కొవాగ్జిన్‌ ఉత్పత్తి పెంచుతాం

కొవిడ్‌-19 కేసుల తీవ్రత పెరగడం, టీకాకు తీవ్రమైన కొరత ఏర్పడటంతో భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ కీలక నిర్ణయం తీసుకుంటుంది. ‘కొవాగ్జిన్‌’ టీకా తయారీని గణనీయంగా పెంచాలని ప్రతిపాదించింది. ఏడాదికి 70 కోట్ల డోసుల కొవాగ్జిన్‌ టీకా తయారీ   సామర్థ్యం జులై-ఆగస్టుకు సమకూరుతుందని 

Updated : 21 Apr 2021 09:07 IST

ఏడాదికి 70 కోట్ల డోసులు తయారు చేస్తాం
భారత్‌ బయోటెక్‌ వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌-19 కేసుల తీవ్రత పెరగడం, టీకాకు తీవ్రమైన కొరత ఏర్పడటంతో భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ కీలక నిర్ణయం తీసుకుంటుంది. ‘కొవాగ్జిన్‌’ టీకా తయారీని గణనీయంగా పెంచాలని ప్రతిపాదించింది. ఏడాదికి 70 కోట్ల డోసుల కొవాగ్జిన్‌ టీకా తయారీ   సామర్థ్యం జులై-ఆగస్టుకు సమకూరుతుందని  భారత్‌ బయోటెక్‌ మంగళవారం  వెల్లడించింది. హైదరాబాద్‌, బెంగళూరు నగరాల్లోని భారత్‌ బయోటెక్‌ యూనిట్లలో దశల వారీగా టీకా ఉత్పత్తి పెంచుతారు.  ‘ఇన్‌-యాక్టివేటెడ్‌ వ్యాక్సిన్లు ఎంతో భద్రమైనవి. అదే సమయంలో ఈ వ్యాక్సిన్ల తయారీ ఎంతో సంక్లిష్టమైన ప్రక్రియ. ఖరీదైన వ్యవహారం కూడా. ఇందుకు ఏళ్ల తరబడి భారీగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది. పైగా ఇతర రకాల వ్యాక్సిన్లతో పోల్చితే ఇన్‌-యాక్టివేటెడ్‌ వ్యాక్సిన్ల తయారీలో మార్జిన్లు కూడా తక్కువ’ అని కంపెనీ వివరించింది. తమకు ఎంతో భద్రమైన బీఎస్‌ఎల్‌-3 సదుపాయాలు ఉండటం, టీకాల తయారీలో విశేషమైన అనుభవం ఉండటంతో ‘కొవాగ్జిన్‌’ టీకా తయారీని భారీగా పెంచే వీలు కలుగుతోందని పేర్కొంది.
తయారీ భాగస్వామ్యాలు
టీకాల తయారీలో అనుభవం గల ఇతర సంస్థలతో టీకా తయారీ ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉందని ఈ సందర్భంగా భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది. ఇన్‌-యాక్టివేటెడ్‌ వైరల్‌ టీకాల తయారీలో అనుభవం ఉండటంతో పాటు బయోసేఫ్టీ కంటెయిన్‌మెంట్‌ సదుపాయాలు ఉన్న సంస్థలతో టీకా తయారీ ఒప్పందాలు కుదుర్చుకుంటామని వివరించింది. ఇప్పటికే భారత్‌ బయోటెక్‌, హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఇండియన్‌ ఇమ్యునలాజికల్స్‌ లిమిటెడ్‌ (ఐఐఎల్‌) తో కొవాగ్జిన్‌ టీకాలో వినియోగించే ముడిపదార్థాల తయారీ ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేసే పనిలో ఉన్నట్లు భారత్‌ బయోటెక్‌ తెలిపింది. భారీ స్థాయిలో ఇన్‌-యాక్టివేటెడ్‌ వైరల్‌ టీకాలు తయారు చేసే సదుపాయాలు, సామర్థ్యం ఐఐఎల్‌కు ఉన్నట్లు భారత్‌ బయోటెక్‌ పేర్కొంది.
తొలిసారిగా ‘అడ్జువంట్‌’ తయారీ
‘కొవాగ్జిన్‌’ టీకా తీసుకున్న వారిలో మెమొరీ టీ-సెల్‌ ప్రతిస్పందన సాధించడం కోసం అవసరమైన ఆల్గెల్‌-ఐఎండీజీ అనే అడ్జువంట్‌ను దేశీయంగా సొంతంగా తయారు చేసి వినియోగిస్తున్నట్లు భారత్‌ బయోటెక్‌ వివరించింది. టీకా సామర్థ్యాన్ని పెంచే పదార్థాన్ని అడ్జువంట్‌ అని పేర్కొంటారు. దీన్ని మనదేశంలో అభివృద్ధి చేయడంతో పాటు వాణిజ్య స్థాయిలో తయారు చేసి వినియోగించడం ఇదే మొదటిసారి.
60 దేశాల్లో అనుమతుల ప్రక్రియ
ప్రపంచ వ్యాప్తంగా 60 దేశాల్లో ‘కొవాగ్జిన్‌’ టీకాకు అనుమతి తీసుకునే ప్రక్రియను భారత్‌ బయోటెక్‌ చేపట్టింది. ఇప్పటికే పలు దేశాలు దీనికి అత్యవసర వినియోగ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. మెక్సికో, ఫిలిప్పీన్స్‌, ఇరాన్‌, పరాగ్వే, గ్వాటిమాలా, నికరాగ్వా, గయానా, వెనెజులా, బోట్స్‌వానా, జింబాబ్వే దేశాల్లో అత్యవసర అనుమతి వచ్చింది. అమెరికాతో పాటు పలు ఐరోపా దేశాల్లో సైతం అత్యవసర అనుమతి కోసం ప్రయత్నాలు చేపట్టినట్లు కంపెనీ వెల్లడించింది. వివిధ దేశాల్లో ప్రభుత్వాలు ఒక్కో టీకా డోసుకు 15 - 20 డాలర్ల వరకు చెల్లిస్తున్నట్లు పేర్కొంది.

కొవిడ్‌-19 టీకా దిగుమతులపై కస్టమ్స్‌ సుంకం రద్దు!
పరిశీలిస్తున్న ప్రభుత్వం

దిల్లీ: విదేశాల నుంచి దిగుమతి చేసుకునే కొవిడ్‌-19 టీకాలపై 10 శాతం కస్టమ్స్‌ సుంకాన్ని ప్రభుత్వం రద్దు చేసే అవకాశం ఉంది. తద్వారా ఆ టీకాల ధర తక్కువగా ఉండేలా చూడొచ్చని భావిస్తున్నారు. మే 1 నుంచి 18 ఏళ్లు మించిన అందరికీ కొవిడ్‌ టీకా ఇచ్చేందుకు ప్రభుత్వం అనుమతించిన సంగతి తెలిసిందే. టీకాలకు కొరత రాకుండా చూసేందుకు దేశీయ టీకాలకు అనుబంధంగా విదేశీ టీకాలను కూడా అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం భావిస్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ నెలలో లేదంటే వచ్చే నెల ప్రారంభంలో రష్యా టీకా స్పుత్నిక్‌ వి రానుంది. మొడెర్నా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌లు కూడా తమ టీకాలకు అత్యవసర అనుమతులు ఇవ్వాల్సిందిగా భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ప్రస్తుతం విదేశాల నుంచి భారత్‌కు దిగుమతి అవుతున్న టీకాలపై 10% కస్టమ్స్‌ సుంకం, 16.5% ఐజీఎస్‌టీ, సామాజిక సంక్షేమ సర్‌ఛార్జీని ప్రభుత్వం వసూలు చేస్తోంది. కస్టమ్స్‌ సుంకాన్ని తొలగించే అంశంపై త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వెల్లడించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని