Reliance: ఒక్కో షేరుకు రూ.375.. స్టెర్లింగ్ అండ్‌ విల్సన్‌కు రిలయన్స్‌ ఆఫర్‌

ఈపీసీ సంస్థ స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ సోలార్‌ లిమిటెడ్‌లో (ఎస్‌డబ్ల్యూఎస్‌ఎల్‌) కొనుగోలు చేసిన ఒక్కో షేరుకు రూ.375 చెల్లించేందుకు రిలయన్స్ సిద్ధమైంది....

Published : 27 Oct 2021 13:11 IST

దిల్లీ: ఈపీసీ సంస్థ స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ సోలార్‌ లిమిటెడ్‌లో (ఎస్‌డబ్ల్యూఎస్‌ఎల్‌) కొనుగోలు చేయదలిచిన ఒక్కో పబ్లిక్‌ షేరుకు రూ.375 చెల్లించేందుకు రిలయన్స్ సిద్ధమైంది. ఇలా రూపాయి ముఖ విలువ కలిగిన మొత్తం 4.91 కోట్ల పబ్లిక్‌ షేర్లను కొనుగోలు చేసేందుకు రిలయన్స్‌ ముందుకు వచ్చినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఎస్‌డబ్ల్యూఎస్‌ఎల్ పేర్కొంది. ఇది కంపెనీ పబ్లిక్‌ హోల్డింగ్‌లో 25.9 శాతానికి సమానమని తెలిపింది. ఈ లెక్కన ఈ లావాదేవీ విలువ రూ.1,840 కోట్లుగా నమోదవనుంది. ఆర్‌ఐఎల్‌ కొత్తగా ప్రారంభించిన ఇంధన సంస్థ రిలయన్స్‌ న్యూ ఎనర్జీ సోలార్‌ లిమిటెడ్‌తో పాటు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌, రిలయన్స్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ కూడా ఈ కొనుగోలులో పాల్గొననున్నాయి.

2030 నాటికి 100 గిగావాట్ల సౌర విద్యుత్తు ప్రాజెక్టులు ఆవిష్కరించాలనే లక్ష్యంతో ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) వడివడిగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా నార్వేకు చెందిన సౌర ప్యానెళ్ల తయారీ సంస్థ ఆర్‌ఈసీ సోలార్‌ను 771 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.5800 కోట్ల)తో కొనుగోలు చేసింది. దేశీయంగా స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ సోలార్‌లో 40 శాతం వాటాను రూ.2,845 కోట్లకు పలు విడతల్లో కొనుగోలు చేస్తున్నట్లు అక్టోబర్‌ 10న తెలిపింది. తొలి విడతో భాగంగా 25.9 శాతం షేర్లను ఓపెన్‌ ఆఫర్‌లో రూ.1,840 కోట్లకు కొనుగోలు చేసేందుకు తాజాగా ముందుకు వచ్చింది.

మిగిలిన 15.46 శాతం వాటాకు సమానమైన 2.93 కోట్ల షేర్లను ప్రిఫరెన్షియల్‌ కేటాయింపుల కింద పొందేందుకు రూ.1,098 కోట్లు వెచ్చిస్తామని రిలయన్స్ గతంలో తెలిపింది. తదుపరి 9.7 శాతం వాటాకు సమానమైన 1.84 కోట్ల షేర్లను రూ.690 కోట్లతో కోనుగోలు చేయనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని