వైద్యవిద్యనూ అమ్మేశారు!

సీఎం జగన్‌ ఇటీవల ఏ సభలో మాట్లాడినా తాను పేదల పక్షమని ఊదరగొడుతున్నారు...! దీనజనోద్ధారకుడు అన్నది తన ట్యాగ్‌లైన్‌ అన్నట్టుగా బిల్డప్‌ ఇస్తున్నారు...! ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కష్టం కలగకుండా, నష్టం జరగకుండా చూసుకోవడమే తన లక్ష్యం అన్నట్టుగా చెబుతున్నారు.

Updated : 23 Aug 2023 10:36 IST

బీసీ, ఎస్సీ, ఎస్టీలు మెడికల్‌ సీట్లు కొనుక్కోవాల్సిందే
ఎన్ని విమర్శలొచ్చినా జగన్‌ సర్కారుది అదే విధానం
రూ.90 లక్షలు కట్టి ఎంబీబీఎస్‌ సీటు ఎవరు కొనగలరు?

ఈనాడు, అమరావతి: సీఎం జగన్‌ ఇటీవల ఏ సభలో మాట్లాడినా తాను పేదల పక్షమని ఊదరగొడుతున్నారు...! దీనజనోద్ధారకుడు అన్నది తన ట్యాగ్‌లైన్‌ అన్నట్టుగా బిల్డప్‌ ఇస్తున్నారు...! ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కష్టం కలగకుండా, నష్టం జరగకుండా చూసుకోవడమే తన లక్ష్యం అన్నట్టుగా చెబుతున్నారు. వారి కోసమే పెత్తందారులపై తన పోరాటమని డాంబికాలు పలుకుతున్నారు. అవన్నీ మాటల వరకే..! చేతలకు వచ్చేసరికి తానే అసలు సిసలు పెత్తందారుననీ, పేదల వ్యతిరేకిననీ మరోసారి చాటుకున్నారు. కొత్తగా వచ్చిన అయిదు వైద్య కళాశాలల్లో సగం సీట్లను నిస్సిగ్గుగా అమ్మేస్తూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రిజర్వేషన్లను 25 శాతానికే పరిమితం చేస్తూ, వారిపై తనదంతా కల్లబొల్లి ప్రేమేనని మరోసారి నిరూపించారు. జగన్‌లోని భూస్వామ్య, పెత్తందారీ స్వభావాన్ని... ఆయన ప్రభుత్వ కొత్త విధానం మరోసారి బహిర్గతం చేసింది. 

కొత్తగా వచ్చిన అయిదు వైద్య కళాశాలల్లో సగం సీట్లకు ప్రభుత్వం రూ.లక్షల్లో ధరలు నిర్ణయించి, సంతలో సరకులా అమ్మేయడం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల్లోని పేదలు కోల్పోతున్న సీట్లు 204. ప్రస్తుత నిబంధనలే అమల్లో ఉంటే, త్వరలో అందుబాటులోకి వస్తాయని చెబుతున్న 12 కళాశాలలను కలిపి లెక్కిస్తే వారు కోల్పోయే సీట్లు సుమారు 694. ఇవన్నీ ఒక్క ఏడాదిలో కోల్పోయే సీట్లు..! ఈ ప్రకారం రానున్న దశాబ్దాల్లో బడుగు బలహీన వర్గాల వారు కోల్పోయే సీట్లు వేల సంఖ్యలో ఉంటాయి. ఎంబీబీఎస్‌లో సీటు రావడమంటే... ఒకవిధంగా యజ్ఞమే. విపరీతమైన పోటీని తట్టుకుని నీట్‌లో మంచి ర్యాంకు సాధించాలి. మొదటి ప్రయత్నంలో సీటు రాకపోతే... దీర్ఘకాల శిక్షణ తీసుకుంటారు. దానికే రూ.లక్షల్లో ఖర్చవుతుంది. అన్ని కలలుకని, ఒక తపస్సులా శ్రమించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల పిల్లలు, వారి తల్లిదండ్రుల ఆశల్ని నిర్దాక్షిణ్యంగా చిదిమేయడం, ప్రభుత్వమే ఫక్తు వ్యాపార సంస్థలా వ్యవహరిస్తూ సీట్లను తెగనమ్ముకోవడమేనా పేదల్ని ఉద్ధరించడమంటే? ప్రతిభ కలిగిన బడుగు, బలహీన వర్గాల పిల్లల కలల్ని కాలరాయడం వారిని ఆదుకోవడం ఎలా అవుతుంది?

బడుగు, బలహీన వర్గాలకు తీవ్ర అన్యాయం

ఈ విద్యాసంవత్సరం నుంచి రాజమహేంద్రవరం, నంద్యాల, మచిలీపట్నం, విజయనగరం, ఏలూరుల్లో ఏర్పాటైన ప్రభుత్వ వైద్యకళాశాలల్లో 150 చొప్పున 750 సీట్ల భర్తీకి జాతీయ వైద్యకమిషన్‌ ఆమోదం తెలిపింది. దానిలో జాతీయ కోటా కింద 15% (112) సీట్లు వెళ్లాయి. మిగిలిన 638 సీట్లలో 50% (25% సీట్లు ఓపెన్‌ కేటగిరీ, 25% సీట్లు రిజర్వేషన్‌) కన్వీనర్‌ కోటాలో రాష్ట్రవిద్యార్థులతో భర్తీచేశారు. మిగిలిన 50% సీట్లలో 35% ‘బీ’ కేటగిరీ (సెల్ఫ్‌ ఫైనాన్స్‌) కింద, 15% ఎన్నారై కోటా కింద భర్తీచేస్తున్నారు. ఇలా ప్రతి కళాశాలలోనూ 50% సీట్లు అమ్మకానికి పెట్టారు. దీంతో 5 కళాశాలల్లో ఎస్సీ విద్యార్థులు 48 సీట్లు, ఎస్టీ విద్యార్థులు 19 సీట్లు, బీసీ విద్యార్థులు 93 సీట్ల చొప్పున మొత్తం 160 సీట్లు నష్టపోయారు.

ఓపెన్‌ కేటగిరీలోనూ కోత

ప్రతిభగల ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఓపెన్‌ కేటగిరీ సీట్లలోనూ ప్రవేశాలు పొందుతుంటారు. ఇప్పుడు కొత్తవిధానంతో ఓపెన్‌ కేటగిరీలో ఎస్సీ, ఎసీ, బీసీ వర్గాలకు వచ్చే సీట్లకూ గండి పడుతోంది. సాధారణంగా ఓపెన్‌ కేటగిరీ సీట్లలో ప్రతిభగల ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు సగటున 15% వరకు సీట్లు పొందుతుంటారని గణాంకాలు చెబుతున్నాయి. ఒంగోలు ప్రభుత్వ కళాశాలలో 59 ఓపెన్‌ కేటగిరీ సీట్లకుగాను... 27 సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు వచ్చాయి. అంటే దాదాపు సగం సీట్లు వారికి దక్కినట్టు. కొత్తగా వచ్చిన అయిదు వైద్య కళాశాల్లో 319 సీట్లను ప్రభుత్వం అమ్మేయకుండా రిజర్వేషన్ల విధానాన్ని అనుసరించి భర్తీ చేసి ఉంటే... వాటిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు 160 సీట్లతో పాటు, ఓపెన్‌ కేటగిరీలోను 24 సీట్లు వరకు దక్కేవి. అంటే జగన్‌ ప్రభుత్వ విధానం వల్ల అయిదు కళాశాలల్లోనే వారు 204 సీట్లు కోల్పోతున్నారు.

రూ.90 లక్షలు పెట్టి సీటు కొనుక్కోగలరా?

కొత్త వైద్య కళాశాలల్లో 50% సీట్లు అమ్మకానికి పెట్టిన జగన్‌ ప్రభుత్వం... బీ కేటగిరీ (సెల్ఫ్‌ ఫైనాన్స్‌) సీటుకి రూ.12 లక్షలు, సీ కేటగిరీ (ఎన్నారై కోటా) సీటుకు రూ.20 లక్షలు ఫీజు నిర్ణయించింది. నాలుగున్నరేళ్ల ఎంబీబీఎస్‌ కోర్సును రూ.90 లక్షలు కట్టి చదివే స్తోమత పేదలైన దళిత, గిరిజన బిడ్డలకు ఉంటుందా? ఇలా సీట్లు తెగనమ్మడం... రాజ్యాంగం ఆయా వర్గాలకు కల్పించిన హక్కును కాలరాయడం కాదా? అయిదు కాలేజీల్లో ప్రభుత్వం అమ్మకానికి పెట్టిన సీట్లలో డబ్బు కట్టి చేరిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 22 మందే. వారిలో 20 మంది ఎస్సీలు. ఇద్దరు ఎస్టీలు. వారు కూడా ధనికులు పిల్లలు, ఆర్థిక స్తోమత ఉన్నవారు. ఆయావర్గాల్లోని ప్రతిభావంతులైన పేద విద్యార్థులు సీట్లు కొనుక్కోలేక ఎంత వేదన పడతారో ఈ ప్రభుత్వానికి అర్థమవుతోందా? ప్రభుత్వం ఉన్నది పేదలకి మేలు చేయడానికా... విద్యా వ్యాపారం చేస్తూ వారి హక్కుల్ని కాలరాయడానికా?

ఈడబ్ల్యూఎస్‌లను మరచిపోయారా?

రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు(ఈడబ్ల్యూఎస్‌) వారు ఉన్నారనే విషయాన్ని జగన్‌ మరచిపోయినట్టున్నారు. ఎంతో కీలకమైన వైద్యవిద్య సీట్ల భర్తీలో వారికి కేటాయింపులు ఉండాలనే విషయాన్ని పరిగణనలోకే తీసుకోలేదు. తెలంగాణ ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్‌ వర్గాలకు 10% రిజర్వేషన్లను కొత్త వైద్య కళాశాలల్లో అమలుచేస్తున్నా....జగన్‌ మాత్రం కేంద్రం ఇంకా అనుమతివ్వలేదన్న సాకుతో మిన్నకున్నారు. పొరుగు రాష్ట్రంలో ఉన్న విధానాన్ని ఇక్కడా అమలుచేసి ఆ వర్గం విద్యార్థులకు మేలు చేయడానికి ఉన్న అభ్యంతరమేంటి? కేంద్రం అనుమతే కావాలనుకుంటే... తరచూ దిల్లీ వెళ్లి కేంద్రపెద్దలను, అధికారులను కలిసే జగన్‌...ఈ విషయాన్ని వారివద్ద ప్రస్తావించి ఉండొచ్చు కదా?

భవిష్యత్తులో పీజీ సీట్లకూ ఎసరు?

ప్రభుత్వ సీట్ల అమ్మకం నిర్ణయం ప్రస్తుతానికి ఎంబీబీఎస్‌ ప్రవేశాలకే అంటున్నా.. భవిష్యత్తులో పీజీ సీట్లకూ వర్తింపజేస్తారేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. జూనియర్‌ డాక్టర్ల అసోసియేషన్‌ విద్యార్థులు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ...సమ్మె చేస్తామని ప్రకటించారు. కానీ.. వారిపై రాష్ట్రప్రభుత్వం ఎదురుదాడికి దిగింది. వారిని భయపెట్టి.. ఆందోళన ఉపసంహరించుకునేలా చేసింది. ప్రభుత్వనిర్ణయం వైద్యవిద్య చదవాలనుకునేవారి ఆశలను ఆడియాసలు చేస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని