ప్రశ్నిస్తే దాడులు.. ‘ఎదిరిస్తే హత్యలు’

వారానికి నాలుగు హత్యలు.. మూడు అత్యాచారాలు.. ఆరు హత్యాయత్నాలు.. రోజుకు ఇద్దరిపై దాడులు.. ఆరు దురాగతాలు...అమానవీయ శిరోముండనాలు... అంతమొందించి డోర్‌ డెలివరీలు... గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని దుశ్చర్యలు వైకాపా జమానాలో ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో దళితులపై జరుగుతున్న అరాచకాల తీరిది.

Published : 01 May 2024 06:50 IST

ఐదేళ్లలో దళితులపై వైకాపా దాష్టీకాలు
పోలీసుల అండతో వేధింపులు
బలవన్మరణాలకు పాల్పడేంతలా చిత్రహింసలు
ఈ దారుణాలపై ఏ రోజూ నోరు విప్పని ముఖ్యమంత్రి
ఎస్సీ, ఎస్టీలపై దాడుల్లో దక్షిణ భారతదేశంలోనే అత్యధిక ఘటనలు ఆంధ్రప్రదేశ్‌లో
ఈనాడు, అమరావతి

వారానికి నాలుగు హత్యలు.. మూడు అత్యాచారాలు.. ఆరు హత్యాయత్నాలు..
రోజుకు ఇద్దరిపై దాడులు.. ఆరు దురాగతాలు...
అమానవీయ శిరోముండనాలు... అంతమొందించి డోర్‌ డెలివరీలు...
గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని దుశ్చర్యలు
వైకాపా జమానాలో ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో దళితులపై జరుగుతున్న అరాచకాల తీరిది.
నా ఎస్సీలు.. నా ఎస్టీలు.. అంటూనే వారిపై దాడులను ప్రోత్సహిస్తూ... దురాగతాలు చేసిన వారికి అండగా నిలుస్తూ జగన్‌ దారుణంగా దగా చేశారు.

తప్పుల్ని ప్రశ్నిస్తే దాడులు, అణచివేతకు వ్యతిరేకంగా గొంతెత్తితే దౌర్జన్యాలు, హక్కుల కోసం నినదిస్తే అక్రమ కేసులు, అన్యాయంపై ఎదురు తిరిగితే హత్యలు...
జగన్‌ జమానాలో ఐదేళ్లుగా దళితులపై దమనకాండ కొనసాగుతోంది. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేనంతగా అత్యంత అమానవీయ సంఘటనలు చోటుచేసుకున్నాయి. మైక్‌ పట్టుకుంటే చాలు.. ‘‘నా ఎస్సీ.. నా ఎస్టీ...’’ అంటూ ఊదరగొట్టే జగన్‌ ప్రభుత్వ హయాంలో వారిపై కక్ష కట్టారా అనే స్థాయిలో దాష్టీకాలు కొనసాగాయి. అత్యధిక సందర్భాల్లో ఈ దుశ్చర్యలకు తెగబడింది వైకాపా నాయకులే. కొంతమంది పోలీసులను అడ్డం పెట్టుకుని మరీ వేధింపులకు పాల్పడ్డారు. అవి భరించలేక పలువురు బలవన్మరణాలకు పాల్పడ్డారు. తీవ్ర మానసిక క్షోభకు...    అవమానాలకి గురై ప్రాణాలు తీసుకున్నారు. లెక్కలేనన్ని దారుణాలు జరుగుతున్నా ముఖ్యమంత్రి జగన్‌ ఏనాడూ నోరు మెదపలేదు. అరికట్టేందుకు చర్యలు చేపట్టలేదు. బాధితులను పరామర్శించనూ లేదు. ఇప్పుడు ఎన్నికల వేళ నా ఎస్సీలంటూ నవరసాలు ఒలికిస్తూ తిరుగుతున్న ఇలాంటి దళిత వ్యతిరేక పాలకుడికి ఎందుకు ఓట్లేయాలి? గత ఐదేళ్లుగా జరుగుతున్న దురాగతాలను మళ్లీ  చూడటానికా?


అడుగడుగునా అరాచకాలు!

  • కాకినాడ జిల్లాలో వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు.. ఆయన వద్ద డ్రైవర్‌గా పనిచేసిన దళిత యువకుడు వీధి సుబ్రమణ్యాన్ని చంపేసి, ఆ మృతదేహాన్ని డోర్‌ డెలివరీ చేశారన్న తీవ్ర అభియోగాలు ఎదుర్కొన్నారు. ఆయనను సస్పెండ్‌ చేయాలంటూ అన్ని వైపుల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తే తప్ప వైకాపా అప్పట్లో చర్యలు తీసుకోలేదు. జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన తర్వాత ఆయనకు స్వాగతం పలుకుతూ.. వైకాపా శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. ముఖ్యమంత్రి సభల్లోనూ ఆయన దర్జాగా పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో రంపచోడవరం నియోజకవర్గంలో వైకాపా తరఫున అన్నీ తానే అయి నడిపిస్తున్నారు.

  • కరోనా విజృంభిస్తున్న వేళ మాస్కులు లేకుండా వైద్యం ఎలా చేయాలి? అని అడగటమే నేరమన్నట్లు.. డాక్టర్‌ సుధాకర్‌ను వేధించారు. విధుల నుంచి సస్పెండ్‌ చేశారు. చొక్కా తీసేసి.. చేతులు వెనక్కి విరిచేసి, తాళ్లతో కట్టి, లాఠీలతో కొట్టారు. చివరకు మానసిక స్థితి బాగోలేదంటూ పిచ్చి ఆసుపత్రిలో చేర్పించారు. తీవ్ర మానసిక క్షోభకు గురైన ఆయన ప్రాణాలొదిలారు. మాస్కు పెట్టుకోకుండా బయట తిరుగుతున్నారంటూ దళిత యువకుడు కిరణ్‌కుమార్‌ను లాఠీతో చితకబాది అతని మరణానికి కారణమయ్యారు.

  • జగన్‌ సొంత జిల్లాలో పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న చిన్న అచ్చెన్నను దారుణంగా చంపేశారు. ప్రకాశం జిల్లా సీఎస్‌పురం మండలంలో ఉపాధి హామీ పథకంలో అధికార వైకాపా నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేసినందుకు దాసరి వెంకట రమణయ్యను అంతమొందించారు. అనకాపల్లి జిల్లా పీఎల్‌పురం ఎస్సీ కాలనీకి చెందిన వడ్లమూరి నాగేంద్ర (21)ను కాళ్లు, చేతులు కట్టేసి వ్యవసాయ బావిలో పడేసి ప్రాణాలుతీశారు. కాకినాడ జిల్లా తొండంగి మండలం శృంగవృక్షంలో గ్రామదేవతల జాతర సందర్భంగా చోటుచేసుకున్న గొడవల్లో దళితులపై మరో వర్గం కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడింది. ఈ ఘటనలో  నడిపల్లి రాము(23) ప్రాణాలు కోల్పోయారు. ఇలా ఒకటా... రెండా? తమ ఆధిపత్యాన్ని ప్రశ్నించినా, అహాన్ని దెబ్బతీసినా, తమకు అడ్డుగా ఉన్నారని భావించినా, ఎదురుతిరిగినా, అక్రమాలపై ఫిర్యాదు చేసినా దళితులను బలి చేస్తున్నారు.
  • తూర్పుగోదావరి జిల్లాలో అధికార పార్టీ నాయకుల ఇసుక అక్రమాలపై ప్రశ్నించిన పాపానికి ఇండుగుమల్లి వరప్రసాద్‌ అనే యువకుడికి పోలీసుస్టేషన్‌లో శిరోముండనం చేశారు. జగన్‌ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ న్యాయాధికారి రామకృష్ణపై దాడికి పాల్పడ్డారు. అక్రమ కేసులు బనాయించి.. తీవ్రంగా హింసించారు. అదే జిల్లాలో అనితారాణి అనే వైద్యురాలిని వేధించి, అసభ్యపదజాలంతో దూషించారు.
  • ‘‘కాళ్లలో రాడ్లు ఉన్నాయి. కొట్టొద్దు సార్‌’’ అంటూ అలపు గిరీశ్‌బాబు అనే యువకుడు ప్రాధేయపడ్డా పోలీసులు కనికరించలేదు. ‘‘రాడ్లు ఎక్కడున్నాయో చెప్పు’’ అంటూ లాఠీకి రబ్బరు కట్టి కొట్టి రాక్షసానందం పొందారు. హత్య, మానభంగం, దేశద్రోహం వంటి కేసుల్లో సైతం ఇంత తీవ్రంగా కొట్టేలా చట్టాలు లేవు. ‘ఎస్సై కక్షపూరితంగా, రాజకీయ నాయకుల మెప్పు పొందేందుకే ఇలా చేశారు’ అని రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌ ఎం.విక్టర్‌ ప్రసాద్‌ బాధిత కుటుంబాన్ని పరామర్శించిన సందర్భంలో వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వైకాపా నాయకులు, పోలీసులు కలిసిపోయి గత అయిదేళ్లలో దళితుల్ని ఎంతగా వేధించారో చెప్పేందుకు కాకినాడ జిల్లాలో జరిగిన ఈ ఉదంతం చిన్న ఉదాహరణ మాత్రమే.
  • రూ.20 లక్షలు అప్పు చేసి చెరువులో చేపలు పెంచితే వాటిని పట్టుకోనివ్వకుండా వైకాపా నాయకుడు, శ్రీశైలం ట్రస్టు బోర్డు సభ్యుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి, ఆయన అనుచరుడు సురేశ్‌రెడ్డి అడ్డుకుంటున్నారంటూ ఎస్పీకి లేఖ రాసి నెల్లూరు జిల్లా కావలికి చెందిన దుగ్గిరాల కరుణాకర్‌(36) ఆత్మహత్య చేసుకున్నారు. తన తల్లితో కలిసి జగదీశ్వర్‌రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన కాళ్లు పట్టుకున్నా కనికరించలేదని ఆ లేఖలో ఆయన వాపోయారు. అధికార పార్టీ నాయకులు చెప్పినట్టల్లా ఆడిన పోలీసులు దళితులను చిత్రహింసలు పెట్టారు. వారిని అవమానించి, మానసిక క్షోభకు గురిచేశారు. వాటిని భరించలేక అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు.  
  • ‘‘వైకాపా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి నా రేషన్‌ దుకాణాన్ని తొలగించారు. కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు. వైకాపా ఎమ్మెల్యేలు, పోలీసు వేధింపులే నా చావుకు కారణం’’ అని పేర్కొని నెల్లూరు జిల్లా కావలిలో పూడి శ్రీహర్ష ఆత్మహత్యకు యత్నించారు. అదే జిల్లా కందమూరుకు చెందిన ఉదయగిరి నారాయణ(38) గతేడాది జులైలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఆయనను పోలీసులు తీవ్రంగా కొట్టి, చిత్రహింసలకు గురిచేశారని.. చివరకు ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

పెరిగిన బాధలు... బాధితులు

గత ఐదేళ్లలో దళితులపై నేరాలు గణనీయంగా పెరిగాయి.  

  • 2020తో పోలిస్తే 2021లో 3.28 శాతం మేర, 2021తో పోలిస్తే 2022లో 14.94 శాతం మేర నేరాలు పెరిగాయి.
  • 2021లో దళితులపై మొత్తం 2014 నేరాలు జరగ్గా.. వాటిలో 2076 మంది బాధితులయ్యారు. 2022లో 2,315 నేరాలు చోటుచేసుకోగా 2,431 మంది బాధితులయ్యారు.

వీగిపోతున్న కేసులు.. 90 శాతం పైనే

తప్పు చేసిన వారికి శిక్షపడుతుందనే భయం ఉంటే ఎవరైనా సరే ఆ తప్పు చేయటానికి వెనకంజ వేస్తారు. కానీ ఎస్సీ, ఎస్టీలపై నేరాలకు తెగబడుతున్న వారికి శిక్షలు పడేలా చేయటంలో జగన్‌ ప్రభుత్వం అత్యంత ఘోరంగా విఫలమైంది. మెజార్టీ కేసుల్లో అధికార పార్టీ నాయకులే నిందితులుగా ఉండటంతో లోతైన దర్యాప్తు చేయలేదు. శాస్త్రీయ ఆధారాలు సేకరించలేదు. అభియోగపత్రాలు మొక్కుబడిగా దాఖలుచేశారు. ఆ ఫలితంగానే అత్యధిక శాతం కేసులు వీగిపోయాయి. వీటిలోనూ అప్పీలుకు సైతం వెళ్లట్లేదు.

  • 2022లో 1,050 కేసుల్లో న్యాయస్థానాల్లో విచారణ పూర్తికాగా. కేవలం 42 కేసుల్లోనే శిక్ష పడింది. మిగతా 1,008 కేసులు వీగిపోయాయి.
  • 2021లో నమోదైన 360 కేసుల్లో కేవలం 21 కేసుల్లోనే శిక్షపడింది. మిగతా కేసులు కోర్టులో నిలబడలేదు..  
  • 2020లో 371 కేసుల్లో 51 కేసుల్లోనే శిక్షపడింది. మిగతావాటిలో అనుకూల తీర్పు రాలేదు.
  • 2019లో 560 కేసుల్లో 65 కేసుల్లోనే శిక్షపడింది. మిగిలిన కేసులు వీగిపోయాయి.

మహిళా ప్రజాప్రతినిధిపై ఇంత అక్కసా?

ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడ్డారంటూ దళిత మహిళా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని వైకాపా గతేడాది మార్చిలో సస్పెండ్‌ చేసింది. ఆ వెంటనే వైకాపా శ్రేణులు ఆమె కార్యాలయంపై దాడికి పాల్పడ్డాయి.

సామాజిక మాధ్యమాల్లో ఆమెను, ఆమె కుటుంబ సభ్యులను కించపరుస్తూ, అసభ్యకరంగా ట్రోల్‌ చేశాయి. వైకాపా మద్దతు ఉన్న నాయకులు దళితులపై ఎంతటి తీవ్రమైన నేరానికి పాల్పడినా వారికి జగన్‌ అన్ని రకాలుగా అండదండలు అందించారు. అదే  ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే చాలు దళిత నాయకులపైనా దాడికి పాల్పడ్డారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాలంటేనే భయమేస్తోంది. అక్కడ ఎస్సీలపై దాడులు చేస్తున్నారు. అణగదొక్కుతున్నారు. వీటిని చూసి ఒక ఎమ్మెల్యేగా ఉంటూ నేనే భయపడుతున్నానంటే ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఎస్సీలంటే ప్రభుత్వానికి చులకన. గతంలో డాక్టర్‌ సుధాకర్‌, తాజాగా డాక్టర్‌ అచ్చెన్న ఎలా చనిపోయారో మీ అందరికీ తెలుసు. డాక్టర్‌ శ్రీదేవి అలా చనిపోవద్దనే ఉద్దేశంతోనే అజ్ఞాతంలో ఉన్నా. సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి నాకు హాని ఉంది. నాకేదైనా జరిగితే పూర్తి బాధ్యత ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానిదే. గూండాలతో బెదిరిస్తున్నారు. గుంటూరులోని నా కార్యాలయాన్ని ధ్వంసం చేశారు.’’- అని అప్పట్లో ఎమ్మెల్యే శ్రీదేవి వ్యాఖ్యానించటం రాష్ట్రంలోని దారుణ పరిస్థితులను కళ్లకు కట్టింది.


ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసులు.. రివర్స్‌లో

బాధితులైన దళితులకు రక్షణ కవచంలా ఉపయోగపడాల్సిన ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ నిరోధక చట్టాన్ని రాజకీయ ప్రత్యర్థులపై వేధింపులకు, వారిపై కక్ష సాధించేందుకు, అణిచేసేందుకు జగన్‌ ప్రభుత్వం వినియోగించింది. పోలీసులను అడ్డం పెట్టుకుని దళితులపైనే రివర్స్‌లో ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ సెక్షన్ల కింద కేసులు బనాయించింది. తన పేరిట తప్పుడు పత్రాలు సృష్టించి ధాన్యం కొనుగోళ్లలో కొందరు అక్రమాలకు పాల్పడ్డారంటూ నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన దళిత రైతు గాలి జూపాల్‌ పోలీసులకు ఫిర్యాదుచేయగా.. తిరిగి ఆయనపైనే కేసుపెట్టారు. మూడు రాజధానులకు మద్దతుగా తలపెట్టిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతున్న వారిని అడ్డుకుని కులం పేరుతో దూషించారంటూ అమరావతి దళిత రైతులు ఐదుగురిపై ఎట్రాసిటీ కేసు పెట్టి 18 రోజులు జైల్లో ఉంచారు. పులివెందులలో హత్యాచారానికి గురైన దళిత మహిళ కుటుంబానికి న్యాయం చేయాలంటూ డీఎస్పీకి ఫిర్యాదు చేయటానికి వెళ్లిన తెదేపా మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత, ఎస్సీ వర్గానికి చెందిన తెదేపా నాయకుడు ఎంఎస్‌ రాజులపైన ఎట్రాసిటీ కేసు పెట్టారు. దశాబ్దాల క్రితం ప్రభుత్వం తమకు కేటాయించిన ఎసైన్డ్‌ భూములను ప్రభుత్వమే లాక్కోవటం ఏంటి..? అని ప్రశ్నించినందుకు దళితులపై కేసులు పెట్టి వేధింపులకు గురిచేశారు


ఇక్కడే ఎక్కువ!

దళితులపై దాడుల్లో దక్షిణ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానంలో నిలిపిన ఘనత జగన్‌దే. మనకంటే పెద్ద రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడుల్లో కంటే కూడా ఏపీలోనే ఎక్కువ నేరాలు జరిగాయి. 2019 నుంచి 2022 మధ్య ఒక్క ఏడాది మినహా మిగతా అన్ని సంవత్సరాల్లోనూ దక్షిణ భారతదేశంలో ఎక్కువ  ఘటనలు ఏపీలోనే జరిగాయి.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని