Updated : 06 Aug 2021 20:25 IST

Bernard Arnault: ప్రపంచ కుబేరుడు బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ చెప్పిన 3 విజయ సూత్రాలు!

దిల్లీ: ఇప్పటి వరకు ప్రపంచ కుబేరుల జాబితాలో తొలి స్థానంలో ఉన్న అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ను ఫ్రాన్స్‌కు చెందిన వ్యాపారవేత్త బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ వెనక్కి నెట్టారు. ఆయా కంపెనీల రోజువారీ షేరు కదలికల్ని బట్టి మారే ‘ఫోర్బ్స్‌ రియల్‌-టైమ్‌ బిలియనీర్స్’ జాబితాలో 198.9 బిలియన్‌ డాలర్ల సంపదతో ఆర్నాల్ట్‌ తొలి స్థానంలో నిలిచారు. గురువారం ఒక్కరోజే ఆయన సంపద 0.39 శాతం ఎగబాకింది. ఈ జాబితాలో 194.9 బిలియన్‌ డాలర్లతో బెజోస్‌ రెండో స్థానంలో ఉన్నారు. ఎలాన్‌ మస్క్‌ (185.5 బి.డా), బిల్‌ గేట్స్‌ (132 బి.డా), మార్క్‌ జుకర్‌బర్గ్‌ (130.6 బి.డా) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

‘ఎల్‌వీఎంహెచ్‌’ అనే కంపెనీకి బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ ప్రస్తుతం ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రపంచంలో అత్యంత ఖరీదైన వస్తువుల బ్రాండ్లు ఈ కంపెనీ ఆధ్వర్యంలోనే ఉన్నాయి. ఈ ఏడాది జనవరిలో అమెరికాకు చెందిన ఆభరణాల కంపెనీ టిఫనీ అండ్‌ కంపెనీని రూ.15.8 బిలియన్ డాలర్లకు లూయిస్‌ విట్టన్‌ సొంతం చేసుకోవడంతో ఆర్నాల్ట్‌ షేర్ల విలువ భారీగా పెరిగింది. 

72 ఏళ్ల ఆర్నాల్ట్‌ ఇప్పటికీ వ్యాపార కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఏళ్లుగా వివిధ మార్కెట్లను గమనిస్తూ సంపాదించిన అనుభవమే తన విజయానికి కారణమని ఆయన చెబుతుంటారు. ఈ ప్రయాణంలో తాను నేర్చుకున్న కొన్ని వ్యాపార పాఠాల్ని ఓ సందర్భంలో పంచుకున్నారు. అవేంటో చూద్దాం...

దీర్ఘకాల వ్యూహం...

ఆర్నాల్ట్‌ 1991లో తొలిసారి చైనాకు వెళ్లారు. అప్పటికి ఆయనకు అక్కడ ఎలాంటి పురోగతి కనిపించలేదు. అయినా.. బీజింగ్‌లో ఆయన లగ్జరీ వస్తువులకు పెట్టింది పేరైనా లూయిస్‌ విట్టన్‌ స్టోర్‌ను తెరిచారు. ప్రస్తుతం చైనాలో అత్యంత విలాసవంతమైన వస్తువుల బ్రాండ్‌గా లూయిస్‌ విట్టన్‌ అవతరించింది. 25 ఏళ్లుగా తాము అత్యంత నాణ్యతతో కూడిన వస్తువుల తయారీ కోసం శ్రమిస్తూనే ఉన్నామని ఆర్నాల్ట్‌ ఓ సందర్భంలో తెలిపారు.

ఆఫీసులలో కాదు.. స్టోర్లలో ఉండాలి..

‘‘ఆఫీసులకు తరచూ వెళ్లొద్దు. క్షేత్రస్థాయిలో ఉండండి. వినియోగదారులు లేదా డిజైనర్లతో ఎక్కువ సమయం గడపండి. నేను ప్రతివారం స్టోర్లకు వెళుతుంటాను. స్టోర్‌ మేనేజర్లు క్షేత్రస్థాయిలో ఉండాలని నేను కోరుకుంటాను. ఆఫీసుల్లో కూర్చొని పేపర్‌ వర్క్‌ చేయడం ముఖ్యం కాదు’’ అని ఆర్నాల్ట్‌ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

ఓర్పుతో ఉండండి..

విజయం వరించాలంటే ఓర్పు కూడా ముఖ్యమంటారు ఆర్నాల్ట్‌. ఆయన ప్రారంభించిన ఓ మంచి బ్రాండ్‌ను తొందరపడి విక్రయించినందుకు ఇప్పటికీ తాను చింతిస్తున్నానని ఓ సందర్భంలో తెలిపారు. తొలినాళ్లలో ఏదైనా వ్యాపారం సక్సెస్‌ కాకపోయినప్పటికీ.. దీర్ఘకాలంలో దానికి మంచి రోజులు ఉండే అవకాశం ఉందన్నారు. వ్యాపారం సరిగ్గా నడవకపోవడం అనేది ఉండదని.. ఆ వ్యాపారాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడంపైనే దాని మనుగడ ఆధారపడి ఉంటుందని తెలిపారు. కొన్ని విలువైన బ్రాండ్లను విపణిలో నిలిపేందుకు కొన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉందన్నారు. అప్పటి వరకు ఓర్పుతో వేచి చూడాలన్నారు.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్