గిరిజనుల ఇళ్లు కొట్టి.. గ్రానైట్‌ కొల్లగొట్టి..

నిరుపేద ఎస్టీలు ఉంటున్న స్థలంలో ఖనిజ సంపద ఉందని తెలుసుకున్న అధికార పార్టీ నేతలు ఆ కాలనీపై కన్నేశారు. వారిని నమ్మించి మూడేళ్ల క్రితం ఖాళీ చేయించారు.

Updated : 04 Sep 2023 07:58 IST

ఎన్నాళ్లుగానో ఉంటున్న కాలనీని ఖాళీ చేయించి గ్రానైట్‌ తవ్వకాలు సాగిస్తున్న వైకాపా నేతలు
ఇళ్లు కట్టిస్తామని.. రేకుల షెడ్లలో వదిలేశారు
బాపట్ల జిల్లాలో నిరుపేద ఎస్టీల దుస్థితి
ఈనాడు - అమరావతి

నిరుపేద ఎస్టీలు ఉంటున్న స్థలంలో ఖనిజ సంపద ఉందని తెలుసుకున్న అధికార పార్టీ నేతలు ఆ కాలనీపై కన్నేశారు. వారిని నమ్మించి మూడేళ్ల క్రితం ఖాళీ చేయించారు. అక్కడ గ్రానైట్‌ తవ్వకాలు చేపట్టి రూ.కోట్లు ఆర్జించారు. భూములిచ్చిన పేదలను గాలికొదిలేశారు. గూడు కోల్పోయిన 75 ఎస్టీ కుటుంబాలు వైకాపా నేతలకు భయపడి అసౌకర్యాల మధ్య అగ్గిపెట్టెల్లాంటి షెడ్లల్లో గడిపేస్తున్నారు. బాపట్ల జిల్లా బల్లికురవ మండలం పాతమల్లాయిపాలెం పరిధిలో పేద కుటుంబాలకు గతంలో నాటి పాలకులు ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఓ ఎన్జీవో పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చింది. అద్దంకి నియోజకవర్గ వైకాపా నాయకుడొకరు, మరికొంతమంది ముఖ్య నాయకులు ఆ బడుగు జీవులను ఖాళీ చేయించి ఆ భూముల్లోని గ్రానైట్‌ను కొల్లగొట్టాలనుకున్నారు. ఇందుకు ఎన్నో ఎత్తులు వేశారు. తొలుత అక్కడ సరైన సౌకర్యాల్లేవు, ఖాళీ చేస్తే ప్రభుత్వమే మరోచోట భూమి కొని, ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇస్తుందని నమ్మించారు.

ఓ సారి స్థానికులను ఒంగోలుకు పిలిపించుకొని కొంత డబ్బు ఇచ్చారు. సౌకర్యాల్లేక అక్కడ ఉండలేకపోతున్నామని, వారితోనే అధికారులకు ఫిర్యాదు చేయించారు. ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించాలని కోరేలా చేశారు. ఆ మేరకు అధికారులు రెండెకరాలకుపైగా భూములు చూపారు. అందులో బాధితులకు ఇళ్ల స్థలాలు కేటాయించి ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారు. ఇప్పటికీ పూర్తి కాలేదు. విద్యుత్తు, నీటి వసతి కల్పించలేదు. ఇళ్లు నిర్మించేలోగా ఉండేందుకని నేతలు మూడేళ్ల కిందట 2 రేకుల షెడ్లు వేయించారు. ఇప్పటికీ చాలామంది అందులోనే తలదాచుకుంటున్నారు. ‘ఇళ్ల నిర్మాణం గురించి పట్టించుకోకుండా మమ్మల్ని వదిలేశారు. సామూహిక మరుగుదొడ్లు కట్టించారు. నీళ్లు పోయే మార్గం లేక షెడ్ల వద్ద దుర్వాసన వస్తోంది. 75 కుటుంబాలకు రెండే బోర్లు ఉన్నాయి. మమ్మల్ని ఖాళీ చేయించి.. వైకాపా నాయకులు గ్రానైట్‌తో రూ.కోట్లు దిగమింగుతున్నార’ని నిరుపేదలు వాపోతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని