ప్రభుత్వం గొప్పలు.. పదిలో తిప్పలు

పదో తరగతి పరీక్షల్లో జిల్లా పరిషత్తు, పురపాలక, ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత తగ్గింది. సరాసరి ఉత్తీర్ణత 86.69 శాతంగా ఉంటే అత్యధికంగా విద్యార్థులు ఉండే జిల్లా పరిషత్తు బడుల్లో 79.38%మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు.

Updated : 23 Apr 2024 05:38 IST

రాష్ట్ర సరాసరి కంటే జడ్పీ, పురపాలక, ప్రభుత్వ బడుల్లో 8.11% తక్కువ ఉత్తీర్ణత
వీటిల్లో చదివిన 67,393 మంది విద్యార్థులు ఫెయిల్‌
ఐఎఫ్‌పీలు, టోఫెల్‌, బైజూస్‌ ట్యాబ్‌లంటూ హడావుడే తప్ప ఫలితాల్లో వెనుకంజే
నంద్యాల జిల్లా చెంచుగూడెం పాఠశాలలో సున్నా ఫలితాలు
చూచిరాతలుగా మారిన పాఠశాల స్థాయి పరీక్షలు.. వెలుగు చూడని అభ్యసన సామర్థ్యాలు

ఈనాడు, అమరావతి: పదో తరగతి పరీక్షల్లో జిల్లా పరిషత్తు, పురపాలక, ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత తగ్గింది. సరాసరి ఉత్తీర్ణత 86.69 శాతంగా ఉంటే అత్యధికంగా విద్యార్థులు ఉండే జిల్లా పరిషత్తు బడుల్లో 79.38%మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్ర సరాసరి కంటే ఇది 7.31% ఉత్తీర్ణత తగ్గింది. పురపాలిక బడుల్లో 24.58%, ప్రభుత్వ పాఠశాలల్లో 25.6% మంది ఫెయిల్‌ అయ్యారు. రాష్ట్రంలో ప్రైవేటు తర్వాత అత్యధికంగా పరీక్షలు రాసే విద్యార్థులు జడ్పీ బడుల్లోనే ఉంటారు. ఈసారి జడ్పీ పాఠశాలల్లో 53,053 మంది ఫెయిల్‌ అయ్యారు. పురపాలక, ప్రభుత్వ, జడ్పీ బడుల్లో కలిపి 3,14,663 మంది పరీక్షలు రాస్తే వీరిలో 2,47,270 (78.58%)మంది ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రంలో సరాసరి ఉత్తీర్ణత 86.69 శాతం కాగా..పురపాలక, జడ్పీ, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 78.58గా ఉంది. అంటే ఇది 8.11 శాతం తక్కువగా ఉండటం గమనార్హం. 67,393 మంది పరీక్షలు తప్పారు. ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానళ్లు(ఐఎఫ్‌పీ) ఏర్పాటు చేశాం.. బైజూస్‌ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌లు ఇచ్చాం.. టోఫెల్‌ పెట్టాం.. వచ్చే ఏడాది ఐబీ సిలబస్‌ తీసుకొస్తున్నామని జగన్‌ ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా.. పదో తరగతి ఫలితాల్లో పాఠశాలలు వెనుకబడే ఉంటున్నాయి. చాలా చోట్ల సబ్జెక్టు టీచర్ల కొరత ఉంది. ప్రభుత్వం కొత్తగా నియామకాలు చేపట్టకుండా ఉన్న వారినే సర్దుబాటు చేసింది. ఇది పూర్తి స్థాయిలో కాకపోవడంతో కొన్నిచోట్ల గణితం, సామాన్య శాస్త్రం, జీవశాస్త్రం లాంటి సబ్జెక్టులు చెప్పేందుకు ఉపాధ్యాయులు లేరు. ఇలాంటి చోట పిల్లలకు నాణ్యమైన చదువు అందడం లేదు. విద్యపై రూ.70 వేల కోట్లు ఖర్చు చేశామని గొప్పలు చెబితే సరిపోతుందా? ఉపాధ్యాయులు లేకుండా ఉత్తమ ఫలితాలు సాధించడం ఎలా సాధ్యమవుతుందనే ప్రశ్న వినిపిస్తోంది.

పాఠశాల స్థాయిలో ఉత్తుత్తి పరీక్షలే..

విద్యార్థుల సామర్థ్యాలను తెలుసుకునేందుకు ఉపయోగపడే ఫార్మెటివ్‌, సమ్మెటివ్‌ పరీక్షలను సైతం చూచిరాత పరీక్షలుగా ప్రభుత్వం మార్చేసింది. ప్రశ్నపత్రాల ముద్రణకు నిధులు లేక వాట్సప్‌ గ్రూపుల్లో పంపించడం, ముద్రించిన పత్రాలు ముందుగానే సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షం కావడం వైకాపా ప్రభుత్వంలో సాధారణంగా మారిపోయింది. ప్రశ్నపత్రాల లీకేజీని సైతం ప్రభుత్వం సమర్థించుకునే స్థాయికి దిగజారింది. ప్రశ్నపత్రం లీక్‌ అయినా ఏమీకాదని ఉన్నతాధికారులు వ్యాఖ్యానిస్తున్నారంటే బడుల్లో పరీక్షల నిర్వహణ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంలో అనుత్తీర్ణులైన వారికి రీఅడ్మిషన్లు కల్పిస్తామని ప్రభుత్వం చెప్పినా అభ్యర్థుల నుంచి స్పందన రాలేదు. రీ-అడ్మిషన్లు తీసుకున్న వారు అన్ని సబ్జెక్టులూ రాయాలనే నిబంధన పెట్టడం, తరగతులకు హాజరు కావాలని చెప్పడంతో ఎవరూ ఆసక్తి చూపలేదు. ఫెయిల్‌ అయిన సబ్జెక్టులకు మాత్రమే ఫీజులు చెల్లించారు. గతంలో ఫెయిల్‌ అయి ప్రైవేటుగా పరీక్షలు రాసిన 71,500 మందిలో 41.08శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు.

ఆగని సున్నా ఫలితాలు..

పదోతరగతిలో సున్నా ఫలితాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఒక్కరు కూడా ఉత్తీర్ణులుకాని పాఠశాలల సంఖ్య తగ్గుతున్నా ఇంకా వాటి సంఖ్య కొనసాగుతోంది. గత ఏడాది తొమ్మిది ప్రభుత్వ బడుల్లో ఒక్కరూ పాస్‌ కాకపోగా.. ఈ ఏడాది ఒక పాఠశాలలో ఎవరూ ఉత్తీర్ణులు కాలేదు. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం బైర్లూటీ చెంచుగూడెంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు పరీక్ష రాయగా.. ముగ్గురూ ఫెయిల్‌ అయ్యారు. చెంచుగూడెంలో అక్షరాస్యత తక్కువగా ఉంటుంది. ఇలాంటి చోట అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలి. కానీ, అధికారులు పట్టించుకోకపోవడంతో సున్నా ఫలితాలు వచ్చాయి. మొత్తం ఈ పాఠశాలలో నలుగురు విద్యార్థులు పదిలో ఉండగా.. ఒకరు పరీక్షలకే హాజరు కాలేదు. చెంచుల విద్యపై ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధ ఎలా ఉందో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. మరో 3 ఎయిడెడ్‌ బడుల్లోనూ ఒక్కరూ పాస్‌ కాలేదు.

గతం కంటే తక్కువే..

రాష్ట్రంలో 2019కి ముందుతో పోలిస్తే పదో తరగతి పరీక్షల ఫలితాలు తగ్గాయి. 2019లో 94.88శాతం మంది ఉత్తీర్ణత సాధించగా.. ఈసారి 86.69 శాతం మంది పాస్‌ అయ్యారు. గత మూడేళ్లుగా ఉత్తీర్ణత శాతం క్రమంగా పెరుగుతున్నా 2019కు ముందున్న స్థాయిలో విద్యార్థులు పాస్‌ కావడం లేదు. 2015 నుంచి 2019 వరకు 91 శాతానికిపైగా విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 2020, 2021లో కొవిడ్‌ కారణంగా పరీక్షలు నిర్వహించలేదు. అందరినీ పాస్‌ చేశారు. 2022 నుంచి క్రమంగా పెరుగుతున్నా 2019 ముందు కంటే ఎక్కువ ఉత్తీర్ణత లభించలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని