పశువులూ అల్లాడుతున్నాయ్‌!

నోరులేని మూగజీవులు మనల్నేమైనా అడగొచ్చాయా? అనే ధైర్యం... మనుషులకే వైద్యాన్ని అందించలేకపోతున్నాం... ఇక పశువుల్ని ఏం పట్టించుకుంటాం? అనే దైన్యం... ఇదీ వైకాపా పాలనలో దుస్థితి.

Published : 28 Nov 2023 04:03 IST

వైకాపా పాలనలో.. పడకేసిన పశువైద్యం
రెండు, మూడు ఆసుపత్రులకు ఒక డాక్టర్‌
3,300 మందికిపైగా వైద్యులు అవసరం
పోస్టుల భర్తీ ఊసెత్తని సీఎం జగన్‌
ఈనాడు, అమరావతి

నోరులేని మూగజీవులు మనల్నేమైనా అడగొచ్చాయా? అనే ధైర్యం... మనుషులకే వైద్యాన్ని అందించలేకపోతున్నాం... ఇక పశువుల్ని ఏం పట్టించుకుంటాం? అనే దైన్యం... ఇదీ వైకాపా పాలనలో దుస్థితి. అధికారంలోకి రావడంతోనే పశువైద్యాన్ని జగన్‌ పక్కన పెట్టేశారు. వైద్యుల కొరత వెంటాడుతున్నా.. చికిత్స అందక మూగజీవులు ప్రాణాల్ని కోల్పోతున్నా.. రైతులు రూ.లక్షల్లో నష్టపోతున్నా.. పట్టించుకోవడమే మానేశారు. ‘పశువుకు ఒక కాంపౌండర్‌ వైద్యం చేయడం వేరు, ఒక డాక్టర్‌ వైద్యం చేయడం వేరు’ అని పలికిన జగన్‌.. అధికారంలోకి వచ్చాక ఆ ముచ్చటే మరిచారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేశాం అని చెబుతూ... పశువుల వైద్యానికి మొండిచేయి చూపిస్తున్నారు. పశు గణాంకాల ఆధారంగా రాష్ట్రంలో 3,300 మందికి పైగా వైద్యులు అవసరం. నాలుగున్నరేళ్లలో ఒక్క పోస్టునూ భర్తీ చేయలేదు. పాలవెల్లువ పేరుతో సహకార పాడిరంగాన్ని అమూల్‌కు అప్పజెప్పిన జగన్‌... మరోసారి అధికారంలోకి వస్తే అమూల్‌కు పాలను ఇచ్చే పశువులకే వైద్యం అంటారేమో? పశుసంవర్థక శాఖనూ ఆ సంస్థకే అప్పగిస్తారేమో?

ఇన్‌ఛార్జులే దిక్కు..

మేలు జాతి పశువును కొనాలంటే.. రూ.80 వేల నుంచి రూ.1 లక్ష అవుతుంది. ఒక్కో రైతు రెండు, మూడు పాడి పశువుల్ని పోషిస్తుంటారు. వాటికి ఏదైనా అనారోగ్యం వస్తే.. అధికశాతం గ్రామాల్లో వైద్యం అందించే పరిస్థితి లేదు. ప్రభుత్వ వైద్యులు అందుబాటులో ఉండటం లేదు. ఆర్‌బీకేల్లోని సహాయక సిబ్బందితో సర్దుకోవాలని సర్కారు చెబుతోంది. కొన్ని ప్రాంతాల్లో.. డెయిరీ యాజమాన్యాలే వైద్యుల్ని ఏర్పాటు చేసి సేవలందిస్తున్నాయి. పల్నాడు జిల్లా నూజెండ్ల మండల వైద్యుడికి వినుకొండ మండలం పిట్టంబండ బాధ్యతల్నీ అప్పగించారు. అంటే ఆయన రెండు మండలాలకు పని చేయాలి. శావల్యాపురం వైద్యుడిని కారుమంచి వైద్యశాలకు ఇన్‌ఛార్జిగా నియమించారు. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం మాఘంలో పనిచేసే వైద్యుడికి.. అయినవిల్లి, వీరవల్లిపాలెంతోపాటు కొత్తపేట మండలంలోని అవిడి, గంటి ఆసుపత్రుల ఇన్‌ఛార్జి బాధ్యతల్ని అప్పగించారు. రాష్ట్రంలో చాలాచోట్ల ఇలాంటి పరిస్థితి ఉంది. ‘రూ.లక్ష విలువైన ఆవు.. దూడ పుట్టాక అనారోగ్యానికి గురైంది. తమ పరిధిలోకి రాదంటే తమ పరిధిలోనిది కాదని వైద్యులు పట్టించుకోలేదు. పరిస్థితి విషమించి, ప్రైవేటు వైద్యులతో చికిత్స చేయించినా ఫలితం లేకపోయింది’ అని జిల్లా తనకల్లుకు చెందిన విజయ్‌కుమార్‌ ఆవేదన వెలిబుచ్చారు.

2,100 మందికి పైగా అవసరం 

రాష్ట్రంలో 1,576 వెటర్నరీ డిస్పెన్సరీలు,  323 పశు వైద్యశాలలు, 12 పాలీ క్లినిక్‌లు, 2 సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులున్నాయి. వెటర్నరీ కౌన్సిల్‌ నిబంధనల ప్రకారం ప్రతి 5 వేల యూనిట్లకు ఒక వైద్యుడి చొప్పున 3,300 మందికి పైగా పశువైద్యుల్ని నియమించాలి. రాష్ట్రంలో ప్రస్తుతం పనిచేసేది 1,610 మందే. వీరిలోనే ఏడీ, డీడీ, జేడీలు ఉన్నారు. వాస్తవానికి వారు పరిపాలనా పరమైన విధుల్నే నిర్వర్తిస్తారు. క్షేత్రస్థాయిలో వైద్యసేవల్ని అందించే పరిస్థితి లేదు. అయినా వారినీ పశువైద్యుల కిందనే చూపిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 1,610 మందికి పైగా సిబ్బందిలో సుమారు 400 మంది అలాంటి వారే. క్షేత్రస్థాయిలో పశువైద్య సేవలు అందించేది 1,200 మందే. 2,100 మందికిపైగా వైద్యుల పోస్టుల్ని భర్తీ చేయాలి. నియోజకవర్గ స్థాయి పశువ్యాధి నిర్ధరణ కేంద్రాలు 175 ఉన్నా వాటిలో వైద్యుల్ని నియమించలేదు.

పశువైద్య సేవలెలా?

వైకాపా అధికారంలోకి వచ్చాక రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి.. అక్కడ గ్రామ పశు సంవర్థక సహాయకుల్ని నియమిస్తూ వస్తోంది. వీరు పాలిటెక్నిక్‌, వృత్తి విద్యాకోర్సులు పూర్తి చేసినవారే. పశువులకు వైద్యం చేసే స్థాయి వీరికి ఉండదు. వాస్తవానికి డిప్లొమో కోర్సులు చేసిన వారు.. పశువైద్యుని ఆధ్వర్యంలో పనిచేయాలి. స్వతంత్రంగా వైద్యం చేసే దిశగా ప్రభుత్వం వారిని ప్రోత్సహిస్తోంది. వైద్యుల పోస్టుల భర్తీని పట్టించుకోకుండా తాత్సారం చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని