Investment in gold: నగలే కాదు.. బంగారాన్ని ఈ రూపంలోనూ కొనొచ్చు!
బంగారంలో పెట్టుబడులు పెట్టడానికి ఆభరణాలతో సహా 5 మార్గాలున్నాయి....
ఇంటర్నెట్ డెస్క్: ధరలతో సంబంధం లేకుండా భారత్‌లో బంగారానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా మన దేశంలో పసిడిపై విపరీతమైన ఆకర్షణ. పైగా ధనత్రయోదశి సందర్భంగా బంగారానికి బాగా డిమాండ్ ఉంటుంది. అయితే, బంగారంలో పెట్టుబడులు పెట్టడానికి ఆభరణాలతో సహా 5 మార్గాలున్నాయి. ఇవి ఫిజికల్ గోల్డ్ (నగలు, ఆభరణాలు), డిజిటల్ గోల్డ్, గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, ప్రభుత్వ లేదా సార్వభౌమ పడిడి బాండ్లు.
బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడం వల్ల దొంగతనం, నాణ్యత సమస్యలు, ఆభరణాల తయారీ సమయంలో నష్టాలు మొదలైనవి ఉంటాయి. మరోవైపు డిజిటల్ గోల్డ్.. ఆర్బీఐ, సెబీ, ఏ ఇతర నియంత్రణ సంస్థ పరిధిలోకి రాదు. అందువల్ల నియంత్రణ పర్యవేక్షణ లేదు. గోల్డ్ ఈటీఎఫ్, మ్యూచువల్ ఫండ్లు రెండూ బంగారం ధరల అస్థిరత కారణంగా మార్కెట్ రిస్క్‌ను కలిగి ఉంటాయి. సార్వభౌమ గోల్డ్ బాండ్స్ మాత్రం భారత ప్రభుత్వం హామీ ఇచ్చిన డెరివేటివ్ ప్రోడక్ట్.
బంగారం పెట్టుబడి నుండి వచ్చే రాబడులు పెట్టుబడి ఎంపికను బట్టి కొద్దిగా మారవచ్చు. సార్వభౌమ గోల్డ్ బాండ్లతో సంవత్సరానికి 2.5% కచ్చితమైన రాబడిని పొందవచ్చు. మరోవైపు, దేశీయ బంగారం ధరలను ట్రాక్ చేసే ‘గోల్డ్ ఈటీఎఫ్’ కూడా మంచి ఎంపిక. భౌతిక బంగారం విషయానికొస్తే వివిధ రాష్ట్రాలలో ధరలు కొద్దిగా భిన్నంగానే ఉంటాయి. ఆభరణాల తయారీకి అదనపు ఛార్జీలు, తరుగు మీకు రావలసిన లాభాలను తగ్గిస్తాయి. దీంతో భౌతిక బంగారం విషయంలో పెద్దగా అదనపు రాబడులు రావనే చెప్పాలి. బంగారాన్ని వెంటనే నగదు రూపంలోకి మార్చుకోగలిగే ఆస్తిగా పరిగణిస్తారు. భౌతిక బంగారం, డిజిటల్ గోల్డ్, గోల్డ్ ఈటీఎఫ్‌లు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్లను మార్కెట్లో సులభంగా కొనుగోలు చేయవచ్చు, అమ్మవచ్చు కూడా. అయితే సార్వభౌమ గోల్డ్ బాండ్ 8 సంవత్సరాలు మెచ్యూరిటీ వ్యవధిని కలిగి ఉంటుంది. కానీ 5 సంవత్సరాలు లాక్-ఇన్ పీరియడ్ పూర్తయిన తర్వాత ఈ బాండ్లను ముందుగానే క్యాష్ చేసుకోవచ్చు. ప్రత్యామ్నాయంగా వాటిని సెకండరీ మార్కెట్లో కూడా తక్కువ ధరకు విక్రయించవచ్చు.
బంగారంపై ఆదాయ పన్ను..
రుణ నిధుల మాదిరిగానే, మూలధన లాభాల పన్ను నియమాలు బంగారానికి వర్తిస్తాయి. కాబట్టి, 3 ఏళ్ల లోపు బంగారంలో పెట్టిన పెట్టుబడిని వదులుకుంటే, మీ ఆదాయపు పన్ను శ్లాబ్ ప్రకారం స్వల్పకాలిక మూలధన లాభాలుగా పరిగణిస్తారు. 3 సంవత్సరాల తర్వాత విక్రయిస్తే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఛార్జి వర్తిస్తుంది. ఆ విధంగా ఇండెక్సేషన్‌తో 20% ఛార్జి పడుతుంది. అయితే, సార్వభౌమ గోల్డ్ బాండ్లు 5, 8 సంవత్సరాల మధ్య రిడీమ్ చేస్తే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్ను నిబంధనల నుండి మినహాయింపు పొందవచ్చు. కానీ, సార్వభౌమ గోల్డ్ బాండ్ల వడ్డీ పెట్టుబడిదారుల పన్ను శ్లాబ్ ప్రకారం పన్ను విధిస్తారు. ఎందుకంటే వడ్డీ ద్వారా వచ్చే ఆదాయం ఇతర వనరుల నుంచి వచ్చే ఆదాయం కింద వర్గీకరిస్తారు.
అయితే సుదీర్ఘకాలం పెట్టుబడి పెట్టాలనుకుంటే బంగారం ధర పెరుగుదల, అదనంగా 2.5% వడ్డీ వస్తుంది కాబట్టి సార్వభౌమ గోల్డ్ బాండ్ మంచి ఎంపికగానే మార్కెట్ నిపుణులు పరిగణిస్తున్నారు. అయితే పెట్టుబడి కాలపరిమితి తక్కువగా ఉంటే గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులను పరిగణలోకి తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
జపాన్‌లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్