోట్లు జమ చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. అనంతరం బటన్‌ నొక్కి రైతు భరోసా సాయం, ఇన్‌పుట్‌ సబ్సిడీలను రైతుల ఖాతాల్లో జమ చేశారు.

కర్నూలులో న్యాయ విశ్వవిద్యాలయం

కర్నూలులో రూ. 500 కోట్లతో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని.. జులై, ఆగస్టుల్లో శంకుస్థాపన చేస్తామని ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించారు. రూ.వెయ్యి కోట్లతో ఆదోని, నంద్యాలలో వైద్య కళాశాలల నిర్మాణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. పత్తికొండలో రూ. 10 కోట్లతో టమాటా ప్రాసెసింగ్‌ ప్లాంటు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామన్నారు.

ఆర్బీకే స్థాయిలో డ్రోన్లు 

2014-19 మధ్య ఆహారధాన్యాల ఉత్పత్తి సగటున ఏటా 153 లక్షల టన్నులుంటే.. 2019-23 మధ్య ఏటా సగటు ఉత్పత్తి 165 లక్షల టన్నులకు పెరిగిందని సీఎం చెప్పారు. ఉద్యాన పంటల దిగుబడి 228 లక్షల టన్నుల నుంచి 332 లక్షల టన్నులకు పెరిగిందన్నారు. తన నాలుగేళ్ల పాలనలో ఒక్క మండలాన్ని కూడా కరవు ప్రాంతంగా ప్రకటించే పరిస్థితి రాలేదని తెలిపారు. గత సంవత్సరం ఖరీఫ్‌ బీమా సొమ్మును జులై 8న జమ చేయనున్నట్లు ప్రకటించారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో 2.65 కోట్ల టన్నుల ధాన్యాన్ని సేకరిస్తే, ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటికే 3.09 కోట్ల టన్నులు సేకరించిందన్నారు. ధాన్యం సేకరణకు ఇప్పటికే రూ. 60 వేల కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. నియోజకవర్గ స్థాయిలో 70 ఆర్గానిక్‌ టెస్టింగ్‌ ప్రయోగశాలలు ఏర్పాటు కాగా మరో 77 నియోజకవర్గాల్లో అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రైతు భరోసా కేంద్రాలు సాగు విధానాన్ని పూర్తిగా మార్చబోతున్నాయని.. రానున్న రోజుల్లో రైతులు డ్రోన్లతో వ్యవసాయం చేయనున్నారని పేర్కొన్నారు. ఆర్బీకే స్థాయిలో డ్రోన్లు తీసుకొచ్చే దిశగా అడుగులు పడుతున్నాయన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ కోసం రూ. 1,052 కోట్ల విలువైన యంత్రాలను అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, గుమ్మనూరు జయరాం, ఎంపీ సంజీవ్‌కుమార్‌, మేయర్‌ బి.వై.రామయ్య, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.


మధ్యలోనే జనం బయటకు..

ఆలూరు గ్రామీణ, ఆస్పరి, న్యూస్‌టుడే: సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు పత్తికొండలోని రహదారులను దిగ్బంధించారు. దుకాణాలన్నీ మూసివేయించారు. సభకు వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ముఖ్యమంత్రి ప్రసంగం సాగుతుండగానే.. చాలామంది వెనుదిరిగారు. నాయకులు విన్నవిస్తున్నా.. ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్లిపోయారు.

సీఎం సభలో మద్యం కిక్కు

సీఎం సభలో మద్యం కిక్కు ఎక్కువైంది. నాయకులు వివిధ గ్రామాల నుంచి వైకాపా కార్యకర్తలను భారీగా తరలించారు. మద్యం తాగేవారికి కొందరు టెట్రా ప్యాకెట్లు అందించారు. సభ ప్రారంభమైన కొద్దిసేపటికే వారు బయటకు వచ్చి మద్యం తాగారు. కొందరు రోడ్లపై తాగడం కనిపించింది. పోలీసులూ ఏం చేయలేకపోయారు. ఒకరిద్దరు తాగి సభలో కింద పడిపోయి కనిపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని