ఈ అయిదు అంశాలతో మీ రుణ చరిత్ర మారుతుందా?

స్కోరు పై ప్రభావం చూపని విషయాలు ఏంటో తెలుసుకుంటే ఎలాంటి సందేహాలకూ తావు లేకుండా ఉంటుంది

Published : 09 Jul 2021 14:00 IST

పిల్లల చేతిలో డబ్బు ఉంటే వారికి ఆనందం. అదే పెద్దల జేబు లో ఉండే డబ్బు బాధ్యతాయుతంగా ఉండాల్సిన అవసరాన్ని తెలియజేస్తుంది. ఆర్ధిక విషయాల్లో తీసుకునే ప్రతి నిర్ణయమూ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. పెట్టుబడులకు సంబంధించిన అంశాలే కాదు..మనం ఖర్చు చేసే ప్రతి రూపాయీ రానున్న రోజుల్లో మన ఆస్తి, అప్పులు, ఆర్ధిక స్థితిగతులను నిర్ణయిస్తుంది. మీరు డబ్బును ఎలా ఖర్చు పెడతారనే విషయం పైనే మీ రుణ చరిత్ర, క్రెడిట్ స్కోర్ ఆధార పది ఉంటాయి. దాన్ని బట్టే బ్యాంకులు మీ ఆర్ధిక పరిస్థితుల మీద అవగాహనకు వస్తాయి. అయితే, డబ్బుకు సంబంధిచిన ప్రతి అంశమూ రుణం చరిత్రను ప్రభావితం చేస్తుందనుకోవడం పొరపాటే.

సునీల్ ఆర్ధిక విషయాల్లో చాలా పట్టుదలతో ఉండే వ్యక్తి. భవిష్యత్తులో గృహ రుణం తీసుకోవాలనే ఆలోచన లో ఉన్నాడు. దీంతో క్రెడిట్ స్కోరు, రుణ చరిత్ర విషయాల్లో ఎన్నో జాగ్రత్తలు పాటించడం ప్రారంభించాడు. ప్రతి దాన్నీ రుణ చరిత్ర తో ముడిపెట్టి చూడటం అతనికి అలవాటైంది. ఇది కాస్త ఇబ్బంది కలిగించే అంశమే. అందుకే, అసలు క్రెడిట్ స్కోరు పై ప్రభావం చూపని విషయాలు ఏంటో తెలుసుకుంటే ఎలాంటి సందేహాలకూ తావు లేకుండా ఉంటుంది. 

కాస్త విరామం ఇస్తే:
పండుగలు వచ్చినప్పుడో, ఇంట్లో శుభకార్యాలు నిర్వహించాల్సి వచ్చినప్పుడో క్రెడిట్ కార్డు పై కొనుగోలు చేస్తుంటాం. దీనివల్ల ఆ ఒక్క నెలలో మీరు పూర్తిగా పరిమితి ని వాడుకున్నట్లు అవుతుంది. తర్వాత రెండు  మూడు నెలల పాటు క్రెడిట్ కార్డు వాడలేదనుకోండి. అప్పుడు మీ క్రెడిట్ స్కోరు పై ఎలాంటి ప్రభావమూ ఉండదు. కార్డును వాడటం, క్రమం తప్పకుండ బిల్లులు చెల్లించడం వల్ల క్రెడిట్ స్కోరు పెరుగుతుందన్న మాట నిజమే. అయితే, వాడకుండా ఉంటే తగ్గుతుందన్న మాట అపోహే. అవసరం ఉన్నప్పుడే క్రెడిట్ కార్డు వాడటం అనేది మీ ఆర్ధిక క్రమశిక్షణను సూచిస్తుంది కూడా. 

డెబిట్ కార్డు వాడినప్పుడు :
క్రెడిట్ కార్డుకూ డెబిట్ కార్డుకూ ఎంతో వ్యత్యాసం ఉంది. మన ఖాతా లో డబ్బు ఉన్నప్పుడు మాత్రమే డెబిట్ కార్డు ద్వారా కొనుగోళ్లు జరపగలము. డెబిట్ కార్డు ద్వారా లావాదేవీలు నిర్వహించినప్పుడు మీ రుణ చరిత్ర పై ఎలాంటి మచ్చా పడదు. క్రెడిట్ స్కోరు కూడా తగ్గదు..పెరగదు.

ఆదాయం తగ్గిపోతే:
కొంతమందికి అనుకోకుండా ఉద్యోగం పోవచ్చు. ఉద్యోగం మారినప్పుడు కొన్ని ప్రయోజనాలు దూరం కావచ్చు. నూతన ఉద్యోగం లో చేరడానికి కొంత సమయం పట్టచ్చు. ఇలాంటివన్నీ వ్యక్తిగత ఆర్ధిక స్థోమత పై ప్రభావం చూపిస్తుంటాయి. కానీ, స్వల్ప కాలం లో క్రెడిట్ స్కోరు, రుణ చరిత్ర కు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. అయితే, మీరు నగదు నిర్వహణ విషయం లో చూపించే పద్ధతుల ఆధారంగా దీర్ఘకాలంగా ఇబ్బంది రావచ్చు. ఉదాహరణకు మీకు వచ్చిన బోనస్ ను విహార యాత్రల ఖర్చులకు ఉపయోగించకుండా, గృహ రుణం ముందస్తు చెల్లింపు కోసం వాడారనుకుందాం. అప్పుడు మీరు ఆర్ధిక క్రమశిక్షణ తో, తెలివిగా వ్యవహరిస్తున్నట్లే లెక్క. అప్పుడు మీ క్రెడిట్ స్కోరు పెరిగేందుకు ఆస్కారం ఉంటుంది. 

దరఖాస్తు తిరస్కరణ:
పదే పదే క్రెడిట్ కార్డుల కోసం, రుణాల కోసం దరఖాస్తు చేయడం వల్ల మీరు అప్పుల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారనే భావన కలిగిస్తాయి. అయితే, క్రెడిట్ కార్డు దరఖాస్తును అంగీకరించినా, తిరస్కరించినా మీ రుణ చరిత్ర పై ఎలాంటి ప్రభావం చూపకపోవచ్చు. ఇది క్రెడిట్ కార్డు విషయం లోనే కాదు, రుణాల విషయం లో కూడా ఇంతే.

వివాహం అయితే:
ఒక వ్యక్తి జీవితం లో వివాహం, పిల్లలు కలగడం ఎంతో కీలకమైన అంశాలు. వీటివల్ల ఆర్ధికంగా ఒక వ్యక్తి జీవితం లో కొత్త బాధ్యతలు వస్తాయి. ఆర్ధిక ప్రణాళికలు, పెట్టుబడుల విషయం లో  అనేక మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. సురక్షితమైన మదుపు పథకాలకు ప్రాధాన్యం పెరుగుతుంది. పొదుపు చేసే మొత్తం తో పాటు, జీవిత బీమా రక్షణ కూడా పెంచుకోవాల్సిన తరుణం ఇదే. ఇలాంటి ముఖ్యమైన ఆర్ధిక విషయాల్లో చోటు చేసుకునే మార్పులతో మీ క్రెడిట్ స్కోరు, రుణ చరిత్ర కు అస్సలు సంబంధం ఉండదు. అయితే, మీరు ఇప్పటికే తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లిస్తున్నారా? లేదా అనేదే ఇక్కడ ప్రధానం.   
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని