బియ్యం కొనేట్టు లేదు

విదేశాలకు ఎగుమతులపై నిషేధం విధించడంతో.. రైతుల నుంచి కొనుగోలు చేసే ధాన్యం ధరలైతే కాస్త తగ్గించారు. బియ్యం ధరలు మాత్రం తగ్గడం లేదు సరికదా.. రెండు నెలల క్రితంతో పోలిస్తే పెరిగాయి.

Published : 22 Aug 2023 03:02 IST

సన్నబియ్యం కిలో రూ.60పైనే
2018 నాటితో పోలిస్తే 30% పెరిగిన ధర
కందిపప్పు కిలో రూ.160 పైనే

ఈనాడు, అమరావతి: విదేశాలకు ఎగుమతులపై నిషేధం విధించడంతో.. రైతుల నుంచి కొనుగోలు చేసే ధాన్యం ధరలైతే కాస్త తగ్గించారు. బియ్యం ధరలు మాత్రం తగ్గడం లేదు సరికదా.. రెండు నెలల క్రితంతో పోలిస్తే పెరిగాయి. సన్న బియ్యం ధర కిలో రూ.60 నుంచి రూ.63 మధ్యకు చేరింది. మధ్యరకం బియ్యం ధర కూడా కిలో రూ.50 పైనే ఉంది. బియ్యంతోపాటు పప్పుధాన్యాల ధరలు కూడా ఆకాశం వైపు చూస్తున్నాయి. ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో బియ్యం ధరలు దిగి రావడం లేదు. వివిధ రకాల బ్రాండ్ల పేరుతో మార్కెట్లో ఇష్టానుసారం విక్రయిస్తున్నారు. నాణ్యమైన కందిపప్పు కొనాలంటే కిలో రూ.160 నుంచి రూ.180 వరకు పలుకుతోంది. 2018 ఆగస్టు నాటితో పోలిస్తే బియ్యం ధర 30% పెరగ్గా.. కందిపప్పు 146% హెచ్చింది. మినపగుళ్ల ధర కూడా గతంతో పోలిస్తే కిలోకు రూ.20 వరకు పెరిగింది. నెల నెలా పెరుగుతున్న ధరలతో..పేద, మధ్య తరగతి కుటుంబాలపై భారం మరింత పెరుగుతోంది. ప్రభుత్వం రేషన్‌ దుకాణాల ద్వారా రాయితీ కందిపప్పు కూడా ఇవ్వడం లేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో బహిరంగ మార్కెట్లో కొనాల్సి వస్తోంది.

ధాన్యం ధర తగ్గినా...

ధాన్యం బస్తా (75కిలోలు) ధర రెండు నెలల కిందటితో పోలిస్తే రూ.100 వరకు తగ్గింది. రైతుల నుంచి రూ.1,800 నుంచి రూ.2,100 వరకు కొనుగోలు చేస్తున్నారు. నాణ్యమైన రకాలైతే రూ.2,450 వరకు ఉన్నాయి. ఎన్నికల ఏడాది కావడంతో.. ఇక పెరిగే అవకాశం లేదని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఇందుకు అనుగుణంగా బియ్యం ధరలు కూడా కిలోకు రూ.3 వరకు తగ్గాల్సి ఉంది. అయితే ఎక్కడా ఆ పరిస్థితే కన్పించడం లేదు. ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంతోపాటు నెల్లూరు, నంద్యాల, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల సన్నబియ్యం కిలో రూ.63 వరకు విక్రయిస్తున్నారు. పట్టణాల్లో బ్రాండెడ్‌ రకాల బియ్యం ధర కిలో రూ.60 వరకు ఉంది. 26 కిలోల బస్తా రెండు నెలల కిందట రూ.1,350 నుంచి రూ.1,400 వరకు ఉండగా.. ఇప్పుడు రూ.1,500 నుంచి రూ.1,600 వరకు అమ్ముతున్నారు. సన్నబియ్యంలోనే తెలుపు, మసర తదితర రకాలున్నాయి. పాలిష్‌ బియ్యంతో పోలిస్తే ఇవి కిలోకు రూ.3 నుంచి రూ.4 వరకు తక్కువగా ఉంటాయి. పెరిగిన ధరల నేపథ్యంలో ఇవి కూడా కిలో రూ.50 నుంచి రూ.54 మధ్యకు చేరాయి.

కందిపప్పు అంతకంతకు పెరుగుతూ..

కందిపప్పు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దుకాణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కిలో రూ.160 నుంచి రూ.170 మధ్య విక్రయిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నాటితో పోలిస్తే కిలోకు రూ.50 పైగా పెరిగింది. మధ్యరకం కందిపప్పు కూడా కిలో రూ.150 నుంచి రూ.160 వరకు పలుకుతోంది. రాష్ట్రంలో కంది సాధారణ విస్తీర్ణం 6.30 లక్షల ఎకరాలు కాగా.. 2.57లక్షల ఎకరాల్లోనే పంట వేశారు. ధరలు పెరగడానికి ఇదీ ఒక కారణంగా మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

చేతులెత్తేసిన ప్రభుత్వం

రేషన్‌ దుకాణాల ద్వారా కందిపప్పు పంపిణీపై ప్రభుత్వం చేతులెత్తేసింది. కిలో కూడా ఇవ్వడం మా వల్ల కాదని చెప్పకనే చెబుతోంది. 2018లో కిలో కందిపప్పు రాయితీపై రూ.40 చొప్పున కార్డుకు 2 కిలోలు ఇవ్వగా.. వైకాపా అధికారంలోకి వచ్చాక కిలో ధర రూ.67 చేసి కార్డుకు కిలో చొప్పునే ఇవ్వాలని నిర్ణయించింది. మూడు నెలలుగా అదీ ఇవ్వడం లేదు. జూన్‌, జులైలో ఇవ్వాల్సిన కందిపప్పు కూడా కలిపి ఒక్కో కార్డుపై రెండు కిలోలు ఇస్తామన్న మంత్రి నాగేశ్వరరావు మాటలు.. డొల్ల చందమే అయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని