Machilipatnam: మన ఓట్లు కాదా.. బూత్‌ మార్చేయ్‌

కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని డోర్‌ నం.27/37లో జి.వెంకట కనకరాజు కుటుంబసభ్యులు ఉంటున్నారు. వారి పోలింగ్‌ బూత్‌ నం.110. ఆయన పోలింగ్‌బూత్‌ను 43కు మార్చేశారు.

Updated : 24 Jun 2023 07:10 IST

చూసుకోరనే ధీమాతో అడ్డగోలు వ్యవహారం
బూత్‌లు మారిపోయిన వేల ఓట్లు

  • కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని డోర్‌ నం.27/37లో జి.వెంకట కనకరాజు కుటుంబసభ్యులు ఉంటున్నారు. వారి పోలింగ్‌ బూత్‌ నం.110. ఆయన పోలింగ్‌బూత్‌ను 43కు మార్చేశారు.
  • డోర్‌ నం.18/336లో ఉంటున్న జి.వరలక్ష్మి, వెంకటేశ్వరరావుల పోలింగ్‌ కేంద్రం 66. వరలక్ష్మి పోలింగ్‌ కేంద్రాన్ని 44కు మార్చారు.
  • డోర్‌ నం.16/372 చెందిన ఎం.ఆంజనేయులు, అంజలిల పోలింగ్‌ కేంద్రం 70 కాగా.. ఆంజనేయులు పోలింగ్‌ కేంద్రాన్ని 46కు బదిలీ చేశారు.
  • 9/143లో ఉంటున్న రహమతున్నీసా, సత్తార్‌షేక్‌, అన్వర్‌మొహ్మద్‌ల పోలింగ్‌ కేంద్రం 135. రహమతున్సీసాకు 43, అన్వర్‌మొహ్మద్‌కు 137 కేటాయించారు.
  • డోర్‌ నం.14/141లో ఉంటున్న యోగనాథశర్మ పోలింగ్‌ బూత్‌ 84. ఆయన పేరు 57, 84లో డబుల్‌ ఎంట్రీగా చూపారు.
  • మచిలీపట్నం కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: కొన్నేళ్లుగా ఓటర్ల జాబితాలను మారుస్తున్న తీరుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విపక్షాల ఓట్లకు గండికొట్టేందుకు వాలంటీర్ల సారథ్యంలో నయా దందాకు తెరతీశారు. ఎన్నికల జాబితా తయారీలో రూల్‌ నం.6 అతిక్రమిస్తూ ప్రత్యేకించి విపక్షాలకు చెందిన వేల ఓట్లను గల్లంతు చేస్తున్న తీరు ‘న్యూస్‌టుడే’ పరిశీలనలో వెల్లడైంది.

అనుమానం రానీయకుండా..

ఓటరు తనకు ఓటు హక్కు ఉందా లేదా అనే అనుమానం వచ్చినప్పుడు జాతీయ ఓటర్ల సర్వీసు పోర్టల్‌లో చూసుకుంటే ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ, తమ బూత్‌ ఎక్కడనే విషయంపై ఆరా తీయరు. ఎన్నికలప్పుడు ఓటు వేయడానికి దగ్గర్లో ఉండే బూత్‌కు వెళ్తే అక్కడ ఓటు ఉండదు. ఎక్కడో మూడు, నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండే బూత్‌లో ఓటు ఉందని తెలిసినా... అందరూ అంతదూరం వెళ్లరు. ఒకవేళ అక్కడికి వెళ్లినా అప్పటికే నకిలీ ఐడీతో ఎవరైనా ఓటు వేస్తే.. ఛాలెంజ్‌ చేయరు. అంటే బూత్‌ల మార్పిడిని అడ్డుపెట్టుకుని కొందరిని ఓటు హక్కు వినియోగించుకోకుండా చేయవచ్చు. ఇలా ప్రతి నియోజకవర్గంలో గెలుపు అవసరాల మేరకు ఓటర్ల బూత్‌ మార్పిడి చేశారనడానికి కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గమే ఉదాహరణగా నిలుస్తోంది.

రూల్‌ నం.6 దుర్వినియోగం చేస్తూ..

ఓటుహక్కు ఉన్నట్లు భ్రమ కల్పించి ఓటు వేసే అవకాశం లేకుండా చేయడం ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు రూల్‌ నం.6ను దుర్వినియోగం చేస్తున్నారు. జాబితా నుంచి పేర్లు తొలగించినా,  ఒకే డోర్‌ నంబరుపై వందలసంఖ్యలో ఓటర్లున్నా తేలిగ్గా గుర్తించి పరిష్కరించుకోవచ్చు. కానీ, పట్టణ ప్రాంతాలు, మేజర్‌ పంచాయతీల్లో ఓటర్ల బూత్‌లను మార్చేస్తే అంతగా గుర్తించే అవకాశం ఉండదు. దాన్ని ఆసరాగా చేసుకొని వేల ఓట్లను ఎన్నికల జాబితా తయారీ (ఎలక్ట్రోరల్‌ ప్రిపరేషన్‌ మాన్యువల్‌) నిబంధనలకు విరుద్ధంగా బూత్‌లు మార్చేశారు.

ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం ప్రతి ఓటరుకు రెండు కి.మీ. పరిధిలో పోలింగ్‌ బూత్‌ ఉండాలి. రూల్‌ నం.6 ప్రకారం డోర్‌నంబర్ల ప్రకారం ఓటర్ల జాబితా రూపొందించాలి. అందుకు భిన్నంగా మచిలీపట్నం నియోజకవర్గంలో వేల ఓటర్ల పోలింగ్‌ బూత్‌లను 3-5 కి.మీ. దూరానికి మార్చేశారు. ఒకే కుటుంబానికి వేర్వేరు బూత్‌లు కేటాయించారు. మచిలీపట్నం కార్పొరేషన్‌ పరిధిలో 1140 పైగా ఓటర్లను ఏకంగా రెవెన్యూ వార్డులే మార్చేశారు. రెవెన్యూ వార్డు పరిధిలో ఉండే బూత్‌ల వారీగా రమారమి 10,000 ఓట్ల పోలింగ్‌ కేంద్రాలను తారుమారు చేశారు. 2022 ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల తర్వాత అభ్యంతరాల స్వీకరణ సందర్భంగా.. రూల్‌ నం.6 అతిక్రమణ గురించి ఎత్తిచూపినా పరిగణనలోకి తీసుకోకుండా 2023 జనవరి 5న అవే తప్పులతో తుది జాబితా విడుదల చేశారు.

వాలంటీర్లను వినియోగించి..

వాలంటీర్లే విపక్ష ఓటర్ల బూత్‌లను తారుమారు చేశారన్న అభియోగాలున్నాయి. మార్పులు, చేర్పులు చేసినవారి పూర్తి వివరాలతో పాటు అందుకు అనుగుణంగా సిద్ధం చేసుకున్న నకిలీ ఐడీలు వారి చేతుల్లోనే ఉన్నాయన్న ఆరోపణలున్నాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ చేసేటప్పుడు చాలావరకు సచివాలయ సిబ్బందే బీఎల్వోలుగా ఉంటున్నారు. వారు అధికారపార్టీ నాయకుల ఆదేశాలే పాటిస్తున్నారన్న అభియోగాలున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని