క్యాన్స‌ర్ క‌వ‌ర్ పాల‌సీ ఎందుకంటే...

కానీ క్యాన్స‌ర్ క్లెయిమ్‌లు త‌క్కువ‌గా ఉన్న‌ప్ప‌టికీ, చికిత్స‌కు అయ్యే ఖ‌ర్చు చాలా ఎక్కువ‌. దీనిని స‌మ‌ర్థవంతంగా ఎదుర్కునేందుకు మాన‌సికంగా, శారీర‌కంగా, ఆర్థికంగా అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలి.

Published : 25 Dec 2020 14:19 IST

భార‌త‌దేశంలో మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు, ర‌క్త‌పోటు మొద‌లైన వ్యాధుల‌కు గురైయ్యే వారి సంఖ్య ప్ర‌తిసంవ‌త్స‌రం పెరుగుతూనే వ‌స్తుంది. అంటువ్యాధులు, క్యాన్స‌ర్ వంటివి వీటిలో అత్యంత ప్ర‌మాద‌క‌రమైన వ్యాధులు. ప్ర‌తి వారం బీమాసంస్థ‌ల‌కు వ‌స్తున్న ఆరోగ్య బీమా క్లెయిమ్‌ల‌లో డ‌జ‌న్ల కొల‌ది క్లెయిమ్‌లు క్యాన్స‌ర్, అంటువ్యాధుల‌కు గురైన వారి వ‌ద్ద నుంచి వ‌స్తున్నాయి. ప్ర‌తి ఆసుప‌త్రిలో న‌మోదు అవుతున్న నివేదిక‌ల ఆధారంగా దోమ‌లు, వైర‌స్ ద్వారా వ‌చ్చే వ్యాధులు ఎక్కువ‌గా ఉన్నాయి. అయితే ఇలాంటి వ్యాధుల‌కు ఒక‌టి, రెండు రోజులు ఆసుప‌త్రిలో ఉండి చికిత్స తీసుకుంటే స‌రిపోతుంది. వీటికి అయ్యే ఖ‌ర్చు కూడా త‌క్కువ‌గానే ఉంటుంది. కానీ క్యాన్స‌ర్ క్లెయిమ్‌లు త‌క్కువ‌గా ఉన్న‌ప్ప‌టికీ, చికిత్స‌కు అయ్యే ఖ‌ర్చు చాలా ఎక్కువ‌. అందువ‌ల్ల ప్ర‌జలు క్యాన్స‌ర్ పేరు వింట‌నే భ‌యాందోళ‌న‌ల‌కు గురౌతున్నారు. ముఖ్యంగా రొమ్ము క్యాన్స‌ర్. ఈ వ్యాధికి గురైయ్యే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. అయితే భ‌య‌ప‌డినంత మాత్రాన వ్యాధి న‌యంకాదు క‌దా!, దీనిని స‌మ‌ర్థవంతంగా ఎదుర్కునేందుకు మాన‌సికంగా, శారీర‌కంగా, ఆర్థికంగా అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలి. ఎడెల్విస్ టోకియో లైఫ్ ఇన్సురెన్స్ వారు ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనం ప్ర‌కారం క్యాన్సర్‌కు అధునాత‌న శ‌స్త్ర చికిత్స‌ల‌ను అందించేందుకు అయ్యే ఖ‌ర్చు స‌గ‌టున రూ. 10 ల‌క్ష‌లు నుంచి రూ.14 ల‌క్ష‌ల వ‌ర‌కు అవుతుంద‌ని తేలింది.

భార‌త‌దేశంలో నివ‌సించే 75 శాతం కుటుంబాల వారి వార్షిక ఆదాయం కంటే క్యాన్స‌ర్ చికిత్స‌కు అయ్యే ఖ‌ర్చు ఎక్కువ‌ని ఈవై నిర్వ‌హించిన మ‌రొక అధ్య‌య‌నంలో తేలింది. ఇందుకోసం రుణం తీసుకుంటే వాటిని తిరిగి చెల్లించ‌డం క‌ష్ట త‌రంగా మారుతుంది. క్యాన్స‌ర్ వంటి శస్త్ర చికిత్స‌ల‌ను దృష్టిలో ఉంచుకుని బీమా సంస్థ‌లు ఆరోగ్య బీమా హామీని పెంచుతూ పెంచుతూ అనేక ర‌కాల పాల‌సీల‌ను అభివృద్ధి చేశాయి. ఇందులో ముఖ్యంగా మూడు రకాలు పాల‌సీలు అందుబాటులో ఉన్నాయి: 1.రెగ్యూల‌ర్ మెడీక్లెయిమ్ 2. క్రిటిక‌ల్ ఇల్‌నెస్ 3. స్టాండ్ఎలోన్ క్యాన్స‌ర్ ప్లాన్లు

  1. రెగ్యూల‌ర్ మెడీక్లెయిమ్ ఇన్సురెన్స్‌:

పీఈటీ స్కాన్లు, ఎమ్ఆర్ఐ లేదా ఇత‌ర అత్యాధునిక‌ ఉప‌క‌ర‌ణాల‌ను ఉప‌యోగించి చేసే డ‌యాగ్నాస్టిక్లు, కీమోథెర‌పీ, రేడియేష‌న్ చికిత్స‌లు, చికిత్స పూర్త‌యిన అనంత‌రం తీసుకునే సంర‌క్ష‌ణ ఖర్చుల‌ను రెగ్యూల‌ర్ మెడీక్లెయిమ్ ఇన్సురెన్స్ క‌వ‌ర్ చేస్తుంది. ఓర‌ల్ కీమోథెర‌పీ, హార్మోన‌ల్ ట్రీట్‌మెంట్‌, సైబర్నైఫ్ చికిత్స‌, కొన్ని ర‌కాల చ‌ర్మ క్యాన్స‌ర్‌ల‌ను కొన్ని పాల‌సీలు క‌వ‌ర్ చేయ‌వు. మెడీ క్ల‌యిమ్ ఇన్సురెన్స్, క్యాన్స‌ర్‌ను మాత్ర‌మే కాకుండా ఇత‌ర అనారోగ్యాల‌ను కూడా క‌వ‌ర్ చేస్తుంది.

  1. క్రిటిక‌ల్ ఇల్‌నెస్ ఇన్సురెన్స్‌:

జీవిత బీమాకి అదనపు అనుబంధంగా 15 సంవత్సరాల క్రితం క్రిటికల్ ఇల్‌నెస్‌పాల‌సీని మొట్టమొదటిసారిగా ప్ర‌వేశ‌పెట్టారు. అయితే, ఆరోగ్య బీమా సంస్థలు క్రిటిక‌ల్ ఇల్‌నెస్ అవ‌స‌రాన్ని గుర్తించి అనేక స్టాండ్ఎలోన్ క్రిటిక‌ల్ ఇల్‌నెస్ పాల‌సీల‌ను రూపొందించాయి. ఈ పాల‌సీలు వ్యాధికి అయ్యే ఖ‌ర్చు మొత్తం చెల్లించ‌వు. బీమా సంస్థ‌ల జాబితాలో ఉన్న క్యాన్స‌ర్, లేదా ఇత‌ర క్రిటిక‌ల్ ఇల్‌నెస్ వ్యాధులు నిర్ధ‌రాణ అయితే పాల‌సీ ప్ర‌కారం నిర్థిష్ట మొత్తాన్ని చెల్లిస్తారు. ఈ పాల‌సీని కొనుగోలు చేసే నాటికి ఆరోగ్యంగా ఉండాలి. అవ‌స‌రం అయితే ఆరోగ్య ప‌రీక్ష‌లు చేయించుకుని నివేదిక‌లు బీమా సంస్థ‌కు అందించాలి.

  1. స్టాండ్ఎలోన్ క్యాన్స‌ర్‌ ప్లాన్‌:

ఇటీవ‌ల కాలంలో కొన్ని బీమా సంస్థ‌లు, స్టాండ్ఎలోన్ క్యాన్స‌ర్‌ పాల‌సీల‌ను అందిస్తున్నాయి. బీమా కొనుగోలు చేసిన వ్య‌క్తి క్యాన్స‌ర్‌కు గురైన‌ట్లు నిర్ధార‌ణ అయితే పాల‌సీ ప్ర‌కారం హామీ మొత్తాన్ని చెల్లిస్తాయి. క్రిటిక‌ల్ ఇల్‌నెస్‌, స్టాండ‌ర్డ్ మెడీ క్లెయిమ్ పాల‌సీల‌తో పోలిస్తే, క్యాన్స‌ర్ ప్రారంభ ద‌శ‌లో ఉన్న‌వారికి మెడిక‌ల్ ప‌రీక్ష‌లు పూర్తికాకుండానే చెల్లించే అవ‌కాశం ఉంటుంది. క్యాన్స‌ర్‌తో సంబంధం లేని వ్యాధులు ఇప్ప‌టికే ఉన్న వారు ఈ పాల‌సీని కొనుగోలు చేయ‌వ‌చ్చు. కొన్ని పాల‌సీల‌లో క్యాన్స‌ర్‌ను ప్రారంభ‌ద‌శ‌లో గుర్తించిన నాటి నుంచి త‌రువాతి ప్రీమియంల‌ను చెల్లించ‌వ‌ల‌సిన అవ‌స‌రం లేదు.

ఏ పాల‌సీని కొనుగోలు చేయాలి? మీ మొద‌టి ప్రాధాన్య‌త రెగ్యూల‌ర్ మెడీక్లెయిమ్ పాల‌సీకి ఇవ్వ‌డం మంచిది. హామీ మొత్తం రూ. 20 ల‌క్ష‌లు లేదా అంత‌కంటే ఎక్క‌వ ఉండే విధంగా చూసుకోవాలి. ఇది క్రిటిక‌ల్ ఇల్‌నెస్ స్టాండ్ఎలోన్ పాల‌సీల‌కు ప్ర‌త్నామ్నాయంగా ప‌నిచేస్తుంది. మీ ఆరోగ్య స్థితి, చెల్లించ‌గ‌లిగే ప్రీమియం ఆధారంగా పాల‌సీని ఎంపిక చేసుకోవాలి. 50 సంవ‌త్స‌రాల వ‌య‌సులో క‌నీస హామీ మొత్తం రూ. 20 ల‌క్ష‌లు ఉండే విధంగా క్రిటిక‌ల్ ఇల్‌నెస్ పాల‌సీ తీసుకోవ‌డం మంచిది. ఇందుకు వార్షికంగా రూ. 25 వేల నుంచి 30 వేల వ‌ర‌కు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. స్టాండ‌ర్డ్ ఎలోన్ ధ‌ర రూ. 3 వేల నుంచి రూ. 5 వేల వ‌ర‌కు ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని