హామీలకు శిలువ!

గత ఎన్నికలకు ముందు.. మ్యానిఫెస్టో అనే పదానికి తానే తొలిసారిగా అర్థం కనిపెట్టినట్లు చెప్పారు జగన్‌. దాన్ని బైబిల్‌తో పోల్చి ప్రచారం చేశారు. క్రైస్తవుల ఓట్లు దండుకుని గద్దెనెక్కారు. తీరా చూస్తే.. ఈ ఐదేళ్ల పాలనలో అదే బైబిల్‌ను దైవసమానంగా చూసే క్రైస్తవులను జగన్‌ వంచించారు.

Published : 24 Apr 2024 04:09 IST

మ్యానిఫెస్టోను బైబిల్‌తో పోల్చి బీరాలు పలికిన జగన్‌
క్రైస్తవులకు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయని వైనం
ఓటు బ్యాంకు అంటూనే పోటు వేసిన దుర్మార్గ ప్రభుత్వమిదీ..  
ఐదేళ్లలో 199 మందికి మాత్రమే పెళ్లికానుక
మరోసారి మోసపోయేందుకు సిద్ధంగా లేమంటున్న మైనారిటీలు
ఈనాడు, అమరావతి

వారూ వీరూ అనే తేడా లేదు..
వంచనలో ఆయన్ను మించిన వారే లేరు..
హామీల పేరిట అరచేతిలో స్వర్గం చూపించారు..
వాటి అమలులోనూ వారిని ‘మైనారిటీలు’గానే చూశారు..
ఏ రకంగానూ ఆదుకోకుండా మోసం చేశారు..
గతమెంతో ఘనమనుకునేలా పాలన సాగించారు.  

పెళ్లికానుక హుళక్కే..  

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లో ఆడపిల్లల వివాహాలు చేసేందుకు తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని చూసి తెదేపా ప్రభుత్వం పెళ్లికానుక పథకాన్ని తీసుకొచ్చింది. అందులో భాగంగానే క్రైస్తవ యువతుల వివాహాలకు కూడా రూ.50 వేల ఆర్థిక సాయాన్ని అందించింది. దీనికోసం ప్రత్యేకంగా కల్యాణమిత్రలను నియమించి మరీ.. పాలనా కాలంలో దాదాపు 5 వేల మందికి లబ్ధి చేకూర్చింది. పెళ్లికానుక ఆర్థికసాయాన్ని పెంచుతామని మ్యానిఫెస్టోలో పెట్టిన జగన్‌.. అధికారంలోకి వచ్చాక దాన్ని ఎగ్గొంట్టేందుకు ఎన్ని కుయుక్తులు పన్నాలో  అన్నింటినీ ప్రయోగించారు.


త ఎన్నికలకు ముందు.. మ్యానిఫెస్టో అనే పదానికి తానే తొలిసారిగా అర్థం కనిపెట్టినట్లు చెప్పారు జగన్‌. దాన్ని బైబిల్‌తో పోల్చి ప్రచారం చేశారు. క్రైస్తవుల ఓట్లు దండుకుని గద్దెనెక్కారు. తీరా చూస్తే.. ఈ ఐదేళ్ల పాలనలో అదే బైబిల్‌ను దైవసమానంగా చూసే క్రైస్తవులను జగన్‌ వంచించారు. తనకు ఓటు బ్యాంకుగా నిలుస్తున్నారని   భావించిన వారి విషయంలోనే ఇంత కర్కశంగా వ్యవహరించారంటే.. ఆయన అసలు నైజం ఏంటో అర్థం చేసుకోవచ్చు.   ప్రధాన హామీల్లో ఏ ఒక్కటీ సరిగ్గా నెరవేర్చకుండానే.. 99 శాతం అమలు చేశామని నిస్సిగ్గుగా చెబుతుండటం జగన్‌కే చెల్లింది.


పాస్టర్లని బెంబేలెత్తించారు..

ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందంటే ఎవరైనా ముందుకువస్తారు. కానీ, పాస్టర్లకు గౌరవవేతనం ఇస్తామన్నా ‘మాకొద్దు బాబోయ్‌..’ అని వారితోనే అనిపించిన ఘతన జగన్‌కే దక్కింది. రాష్ట్రవ్యాప్తంగా 70 వేల మందికిపైగా పాస్టర్లు ఉంటే  దరఖాస్తులు 9 వేలకు మించలేదు. గౌరవవేతనం పేరుతో చర్చిలకు సంబంధించిన సమస్త వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారనే అనుమానమే దీనికి కారణం. పోనీ దరఖాస్తు చేసుకున్న వారికైనా సక్రమంగా వేతనాన్ని  విడుదల చేస్తున్నారా అంటే.. అదీ లేదు.


ఆర్థిక సాయం రెట్టింపు చేస్తామని..

తెదేపా ప్రభుత్వం తొలిసారిగా 2016-17లో జెరూసలెం యాత్రకు వెళ్లే క్రైస్తవులకు ఆర్థిక సాయాన్ని ప్రకటించి అమలు చేసింది. ఏటా   రూ.5 కోట్ల చొప్పున బడ్జెట్‌ కేటాయింపులతోపాటు ఖర్చూ చేసింది. అధికారంలోకి వస్తే దీన్ని రెట్టింపు చేసి అమలు చేస్తామని జగన్‌ హామీ ఇచ్చారు. ఆ మేరకు 2019 నవంబరులో ఉత్తర్వులు ఇచ్చినా కరోనా పేరుతో రెండేళ్లు చిల్లిగవ్వా ఇవ్వలేదు. 2022-23 బడ్జెట్‌లో రూ.2.50 కోట్లు, 2023-24లో రూ.1.50 కోట్లు ఇచ్చారు.  ఆర్థికసాయం పెంచినట్టే పెంచి, యాత్రికులు ఎక్కువగా వెళ్లకుండా నిధులకు కోత పెట్టారన్నమాట.  


సాయాన్ని కాదు జాప్యాన్ని పెంచారు..

2019 జూన్‌లో జగన్‌ అధికార పీఠంపై ఎక్కిన నాటి నుంచే అధికారులు పెళ్లికానుక ఆర్థికసాయం కోసం క్రైస్తవుల నుంచి దరఖాస్తులు తీసుకున్నారు. కానీ ఏళ్లు గడుస్తున్నా.. అర్హులకు ఆర్థికసాయం విడుదల చేయలేదు. దాంతో వారి నుంచి వ్యతిరేకత వ్యక్తమవడంతో 2020 ఏప్రిల్‌ నుంచి పథకాన్ని అమలు చేస్తామని 2019 సెప్టెంబరులో జీవో విడుదల చేశారు. అధికారులేమో 2020 ఏప్రిల్‌ వరకు దరఖాస్తులు తీసుకున్నారు. తీరా ఏప్రిల్‌ వచ్చే నాటికి కరోనా వైరస్‌ వ్యాప్తి కావడంతో దరఖాస్తులను నిలిపివేశారు. ఆ తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొన్నా.. ప్రభుత్వం పథకాన్ని అమల్లోకి తీసుకురాలేదు. చివరికి కొన్ని సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. ఈ క్రమంలో సర్కారు మళ్లీ కొత్తగా జీవో ఇచ్చింది. 2022 అక్టోబరు నుంచి అమలు చేస్తామని అందులో ప్రకటించింది. అది కూడా మూడు నెలలకోసారి ఆర్థిక సాయం అందిస్తామని చెప్పి.. ఇప్పటివరకు 199 మందికి మాత్రమే లబ్ధి చేకూర్చింది. మ్యానిఫెస్టోలో ప్రకటించినట్టు రూ.లక్ష కాకుండా.. తెదేపా ప్రభుత్వం ఇచ్చినట్లు    రూ.50 వేలతోనే సరిపెట్టింది.


శాశ్వత మ్యారేజ్‌ లైసెన్స్‌ విధానమూ రద్దు

క్రైస్తవ వివాహాలకు సంబంధించి రిజిస్ట్రేషన్‌ చేసేందుకు ప్రభుత్వం పాస్టర్లకు లైసెన్స్‌ జారీ చేయాలి. తెదేపా ప్రభుత్వంలో ఒకసారి ఈ లైసెన్స్‌ తీసుకుంటే శాశ్వతంగా అనుమతి ఉండేది. జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఈ లైసెన్స్‌ చెల్లుబాటును మూడేళ్లకు కుదించారు. దీంతో ప్రతిసారి వారు రెన్యువల్‌ చేసుకునేందుకు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది.


బీమా అమలులోనూ కుయుక్తులే..

తెదేపా ప్రభుత్వంలో ఏ వర్గానికైనా బీమా పథకం పక్కాగా అమలయ్యేది. క్రైస్తవ కుటుంబంలో 18ఏళ్లు పైబడిన వారు ప్రమాదవశాత్తు మృతిచెందితే రూ.5 లక్షలు, సాధారణంగా మరణిస్తే రూ.2 లక్షలు ఆర్థిక సాయం అందించేవారు. ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు బీమా మిత్రలనూ నియమించారు. జగన్‌ అధికారంలోకి రాగానే.. కుటుంబంలో ఆదాయం సమకూర్చేవారు ప్రమాదవశాత్తు మరణిస్తేనే ఆర్థికసాయం అందిస్తామని స్పష్టం చేశారు. పాస్టర్లకు స్థలాలిచ్చి ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చినా.. జగనన్న కాలనీల్లోనే దరఖాస్తు చేసుకోవాలని చెప్పి సరిపెట్టారు.  


‘గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌’నూ ఎగ్గొట్టారు

ర్చిల నిర్మాణం, మరమ్మతులు, ప్రహరీలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ‘గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌’ కింద తెదేపా ప్రభుత్వం 2014-19 మధ్య భారీగా నిధులు కేటాయించింది. గతంలో ఇచ్చే రూ.3 లక్షల ఆర్థిక సాయాన్ని రూ.5 లక్షలకు పెంచింది. ఈ నిధులు విడుదల కావాలంటే ముందస్తుగా లబ్ధిదారు చెల్లించాల్సిన 10 శాతం వాటాను కూడా మినహాయించింది. ఇలా ఐదేళ్ల కాలంలో 337 చర్చిలకు రూ.36 కోట్లు అందించింది. మరో 600 చర్చిలకు అనుమతులిచ్చి.. నిధులనూ కేటాయించింది. జగన్‌ అధికారంలోకి రాగానే ఆ 600 చర్చిల అనుమతులు రద్దు చేసింది. గత ఐదేళ్లలో పట్టుమని పది ప్రార్థనా మందిరాలకు నిధులు మంజూరు చేయలేదు. దాదాపుగా 350కిపైగా దరఖాస్తులు పెండింగ్‌లోనే పడి ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని