గ్రావెల్‌ గద్ద.. ఈ పెద్ద!

రాష్ట్రంలో వైకాపా నాయకులు ఒక్కొక్కరిది ఒక్కో తీరు. ‘నన్ను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా’ అని అందరూ చెబుతుంటారు.

Published : 30 Apr 2024 05:23 IST

విచ్చలవిడిగా ప్రకృతి వనరుల విధ్వంసం 
వివాదాల్లో ఉన్న భూములు కనిపిస్తే పాపం.. 
తట్టెడు మట్టి తవ్వాలన్నా.. ఏ పని చేయాలన్నా ఆయనే..
అనకాపల్లి జిల్లాలోని ఓ ప్రజాప్రతినిధి అరాచక పర్వమిదీ..
ఈనాడు, అమరావతి

ఆయన కొండలకు ‘కన్నా’లు వేసే ‘బాబు’..
అప్పనంగా భూములు దోచేసే ‘రాజు’..
అనుమతి కొంత.. తవ్వేస్తారు గ్రావెల్‌ అంతా..
సెజ్‌లోని పరిశ్రమల యజమానులను బెంబేలెత్తించడం..
ఇష్టానుసారం వసూళ్లకు పాల్పడటం..
వారి ఉత్పత్తులను ఆయన గోదాముల్లోనే పెట్టాలని ఆదేశం..
పారిశ్రామిక వ్యర్థాలు విక్రయించాలన్నా అనుమతి అవశ్యం..
కాదంటే గన్ను తీస్తారు.. గురి పెట్టి బెదిరిస్తారు..
ఆయనకు ఆయనే ‘పవర్‌ఫుల్‌’ అని ప్రకటించుకుంటారు.

రాష్ట్రంలో వైకాపా నాయకులు ఒక్కొక్కరిది ఒక్కో తీరు. ‘నన్ను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా’ అని అందరూ చెబుతుంటారు. అనకాపల్లికి జిల్లాకు చెందిన ఓ నియోజకవర్గ అధికార పార్టీ ప్రజాప్రతినిధి కూడా అదే చెప్పారు. కానీ, గెలిచిన తర్వాత ఆ ప్రాంత అభివృద్ధి కాకుండా ఆయన దృష్టంతా సొంత ఎదుగుదలపైనే నిలిపారు. ఎప్పుడూ వివాదాల్లో ఉంటూ.. ‘నియోజకవర్గంలో నేనే పవర్‌ఫుల్‌’ అంటూ గల్లా ఎగరేస్తుంటారు. ‘కన్నా’ అని కోరినా.. ‘బాబూ’ అని బతిమిలాడినా వినేది లేదు.. వసూళ్లు ఆపేది లేదు. ఎవరైనా ప్రశ్నిస్తే బూతుల పురాణం అందుకుంటారు. జిల్లాలో ఈ నాయకుడి దందా ఇంతా అంతా కాదు.

 విశాఖ నగరానికి సమీపంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న నియోజకవర్గం అది. అచ్యుతాపురం సెజ్‌ అక్కడే ఉంది. ఏటికొప్పాక బొమ్మలకు ప్రసిద్ధి. విస్తృత తీర ప్రాంతమూ ఉంది. ఇంతటి కీలక ప్రాంతంలో వివాదాస్పద భూములపై కన్నేసే ఆయన ఎలాగోలా వాటిని సొంతం చేసుకుంటారు. పారిశ్రామికవాడలో మట్టి పోయాలన్నా, ఇటుక   పేర్చాలన్నా, ఆఖరికి పరిశ్రమల వ్యర్థాలు అమ్ముకోవాలన్నా ఈయనకు ముడుపులు చెల్లించాల్సిందే. లేకపోతే ఏదో ఒక అడ్డంకి సృష్టిస్తారు. అయినా దారికి రాకపోతే అనుచరులతో దాడులు చేయిస్తారు. ప్రతిపక్షాలతో కలిసి సొంత పార్టీ నేతలే అఖిలపక్షం ఏర్పాటు చేసి మరీ ఆయన దందాలకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.  

భయపెట్టి భూములు బొక్కేశారు

ఎక్కడ ఏ భూమి వివాదం ఉందంటే అక్కడ వాలిపోతారీ నేత అనుచరులు. ఎవరిని ఎలా  భయపెట్టి భూములను సొంతం చేసుకోవచ్చో  ఈయనకు వెన్నతో పెట్టిన విద్య. అచ్యుతాపురం మండలం పూడిమడకలో ఇటీవల చనిపోయిన ఒక ప్రతిపక్ష నాయకుడికి మొత్తం 40 ఎకరాల భూమి ఉండేది. వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయనను భయపెట్టిన ఈ ప్రజాప్రతినిధి.. కేవలం నాలుగెకరాలు మాత్రమే ఆయన వద్ద ఉంచి, మిగిలినవి ఎకరా రూ.12 లక్షల చొప్పున కుమారుడి పేరిట రాయించుకున్నారు. గతంలో 22ఏ పరిధిలో ఉండేవన్న కారణం చూపి, ఆవసోమవారంలోని  8 ఎకరాలను సైతం తక్కువ ధరకే ఆయన నుంచి తీసేసుకున్నారీ నేత. ప్రస్తుతం ఆ 44 ఎకరాల భూముల విలువ రూ.100 కోట్లకు పైమాటే! అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తుల భూమినీ ప్రభుత్వానిదంటూ భయపెట్టి తక్కువ ధరకు  లాక్కున్నారు. ఇలా ఆ నేత కుమారుడి పేరిట  కొనుగోలు చేసిన భూములను ఆనుకొనే మరో 160 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉంది. 22ఏ జాబితాలో ఉన్న వీటిపైనా ఈ నేత కన్నేశారు. రాంబిల్లి మండల పరిధిలో పేదలకు ప్రభుత్వం అందించిన వందల ఎకరాల ఎసైన్‌మెంట్‌ భూములకు సంబంధించి రికార్డుల్లో లబ్ధిదారుల పేర్లు ఉన్నా.. సాగులో మాత్రం ఆ ప్రజాప్రతినిధి  కుటుంబ సభ్యులే ఉన్నారు. ఇందుకు ప్రతిగా ఏటా లబ్ధిదారులకు ఎంతో కొంత ముట్టజెబుతున్నారు. 


అక్రమ లేఅవుట్లు.. రూ. కోట్లు

భూములు అన్నా, కంకర అన్నా ఈయనకు ఎంతో ఇష్టం. ఆ మాటలు వినిపిస్తే చాలు గద్దలా వాలిపోతారు. అందిన కాడికి తన్నుకుపోతుంటారు. నియోజకవర్గంలో ఎక్కడ లే అవుట్‌ వేసినా, కొండల తవ్వకాలు జరిగినా అందులో ఈ ప్రజాప్రతినిధి హస్తం ఉన్నట్లే. అక్రమ లే అవుట్లు వేసిన వారి దగ్గర్నుంచి రూ.కోట్లలో కమీషన్లు దండుకుంటారు. చాలా ఏళ్లుగా ప్రజాప్రతినిధిగా ఉన్న ఆయన.. కన్ను పడితే కొండలు పిండి కావాల్సిందే.. భూములు హాంఫట్‌ కావాల్సిందే. అందుకు ఎదురుచెప్పేవారిని నయానో, భయానో లొంగదీసుకోవడంలోనూ ఆయనను మించిన ‘రాజు’ లేరు. రాంబిల్లి మండలంలో పెదకలవలాపల్లి, వేల్చూరు, పంచదార్ల, కొత్తూరు గ్రామాల్లో కొండలను గుల్లచేసి భారీగా కంకరను తరలించారు. అక్రమ తవ్వకాలు జరిగాయని నిర్ధారణ చేసిన గనుల శాఖ రూ.14 కోట్ల అపరాధ రుసుం చెల్లించాలని ఆదేశించినా, ఒక్క రూపాయీ చెల్లించలేదు. ఆ ప్రాంతంలో ఎవరు గుత్తేదారులుగా ఉన్నా అవసరమైన కంకర ఈయనే సరఫరా చేస్తారు. నునపర్తి, నడింపల్లి గ్రామాలతో పాటు పోలవరం ఎడమ కాల్వ గట్టుపై ఉన్న కంకరను పూర్తిగా కొల్లగొట్టారు. అచ్యుతాపురం సెజ్‌లో ఓ టైర్ల కంపెనీ కొత్తగా స్థాపించారు. ఆ స్థలాన్ని చదును చేయగా వచ్చిన సుమారు లక్ష క్యూబిక్‌ మీటర్ల గ్రావెల్‌ను ఈ నేతే విక్రయించి సొమ్ము చేసుకున్నారు. గ్రావెల్‌ తరలింపునకు వీలుగా.. సెజ్‌ రక్షణ గోడను పగలగొట్టి మరీ ఈ వ్యాపారం కొనసాగించారు.

సొంత అభివృద్ధికే పరిశ్రమిస్తూ..

అచ్యుతాపురం సెజ్‌కి ఏ కంపెనీ వచ్చినా, ముందుగా ఈ ప్రజాప్రతినిధిని ప్రసన్నం చేసుకోవాల్సిందే. కంపెనీకి అవసరమైన గ్రావెల్‌, మట్టి, ఇసుక, గోదాం ఇలా అన్ని అవసరాలనూ ఆయనే సమకూరుస్తారు. ట్రాన్స్‌కో సబ్‌ స్టేషన్‌ నిర్మాణ పనులను ఒక మంత్రి అనుచరుడు దక్కించుకోగా.. తన రాజ్యంలో ఆయన పెత్తనం ఏమిటంటూ ఏకంగా పనులనే అడ్డుకున్నారీ నేత. సెజ్‌లో ప్లైవుడ్‌ తయారు చేసే ఒక పరిశ్రమ యాజమాన్యాన్ని బెదిరించి ఆ ఉత్పత్తులను తన గోదాంలోనే దాచుకోవాలని హుకుం జారీ చేశారు. అసలా గోదామే అక్రమ నిర్మాణమనే ఆరోపణలున్నాయి. అందులో ఆ పరిశ్రమ వారు సరకు దాచుకుని రూ.లక్షల్లో అద్దె చెల్లించాల్సి వస్తోంది. ఫెర్రో పరిశ్రమ నుంచి వచ్చే ఫ్లైయాష్‌ (బూడిద) వ్యర్థాల అమ్మకాలూ ఈ నాయకుడి కనుసన్నల్లోనే సాగాలి. ఇటీవల ఈ బూడిద అమ్మకాల వ్యవహారంలో ఓ మంత్రి అనుచరులకు, నేత అనుచరులకు మధ్య బాహాబాహీ జరిగింది. అచ్యుతాపురం సమీపంలో మాజీ సైనికుడి భూమి తక్కువ రేటుకే కొనుగోలు చేశారు. ఆ భూముల చుట్టూ పంచాయతీ నిధుల నుంచి సీసీ రహదారులు నిర్మించి విలువ పెంచుకున్నారు. ఇప్పుడు అదే భూమిని ఆనుకొని జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ నిర్మాణం జరిగేలా చూశారు. ఆ భూమి విలువను మరింత కొండెక్కించారు. పరిశ్రమల సీఎస్‌ఆర్‌ (సామాజిక బాధ్యత) నిధులను సైతం ఎక్కడ వినియోగించాలో ఈ నాయకుడే చెబుతారు. ఆ నిధులతో చేపట్టే అభివృద్ధి పనులకూ ఈయన అనుచరగణమే గుత్తేదారు అవతారం ఎత్తుతుంది. 

గన్నుతో బెదిరింపులు.. 

ఆ నేతను నమ్మి పారిశ్రామిక వాడకు భూములిచ్చిన వారు ఇంకా పూరి గుడిసెల్లోనే మగ్గుతున్నారు. ఆయన మాత్రం కొండకర్ల ఆవను ఆనుకొని భారీ అతిథిగృహం, విశాఖ నగరంలో దేవాదాయ భూములను ఆక్రమించి విశాలమైన ఇంటిని నిర్మించారని చెబుతుంటారు. తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించాలని ఇంటికి వెళ్లి అడిగిన సెజ్‌లోని ఒక గుత్తేదారుడిపై ఏకంగా తుపాకి గురిపెట్టి.. చంపుతానని బెదిరించిన ఘనత ఈయనది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని