ఏం చేశారని జిల్లాకొస్తున్నారు?

తెల్లారిలేస్తే 99% హామీలు నెరవేర్చిన ప్రభుత్వం తమదేనని సీఎం జగన్‌ డబ్బా కొట్టుకుంటారు. అయిదేళ్లలో మీ కుటుంబానికి మేలు జరిగిందనుకుంటేనే మీ బిడ్డకు మద్దతివ్వండని ముఖంలో అమాయకత్వం ప్రదర్శిస్తూ సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తారు.

Updated : 23 Apr 2024 12:47 IST

తెదేపా ప్రభుత్వంలో చేసిన పనులకే మళ్లీ శంకుస్థాపనలు చేశారు..
రూపాయి డబ్బులివ్వకుండా వాటిని పక్కనెట్టేశారు
గత ఎన్నికల్లో నమ్మకంతో గెలిపిస్తే ఇలాగేనా చేసేది?
ఏ ముఖం పెట్టుకుని మళ్లీ ఓట్లడుగుతారు?
నేడు ఉమ్మడి విజయనగరం జిల్లాకు ముఖ్యమంత్రి జగన్‌

అన్నదాతలు బాగుంటేనే దేశం, రాష్ట్రం బాగుంటుంది. ప్రభుత్వాలు బలంగా ఉంటాయి. రాజశేఖరరెడ్డి బిడ్డ అధికారంలోకి వస్తే తోటపల్లి కుడి, ఎడమ కాలువలు పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తా    

2018లో విజయనగరం జిల్లాలో నిర్వహించిన పాదయాత్రలో జగన్‌ రైతులకు ఇచ్చిన హామీ ఇది.


ఈనాడు-అమరావతి, విజయనగరం: తెల్లారిలేస్తే 99% హామీలు నెరవేర్చిన ప్రభుత్వం తమదేనని సీఎం జగన్‌ డబ్బా కొట్టుకుంటారు. అయిదేళ్లలో మీ కుటుంబానికి మేలు జరిగిందనుకుంటేనే మీ బిడ్డకు మద్దతివ్వండని ముఖంలో అమాయకత్వం ప్రదర్శిస్తూ సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తారు. ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రజలకు పాదయాత్రలో హామీలు కురిపించిన జగన్‌.. అధికారంలోకి వచ్చాక ఒక్కటంటే ఒక్కటీ అమలు చేయలేదు. గత తెదేపా ప్రభుత్వంలో చేసిన పనులకే మళ్లీ శంకుస్థాపనలు చేసి హడావుడి చేశారు తప్ప పనుల్లో ముందడుగు లేదు. కీలకమైన తోటపల్లి ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల పనులు చేస్తామని చెప్పి గత తెదేపా హయాంలో మంజూరు చేసిన పనులే నిలిపేశారు. ‘ఎన్నికలకు ఆర్నెల్ల ముందు టెంకాయ కొడితే మోసమంటారు. అధికారంలోకి వచ్చిన ఆర్నెల్లకే టెంకాయ కొడితే చిత్తశుద్ధి అంటారు’ అంటూ సూక్తిముక్తావళి వినిపించిన జగన్‌.. నాలుగేళ్లపాటు జాప్యం చేసి ఎన్నికలకు ఏడాది ముందు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులకు శంకుస్థాపన చేశారు. దీన్ని ఏం చిత్తశుద్ధి అంటారో ఆయనకే తెలియాలి. ఇదీ గత సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేసిన ప్రాజెక్టే. ఈపాటికే భవన నిర్మాణం పూర్తి కావలసిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని జిల్లాలోని వేరొక చోటుకు మార్చేసి భ్రష్టు పట్టించారు. రైతులకు సాగు, విజయనగరం ప్రజలకు తాగునీరు అందించే తారకరామతీర్థసాగర్‌ ప్రాజెక్టునూ పాడుబెట్టారు. కీలకమైన ప్రాజెక్టులకు నిధులివ్వకుండా పక్కనపెట్టిన ముఖ్యమంత్రి జగన్‌ ఏం అభివృద్ధి చేశారని చెప్పడానికి జిల్లాకు మళ్లీ వస్తున్నారు? ఏం చెప్పినా తలూపుతూ ప్రజలు వింటారన్న ధీమా? కల్లబొల్లి కబుర్లు చెప్పి మరోసారి మోసం చేయాలనుకుంటున్నారా?

తోటపల్లి ప్రాజెక్టు పూర్తికి నిధులివ్వకుండా రైతులకు దగా

నాగావళిపై తోటపల్లి ప్రాజెక్టు పూర్తికి బడ్జెట్‌లో కేటాయింపులు కాగితాలకే పరిమితమయ్యాయి. ప్రాజెక్టుపై సమీక్షించే తీరిక సీఎంకే కాదు.. జిల్లా మంత్రులకూ లేకపోయింది. ఇప్పటికీ పునరావాస సమస్యలు వెంటాడుతున్నాయి. అసంపూర్తి పనులు వెక్కిరిస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో సుమారు రెండు లక్షల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో నాగావళిపై తోటపల్లి వద్ద జలాశయం నిర్మాణానికి తెదేపా హయాంలో అప్పటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. దీంతోపాటు తోటపల్లి రెగ్యులేటర్‌ కింద సాగవుతున్న 64 వేల ఎకరాలకు సాగునీటిని స్థిరీకరించాలని నిర్ణయించారు. శ్రీకాకుళం జిల్లాలోని 132 గ్రామాల పరిధిలో 64,036 ఎకరాలకు, ఉమ్మడి విజయనగరం జిల్లాలోని 155 గ్రామాల్లో 67,912 ఎకరాలకు సాగునీరందించాలని లక్ష్యంగా నిర్దేశించారు. గజపతినగరం బ్రాంచి కాలువ ద్వారా మరో పది వేల ఎకరాలకు సాగు నీరందించాలని నిర్ణయించారు. ఆ తరువాత వచ్చిన రాజశేఖరరెడ్డి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సత్వర సాగునీటి ప్రయోజన పథకం (ఏఐబీపీ)లో చేర్చినా పనులు ముందుకెళ్లలేదు. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.480 కోట్ల నుంచి రూ.800 కోట్లకు పెరిగింది. 2014-19 మధ్య తెదేపా హయాంలో ప్రాజెక్టు పనులకు రూ.287 కోట్లు వెచ్చించారు. 2019 నుంచి వైకాపా ప్రభుత్వం రూ.465 కోట్లు కేటాయించి రూ.61 కోట్లే వెచ్చించింది.


తారకరామతీర్థసాగర్‌ను అటకెక్కించారు

తారకరామతీర్థసాగర్‌ పనులు రెండేళ్లలో పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని 2020 డిసెంబరులో సీఎం జగన్‌ హామీనిచ్చి మాట తప్పారు. పెండింగ్‌ పనుల పూర్తికి రూ.620 కోట్లు మంజూరు చేస్తానని చెప్పి అరకొరగా రూ.50 కోట్లు ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. పూసపాటిరేగ, డెంకాడ, భోగాపురం మండలాల్లోని 49 గ్రామాల్లో 24,710 ఎకరాలకు సాగు నీరు, విజయనగరానికి తాగునీరు అందించేలా తారకరామతీర్థసాగర్‌ ప్రాజెక్టును రూపొందించారు. గుర్ల మండలం కోటగండ్రేడు వద్ద చంపావతి నదిపై బ్యారేజీ, కుమిలిలో జలాశయం పనులు పూర్తి కాలేదు. మిగిలిన భూసేకరణ, పునరావాస కార్యకలాపాలపై నిర్లక్ష్యం చేశారు. ప్రాజెక్టు నిర్మాణంతో భూములు, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులు రెండు వేల మందికిపైగా ఉన్నారు. రైతులతోపాటు ఆ భూములపై ఆధారపడ్డ వ్యవసాయ కూలీలు జీవనోపాధి కోల్పోయారు. గత ఎన్నికల్లో ప్రస్తుత నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు వైకాపా అధికారంలోకి వస్తే నిర్వాసిత కుటుంబాలకు ప్రత్యేక ప్యాకేజీ అమలు చేయిస్తానని మోసం చేశారు. దీంతో ఆగ్రహించిన రైతులు ఇటీవల సారిపల్లి వెళ్లిన ఎమ్మెల్యే అప్పలనాయుడు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ను నిలదీశారు.


గాల్లోనే భోగాపురం జాతీయ విమానాశ్రయం చక్కర్లు

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులను జగన్‌ ప్రభుత్వం నాలుగేళ్లు పక్కనపెట్టి ఎన్నికలకు ఏడాది ముందు హడావుడి చేసింది. విమానాశ్రయాన్ని పీపీపీ విధానంలో పూర్తి చేయాలని తెదేపా హయాంలో నిర్ణయించారు. 2019 ఫిబ్రవరి 14న అప్పటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఆ తరువాత వచ్చిన వైకాపా సర్కారు సుమారు నాలుగేళ్లపాటు దీని ఊసెత్త లేదు. ఎట్టకేలకు గతేడాది మే 3న ముఖ్యమంత్రి జగన్‌ విమానాశ్రయ పనులకు మళ్లీ శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం సేకరించిన సుమారు 2,700 ఎకరాల్లో 500 ఎకరాలను ప్రభుత్వ ఆధీనంలో ఉంచుకుని మిగిలిన 2,200 ఎకరాలను విమానాశ్రయం నిర్మాణానికి కేటాయించారు. విమానాశ్రయానికి భూములిస్తే పరిహారంతోపాటు అర్హులైన వారికి ఉపాధి కల్పిస్తామన్న మాటలు నీటిమూటలయ్యాయి. నిర్వాసితులకు ఇచ్చిన పరిహారం కొత్త ఇళ్ల పునాదుల పనులకే సరిపోలేదు. వలస వెళ్లిన వారికి, గ్రామాలు ఖాళీ చేసేనాటికి 18 ఏళ్లు నిండిన వారికి ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కల్పిస్తామనీ మోసం చేశారు.


కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి గ్రహణం

విభజన చట్టంలో రాష్ట్రానికి దక్కిన ప్రతిష్ఠాత్మక కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం నిర్మాణ పనులు సీఎం జగన్‌ నిర్వాకంతో ఇప్పటికీ పూర్తి కాలేదు. తెదేపా హయాంలో రూపొందించిన ప్రణాళికను యథాతథంగా అమలుచేసి ఉంటే ఈపాటికే భవనం అందుబాటులోకి వచ్చేది. తెదేపా హయాంలో విజయనగరం జిల్లా కొత్తవలస మండలం రెల్లిలో విశ్వవిద్యాలయాన్ని నిర్మించాలని నిర్ణయించారు. 526 ఎకరాలు సేకరించి శంకుస్థాపన చేశారు. భూమి చుట్టూ రూ.10 కోట్లతో ప్రహరీ నిర్మించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక వర్సిటీ ఏర్పాటు విషయంలో సీఎం జగన్‌ అక్కసుతో వ్యవహరించారు. చంద్రబాబు శంకుస్థాపన చేసిన చోట కాకుండా గిరిజన ప్రాంతంలో నిర్మిస్తామని చెప్పి మెంటాడ మండలం కుంటినవలస సమీపంలో గతేడాది ఆగస్టు 25న కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రదాన్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. మళ్లీ భూములు సేకరించి రూ.కోట్ల పరిహారం చెల్లించారు. ఇందులో వైకాపా కీలక ప్రజాప్రతినిధులు, అధికారులు కుమ్మక్కై పరిహారం సొమ్ము పక్కదారి పట్టించారు. శంకుస్థాపన జరిగినా పనుల్లో ముందడుగు పడలేదు. తెదేపా హయాంలో రూ.525.08 కోట్లతో వేసిన అంచనా వ్యయం.. పనుల్లో జాప్యంతో రూ.834 కోట్లకు పెరిగింది. కొత్తవలస మండలంలో గుర్తించిన ప్రాంతం విశ్వవిద్యాలయం ఏర్పాటుకు అనుకూలమేనని కేంద్ర మానవవనరుల మంత్రిత్వశాఖ స్థల ఎంపిక కమిటీ చెప్పినా అక్కడినుంచే మార్చేందుకే సీఎం జగన్‌ నిర్ణయించారు. దీంతో రెల్లిలో సేకరించిన స్థలంలో ప్రహరీ నిర్మాణానికి వెచ్చించిన రూ.10 కోట్లు బూడిదలో పోసిన పన్నీరయ్యాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని