Bandaru Satyanarayana: తెదేపా నేత బండారు అరెస్టు

ఉగ్రవాద శిబిరంపై దాడి చేస్తున్నట్లుగా అర్ధరాత్రి వేళ వందల మంది పోలీసులు మోహరించారు.. ఇంటి గోడలు దూకి... కిటికీల గ్రిల్స్‌ తొలగించి గది లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే వారి దౌర్జన్యాన్ని తెదేపా కార్యకర్తలు అభిమానులు అడ్డుకున్నారు.

Updated : 03 Oct 2023 08:27 IST

ఉద్రిక్తతల నడుమ అదుపులోకి..
22 గంటల పాటు నాటకీయ పరిణామాలు
గ్రామాన్ని దిగ్బంధించి.. ఇంటి గోడలు దూకి చొరబడ్డ పోలీసులు
కిటికీల గ్రిల్స్‌ తొలగించి గది లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నం
మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారని అరెస్టు
సీఎం జగన్‌ను దూషించారంటూ సీఆర్‌పీసీ 41ఏ నోటీసులు

ఈనాడు - విశాఖపట్నం, న్యూస్‌టుడే - పరవాడ: ఉగ్రవాద శిబిరంపై దాడి చేస్తున్నట్లుగా అర్ధరాత్రి వేళ వందల మంది పోలీసులు మోహరించారు.. ఇంటి గోడలు దూకి... కిటికీల గ్రిల్స్‌ తొలగించి గది లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే వారి దౌర్జన్యాన్ని తెదేపా కార్యకర్తలు అభిమానులు అడ్డుకున్నారు. వెరసి నాటకీయ పరిణామాలు, తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నాయకుడు బండారు సత్యనారాయణమూర్తి(Bandaru Satyanarayana)ని గుంటూరు జిల్లా నగరంపాలెం పోలీసులు సోమవారం రాత్రి 8 గంటల  సమయంలో అరెస్టు చేసి రోడ్డు మార్గంలో గుంటూరుకు తీసుకువెళ్లారు.

ఆదివారం రాత్రి నుంచే హల్‌చల్‌

ఆదివారం రాత్రి 10 గంటల నుంచే బండారు సత్యనారాయణమూర్తి స్వగ్రామమైన వెన్నెలపాలెంను చుట్టుముట్టిన పోలీసు బలగాలు దాదాపు 22 గంటల పాటు ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలో ఉంచుకుని చివరికి సోమవారం రాత్రి ఆయన్ను అరెస్టు చేశాయి. మంత్రి రోజాపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బడి మంజుల చేసిన ఫిర్యాదుపై నమోదైన కేసులో బండారును అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి జగన్‌ను దూషించారంటూ గుంటూరులోని అరండల్‌పేట ఎస్సై టి.నాగరాజ్‌ ఇచ్చిన ఫిర్యాదుపై ఆ పోలీసుస్టేషన్‌లో నమోదైన మరో కేసులో బండారు సత్యనారాయణమూర్తికి సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులిచ్చారు. ఆయన్ను అరెస్టు చేసే క్రమంలో పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదమైంది.

గ్రామాన్ని పూర్తిగా దిగ్బంధించి...

బండారు సత్యనారాయణమూర్తిని అరెస్టు చేయడం కోసం ఆదివారం రాత్రి 10 గంటలకే పోలీసులు వెన్నెపాలెం గ్రామానికి చేరుకున్నారు. బయటి వారెవరూ ఊళ్లోకి రాకుండా 5 కి.మీ.ల దూరంలోనే బారికేడ్లు పెట్టి నిలువరించారు. ఆయన ఇంటి చుట్టూ వందల మంది పోలీసులను ఉంచి ఆ దరిదాపుల్లోకి ఎవరూ రాకుండా చేశారు. మీడియా ప్రతినిధులనూ లోపలికి వెళ్లనీయకుండా ఆంక్షలు విధించారు. ఆదివారం రాత్రి పోలీసులు వచ్చిన సమయంలో బండారు సత్యనారాయణమూర్తి, ఆయన భార్య మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఆ రాత్రి వేళ పరవాడ సీఐ ఆధ్వర్యంలోని పోలీసు బృందం బండారు ఇంటికి వెళ్లి తలుపులు కొట్టింది. ఎవరూ బయటకు రాకపోవటంతో పోలీసులు అక్కడే ఉండిపోయారు. విషయం తెలుసుకున్న స్థానికులు, తెదేపా శ్రేణులు బండారు ఇంటి వద్దకు చేరుకున్నారు. దీంతో మరింత మంది పోలీసులు అక్కడికి చేరుకుని బయట వ్యక్తులు ఎవరూ రాకుండా అడ్డుకున్నారు. సోమవారం ఉదయం స్థానిక డీఎస్పీ.. బండారు సత్యనారాయణమూర్తి ఇంట్లోకి వెళ్లి గుంటూరు జిల్లాలో నమోదైన కేసుకు సంబంధించి అరెస్టు చేయడానికి తాము వచ్చామని, సహకరించాలని ఆయన్ను కోరారు. నోటీసులు చూపించాలని బండారు కోరడంతో పోలీసులు అవేమి చూపించకుండా బయటకు వచ్చేశారు. సీఆర్‌పీసీ 41ఏ నోటీసులు ఇవ్వటానికి ఎందుకు ఇంత అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని తెదేపా న్యాయ విభాగానికి చెందిన న్యాయవాదులు ప్రశ్నించగా పోలీసులు నీళ్లు నమిలారు. మంత్రి రోజా మీద అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన కేసు విషయంలో అరెస్టు చేయటానికి వచ్చామని తొలుత చెప్పిన పోలీసులు. ఆ తర్వాత సీఎం జగన్‌ను దూషించారంటూ మరో కేసు కూడా బండారుపై నమోదైందని చెప్పారు.

ఇంటి గోడలు దూకి.. తలుపులు బాది

బండారును అదుపులోకి తీసుకునే క్రమంలో కొంతమంది పోలీసులు ఆయన ఇంటి గోడలు దూకి లోపలికి ప్రవేశించారు. ఆయన ఇంటి తలుపులను బాదారు. కిటికీల గ్రిల్స్‌ తీసి లోపలికి వెళ్లేందుకు యత్నించారు. చివరికి బండారు తలుపులు తీయడంతో అయిదుగురు పోలీసు అధికారులు లోపలికి వెళ్లి సుమారు అరగంట పాటు ఆయనతో మాట్లాడారు. అనంతరం అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించి అక్కడి నుంచి  గుంటూరుకు తరలించారు. అంతకు ముందు తెదేపా శ్రేణులు పోలీసులను అడ్డగించారు. బండారు ఇంటి వైపు ఎవరూ రాకుండా నియంత్రించారు. ద్వారాల వద్ద అడ్డంగా కూర్చున్నారు. దీంతో అక్కడికి పోలీసులు భారీగా చేరుకొని వారందర్నీ తాళ్లతో పక్కకు లాగేసి లోపలికి వెళ్లారు.

అంబులెన్స్‌ను పంపించకుండా..

తెదేపా ఇచ్చిన పిలుపుమేరకు ఇంట్లోనే బండారు సోమవారం దీక్ష చేపట్టారు. ఆ సమయంలో ఆయన వద్దకు పార్టీ నేతలు ఒక్కొక్కరు చేరుకున్నారు. విశాఖ, అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, జగదీశ్వరరావు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు,  ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు,  వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, ఎమ్మెల్సీలు చిరంజీవిరావు, దువ్వారపు రామారావు, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి ఆయన్ను కలిసి సంఘీభావం తెలిపారు. ఇంతలో బండారు కొంత నీరసించడంతో వైద్యుడిని పిలిపించి వైద్య పరీక్షలు జరిపారు. మధుమేహం, రక్తపోటు అధికంగా ఉండడంతో అంబులెన్స్‌ రప్పించి ఇతర వైద్య పరీక్షలు చేయాలనుకున్నారు. లోపలికి అంబులెన్స్‌ రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. అనారోగ్యంగా ఉన్నా పంపించకపోవడంపై నాయకులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ సమయంలో నాయకులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అంబులెన్స్‌ను పంపితే పోలీసులకు ఇబ్బందేమిటని ప్రశ్నించారు. డీఎస్పీని కోరినా వదల్లేదు. ఎమ్మెల్యే వెలగపూడి, ఎమ్మెల్సీ చిరంజీవి, మాజీ ఎమ్మెల్యేలు పీలా గోవింద్‌ సత్యనారాయణ, గండి బాబ్జిలు ఎందుకు పంపించరని ప్రశ్నించడంతో.. సెక్షన్‌ 30 అమల్లో ఉంది కెమెరాలు ఆన్‌లో ఉన్నాయి. జాగ్రత్త అని డీఎస్పీ వారితో అనడంతో ఎవర్ని బెదిరిస్తారని వారు ప్రశ్నించారు. అప్పటికీ అంబులెన్స్‌ను వదలకపోవడంతో నాయకులే దారికి అడ్డంగా పెట్టిన గేట్లను తొలగించే ప్రయత్నం చేసినా పోలీసులు వదల్లేదు. దీంతో ఆగ్రహించిన నాయకులు ప్రైవేటు స్థలంలోకి ఇంతమంది పోలీసులు ఎందుకు వచ్చారని ఎదురు ప్రశ్నించారు.

తోపులాటలు.. వాగ్వాదాలు

అనకాపల్లి జిల్లా అదనపు ఎస్పీతో కలిసి గుంటూరు నుంచి నోటీసులతో వచ్చిన పోలీసులు ఇంటి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా అక్కడే ఉన్న అభిమానులు అడ్డుకున్నారు. అక్కడే ఉన్న మహిళలు ముందుకొచ్చి పోలీసులు రాకుండా ముందుకు నెట్టారు. దీంతో పోలీసులు వారిని తీవ్రంగా ప్రతిఘటించారు. లాఠీలను అడ్డుపెట్టి పలుమార్లు నెట్టేశారు. ఈ తోపులాట మధ్య పలువురు కింద పడిపోయారు. ఒక్కసారిగా పోలీసులు లోపలికి వెళ్లడానికి ప్రయత్నించగా కార్యకర్తలంతా నినాదాలు చేసుకుంటూ ముందుకు నెట్టారు. దీంతో అక్కడున్న పోలీసులు చెల్లాచెదురైపోయారు. కొందరు మరో మార్గంలో లోపలికి వెళ్తుండగా వారిని వెళ్లనీయలేదు. మధ్యాహ్నం నుంచి పలుమార్గాలు ద్వారా లోపలికి వెళ్లడానికి పోలీసులు ప్రయత్నించినా అన్ని వైపులా కార్యకర్తలు ఉండడంతో వెళ్లలేకపోయారు. ఈ సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంతలో బండారు సత్యనారాయణమూర్తి కుమారుడు అప్పలనాయుడు దిల్లీ నుంచి  ఇంటికి చేరుకున్నారు.  ఎంతకీ కార్యకర్తలు లోపలికి వదలక పోవడంతో పోలీసులు అన్ని వైపుల నుంచి రోప్‌ పార్టీలను దించి ఎక్కడికక్కడ కార్యకర్తలను నియంత్రించారు.

రెండు కేసులు

బండారు సత్యనారాయణమూర్తిపై లైంగిక వేధింపులు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఉద్దేశంతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు, నేరపూరిత బెదిరింపు, విద్వేషాలు రెచ్చగొట్టడం తదితర అభియోగాలపై నగరంపాలెం పోలీసుస్టేషన్‌లో ఐపీసీ సెక్షన్‌ 354ఏ, 153ఏ, 504, 505, 506, 509, 499, ఐటీ చట్టంలోని సెక్షన్‌ 67 కేసు నమోదైంది. సీఎం జగన్‌ను దూషించారంటూ ఐపీసీ 294, 504, 505తో పాటు ఐటీ చట్టం సెక్షన్‌ 67 కింద మరో కేసు నమోదైంది.

పోలీసులపై సత్యనారాయణమూర్తి సతీమణి ఫిర్యాదు

పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించడంపై బండారు సత్యనారాయణమూర్తి భార్య మాధవీలత పరవాడ పోలీసు స్టేషన్‌లో  పోలీసుల మీద ఫిర్యాదు చేశారు. ‘ఆదివారం రాత్రి సీఐ ఈశ్వరరావుతో పాటు మరో పది మంది సీఐలు, 200 మంది పోలీసులు ఇంటికి వచ్చి భయభ్రాంతులకు గురిచేశారు. ఇంట్లోకి ఎవ్వరినీ రానీయకుండా చేశారు. మధుమేహం ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పటికీ మమ్మల్ని బయటకు వెళ్లనీయలేదు. గ్రామంతో పాటు ఇంటి చుట్టూ అధిక సంఖ్యలో పోలీసులు చేరి భయభ్రాంతులకు గురయ్యేలా చేశారు’ అని ఫిర్యాదు చేయగా ముందుగా ఫిర్యాదు తీసుకున్నట్లు తీసుకొని కేసు నమోదు చేయలేదు. కనీసం రశీదు ఇమ్మని చెప్పినా ఇవ్వలేదని ఆమె మీడియాకు వివరించారు.

గాంధీ జయంతి రోజు హింసాత్మకంగా..

పోలీసులు 22 గంటల పాటు నిర్బంధించి అప్రజాస్వామికంగా వ్యవహరించిన తీరు దారుణమని బండారు సత్యనారాయణమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టు చేసి తీసుకువెళ్తుండగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గాంధీ జయంతి రోజున అన్యాయంగా అక్రమంగా ఏ కారణం లేకుండా అరెస్టు చేశారన్నారు. ‘ఇది దుర్మార్గ పాలన. వైకాపా నాయకులు ఎన్ని తిట్టారు. పార్టీ అధినేత చంద్రబాబు భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణిని ఎన్ని రకాలుగా దూషించారు. అప్పుడు పోలీసులకు ఇవేమీ కనిపించలేదా’ అని ఆయన ప్రశ్నించారు.  బండారు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.


‘బండారు’ అక్రమ నిర్బంధంపై హైకోర్టులో అత్యవసరంగా వ్యాజ్యం

ఈనాడు, అమరావతి: తెదేపా సీనియర్‌ నేత బండారు సత్యనారాయణ మూర్తిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని పేర్కొంటూ ఆయన సోదరుడు బండారు సింహాద్రిరావు సోమవారం అత్యవసరంగా(హౌజ్‌మోషన్‌) హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపేందుకు సిద్ధమవుతున్న దశలో సత్యనారాయణకు పోలీసులు నోటీసు ఇచ్చినట్లు హైకోర్టు రిజిస్ట్రీ ద్వారా సంబంధిత ధర్మాసనానికి సమాచారం అందింది. దీంతో విచారణ జరిపేందుకు ధర్మాసనం నిరాకరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని